రాష్ట్రీయం

మోసం.. దగా.. దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 23: నమ్మిన వారిని మోసం చేయడంలో, అవినీతి అక్రమాలతో దోచుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెంబర్ వన్‌గా మారారని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరులో శనివారం మధ్యాహ్నాం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని తాను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దానని, అందుకే రాష్ట్రానికి 650 అవార్డులు వచ్చాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు చెబుతున్నదానిలో నిజం లేకపోలేదని, అన్యాయ పాలన చేసి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడంలో ఆయన నెంబర్ వన్‌గానే ఉన్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలోనూ, రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, మహిళలపై మంత్రుల నేరాలు, శాసనసభను దుస్సాసన సభగా మార్పు చేయడంలో, ప్రతిపక్ష పార్టీ నాయకులపై హత్యా రాజకీయాలు, అక్రమ కేసుల బనాయింపు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో, దేముడి భూములను కొల్లగొట్టడం, విశాఖ, రాజధాని ప్రాంతాల్లో భూ కుంభకోణాలు, ఇసుక, బొగ్గు వంటి గనులను దోచుకోవడంలో, సి.పి.ఎస్. ఉద్యోగులను మోసం చేయడం వంటి వాటిలో చంద్రబాబు పాలన నెంబర్ వన్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి మాఫియాను తయారు చేసి లంచం ఇస్తేగాని ఏ పని చేయకుండా చేయడంలో కూడా బాబు నెంబర్ వన్‌గానే ఉన్నారని జగన్ విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే మద్యం బెల్టు షాపుల నివారణకు తొలి సంతకం చేస్తానని అప్పటిలో ఇచ్చిన హామీ ఏమయ్యిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాలుగైదు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి తాగుడు ఆంధ్రప్రదేశ్‌గా మార్చన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అవహేళన చేశారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయించడంలో కూడా బాబు పాలన నెంబర్ వన్‌గానే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో హత్యలు, మోసాలు, అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయని, ఇటువంటి దుష్టపాలన సాగించిన బాబు ధర్మానికి ధర్మదాతగా, హరిశ్చంద్రుడికి తానే నిజాలు నూరిపోసినట్టుగా మాట్లాడుతున్నారని జగన్ ఎద్దేవా చేసారు. ప్రజలను నిలువునా దగా చేసిన చంద్రబాబు ప్రస్తుతం మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ కొత్త పల్లవిని అందుకున్నారని, దీనిని నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అయిదేళ్ళ బాబు పాలనలో ఎవరి జీవితాలు బాగుపడలేదని, ఇటువంటి పాలన మనకు అవసరమా అంటూ ఆయన నిలదీసారు. అధికారంలో ఉంటూ అవకాశం ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయని బాబు తాను మళ్లీ అధికారంలోకి వస్తే అది చేస్తాను, ఇది చేస్తానంటూ చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా తనకు అండగా ఉండి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తాను అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువస్తుందని, అందరి జీవితాలు బాగుపడతాయని ఆయన అన్నారు. అయితే ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు ప్రతి గ్రామానికి డబ్బులు పంపించి ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు పాలనను ప్రజలంతా గమనించి, డబ్బుల కోసం మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు బలికావద్దని ఆయన కోరారు. తాను అధికారంలోకి వస్తే మీ పిల్లలను బడికి పంపిస్తే ఇచ్చే 15 వేల రూ.లు ఇవ్వడమే కాకుండా, ప్రతి పేద విద్యార్థిని ఇంజనీర్, డాక్టర్‌గా చదవిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయతను కాపాడేందుకు తాను చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో అరకులోయ పార్లమెంట్, పాడేరు నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు గొట్టేటి మాధవి, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పలువురు నాయకులు, మన్యం నలుమూలల నుంచి వచ్చిన అశేష గిరిజన ప్రజానీకం పాల్గొన్నారు.

చిత్రాలు.. విశాఖపట్నం జిల్లా, పాడేరు ఎన్నికల సభలో మాట్లాడుతున్న వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి.
*సభకు హాజరైన ప్రజలు