రాష్ట్రీయం

ఉత్తరాంధ్రను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిధులు, నీళ్ల్లు, నియామకాల్లో ఉత్తరాంధ్రకు నిర్దిష్టమైన వాటాను, రాష్ట్ర బడ్జెట్‌లో 15 నుండి 20 శాతం నిధులను ఉత్తరాంధ్రకు కేటాయించాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్, బోలంగీర్- కలహండి- కోరాపూర్ తరహా ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న విధంగా ఈ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గల అభివృద్ధి మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం పట్ల ఈ ప్రాంతాల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నేతలు మాటలే తప్ప చేతల్లో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. హామీల వర్షం కురిపించడం తప్ప ఆచరణలో పట్టించుకోక పోవడం పట్ల ఆవేదన కలుగుతోంది. ఈ ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని అర్థం చేసుకుని ప్రస్తుత ఎన్నికల సందర్భంగా వారు లేవనెత్తుతున్న అంశాలను తమ ఎన్నికల ప్రణాళికలలో చేర్చడానికి రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. లేనిపక్షంలో సమీప భవిష్యత్‌లో రాష్ట్రం పట్ల ఈ ప్రాంతాల ప్రజల్లో చెలరేగుతున్న అసంతృప్తి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొనే దిశకు మారే ప్రమాదం లేకపోలేదు.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మొత్తం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిక జిల్లాలు అనడంలో ఎవ్వరికీ సందేశం ఉండనవసరం లేదు. పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ వెనుకబడి ఉండటం.. కనీసం వౌలిక సదుపాయాలకు సైతం నోచుకోలేక పోవడం ఈ ప్రాంత ప్రజల దుస్థితి. ఈ విషయానే్న జసిటస్ శ్రీకృష్ణ కమిషన్ తమ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం, నిర్లక్ష్యం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతోంది. ఈ వివక్షతను నివారించి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించవలసిన సమయం నేడు ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన నీళ్లు, నియామకాలు, నిధుల విషయాల్లో ఆ రాష్ట్రంకన్నా ఎన్నో రెట్లు తీరని అన్యాయం ఈ ప్రాంతానికి జరుగుతోంది.
ఉత్తరాంధ్ర నుండి కొనసాగుతున్న వలసలను అరికట్టే ప్రయత్నాలే జరగడం లేదు. మొత్తం 24 లక్షల ఎకరాల సాగు భూములుండగా 8 లక్షల ఎకరాలకు మించి సాగునీటి వసతి లేదు. కనీసం ఒక్క పంటకైనా మొత్తం వ్యవసాయ భూములకు సాగువసతి కల్పించడానికి నిర్దిష్ట కార్యాచరణ పథకాలను చేపట్టాలి.
ఉత్తరాంధ్ర అజెండా - 2019 ఎన్నికలు
ఈ అంశంపై మూడు జిల్లాల్లోనూ ’ఉత్తరాంధ్ర చర్చ వేదిక’ ఆధ్వర్యంలో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసాం. ఒక అజెండాను తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చాం. తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో పొందుపరచమని కోరాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమి చేయాలో సూచించడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లు కృషి చేస్తున్న నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసాం. ఈ కమిటీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కేఎస్ చలం వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ రమణ, మాజీ ఎంపీ డా. కే శంకరరావు, రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ముత్యాలనాయుడు ఉన్నారు. ఈ నిపుణుల కమిటీ త్వరలోనే ఒక నివేదికను, ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌ను రూపొందించి అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తుంది.
ముఖ్యంగా నిధులు, నీళ్ల్లు, నియామకాల్లో ఉత్తరాంధ్రకు నిర్దిష్టమైన వాటాను కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో 15 నుండి 20 శాతం నిధులను ఉత్తరాంధ్రకు కేటాయించాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్, బోలంగీర్- కలహండి- కోరాపూర్ తరహా ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న విధంగా ఈ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గల అభివృద్ధి మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. విద్య, ఉపాధి, తదితర రంగాలలో స్థానికుల హక్కులను కాపాడాలి. అందుకోసం వారికి తగిన రేజర్వేషన్లను కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న స్థానికులు, స్థానికేతరుల సంఖ్యను ముందుగా తేల్చాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
విశాఖపట్నంలో పూర్తిస్థాయి రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి. ఉద్దానం కిడ్నీ బాధితులను పూర్తిగా ఆదుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో, లాభదాయకంగా పనిచేసేందుకు వీలుగా క్యాప్టివ్ మైన్‌లను ఏర్పరచాలి. హైకోర్ట్ బెంచ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలి. ఉత్తరాంధ్ర భాష, పలుకుబడిని పరిరక్షించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్ర భాష, యాసలను కించపరిచే విధంగా వస్తున్న సినిమాలు, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలపై తగు చర్యలు తీసుకోవాలి. 2012లో ప్రకటించిన అరకు గిరిజన డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. విభజన హామీల మేరకు ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. గిరిజనుల వనరులను కొల్లగొట్టకుండా తగు చర్యలు తీసుకోవాలి. అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూముల హక్కులకు సంబంధించిన వివాదాలు అన్నింటిని సానుకూలంగా పరిష్కరించాలి. గిరిజనులు రోగాలబారిన పడి మరణించకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలి.
మత్యకారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి. వారికి కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీన పరచుకొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్థులు అధిక శాతంలో ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం రెల్లి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకోవాలి. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన రాజకీయ నాయకులకే సీట్లలో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానితో స్థానిక ప్రజల మనోభావాలను, ఈ ప్రాంత అభివృద్ధి అవసరాలను వారు పట్టించుకోవడం లేదు. అందుకే ఎంపీ, ఎమ్యెల్యే, ఎమ్యెల్సీ, మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖలోని విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ వలే అభివృద్ధి చేయాలి. విశాఖ మెట్రో రైల్ పనులను వెంటనే చేపట్టాలి. విశాఖపట్నం ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కూడా కావడంతో ఈ ప్రాంతం మరో భోపాల్ కాకుండా పర్యావరణ పరిరక్షణకు నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలి. విశాఖ సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులు నత్తనడకలోనే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడానికి సంవత్సరానికి కనీసం రూ.5,000 నిధులను కేటాయించాలి.
గోదావరి, మహానదులను అనుసంధానం చేసి, ఈ ప్రాంతానికి న్యాయమైన నీటి వనరులను కేటాయించాలి. వంశధార, ఝంజావతి, బహుధాలతోపాటు ఉత్తరాంధ్రలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లన్నింటినీ నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలి. ఉత్తరాంధ్రలో గల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒడిశా రాష్ట్రంతో గల జల వివాదాలను సత్వరం పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలి. విశాఖ పోర్ట్‌కు అనుబంధంగా భావనపాడు, నక్కపల్లిలో సాటిలైట్ పోర్టులను నిర్మించాలి. ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను సత్వరం కల్పించాలి. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవడంతోపాటు నిర్వాసితులకు తగు పరిహారం, పునరావాసం పనులను సత్వరం చేపట్టాలి.
ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నవేమీ గొంతెమ్మ కోర్కెలు కావు.. న్యాయబద్ధమైనవి.. సహేతుకమైనవి.. చట్టబద్దమైనవి.. కాబట్టి వీటిని తమ ఎన్నికల ప్రణాళికల్లో జోడించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు పట్ల తమ చిత్తశుద్ధిని, నిజాయతీని ప్రకటించడంలో అన్ని రాజకీయ పార్టీలు మొదటి అడుగు వేయాలని కోరుతున్నాం.
- కొణతాల రామకృష్ణ
మాజీ ఎంపీ, మాజీ మంత్రి
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక
konathalark09@gmail.com