రాష్ట్రీయం

ఆ ఎనిమిది కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వీటిలో సగం సీట్లు ప్రతిష్ఠాకరంగా మారాయి. నాలుగు చోట్ల సిట్టింగ్‌లను పక్కనబెట్టి కొత్తవారికి టికెట్ ఇవ్వడం, అలాగే 10 మంది కొత్త ముఖాలను బరిలోకి దించడం వంటి కారణాలతో ఎనిమిది స్థానాలు టీఆర్‌ఎస్‌కు కీలకంగా మారాయి. ఈ ఎనిమిది చోట్ల ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ, టీపీసీసీకి చెందిన ముఖ్యులు బరిలో నిలవడంతో గట్టి పోటీనే ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభ ఎన్నికల్లో తమకు వీచిన ప్రభంజనమే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని టీఆర్‌ఎస్ భావిస్తున్నా, ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ ముఖ్యనేతల రాజకీయ భవితష్యత్‌తో ముడి పడి ఉండటంతో వారికి కూడా ఈ స్థానా లు పెనుసవాల్‌గా నిలిచాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు వారి కుటుం బం నుంచి అప్పట్లో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికల బరిలో సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి కూ తురు, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక్కరే బరిలో నిలిచారు. తన సిట్టింగ్ స్థానం నిజామాబాద్ నుంచే తిరిగి కవిత బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి ప్రత్యర్థిగా బరిలో నిలిచిన మధుయాష్కి ఏఐసీసీ కార్యదర్శిగా కర్నాటక ఇంచార్జీగా ఉన్నారు. ఈ స్థానం ఇటు టీఆర్‌ఎస్‌కే కాకుండా అటు కాంగ్రెస్‌కూ ప్రతిష్ఠాకరమైందే. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి మరో మూడు చోట్ల టీపీసీసీకి చెందిన కీలక నేతలు బరిలో నిలిచారు. వీటిలో నల్లగొండ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం నుంచి బరిలో నిలిచారు. నల్లగొండ స్థానంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై బరిలోకి దింపిన టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, మల్కాజ్‌గిరి స్థానంలో రేవంత్‌రెడ్డిపై బరిలోకి దింపిన అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ రాజకీయాల్లో కొత్తే. కరీంనగర్ స్థానంలో టీఆర్‌ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌పై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మాత్రం పాత ప్రత్యర్థినే. అయినప్పటికీ ఇటు నుంచి టీఆర్‌ఎస్ కీలక నేత, అటు నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బరిలో నిలువడంతో అధికార, ప్రతిపక్ష ఇరు పార్టీలకూ ఇది కూడా ప్రతిష్ఠాకరమైన స్థానమే. టీఆర్‌ఎస్ ప్రతిష్టాకరంగా తీసుకున్న మరో స్థానం చేవెళ్ల. ఇక్కడి టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలువడంతో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్ ప్రతిష్ఠాకరంగా తీసుకుంది. ఈ స్థానంలో అభ్యర్థిని గెలిపించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభలో పార్టీ నాయకుడు జితేందర్‌రెడ్డికి టికెట్ నిరాకరించి రాజకీయాలకు కొత్త అయిన మనె్న శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. పార్టీ సీనియర్ నాయకుడిని కాదని కొత్త వ్యక్తిని అభ్యర్థిగా బరిలోకి దించడంతో ఈ స్థానం కూడా టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. అలాగే ఖమ్మం స్థానంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పక్కన పెట్టి టీడీపీ నుంచి పార్టీలో చేరిన మాజీ ఎంపి నామా నాగేశ్వర్‌రావును బరిలోకి దించింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలమైన నాయకుడిగా పేరున్న శ్రీనివాస్‌రెడ్డిని పక్కన పెట్టడంతో ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలుపు టీఆర్‌ఎస్‌కు ప్రతిష్ఠాకరంగా మారింది. అలాగే పెద్దపల్లి స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్ ప్రతిష్ఠాకరంగా తీసుకుంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎంపి వివేక్ కాకుండా చివరి నిమిషంలో పార్టీలో చేరిన నేతకాని వెంకటేశ్‌ను అభ్యర్థిగా బరిలోకి దించింది. తనను నమ్మించి గొంతు కోసారని వివేక్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం, టీఆర్‌ఎస్ కూడా అదే స్థాయిలో స్పందించడంతో పెద్దపల్లి స్థానం కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రమపక్షం ఎంఐఎంకు కేటాయించిన హైదరాబాద్ సీటు మినహా మిగిలిన 16 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌కు పై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకంగా మారాయి.