రాష్ట్రీయం

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి (99) అమెరికా హ్యుస్టన్‌లో ఆదివారం నాడు వయోభారంతో కన్నుమూశారు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం , చాలా కాలంగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించారు. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీనరసింహరావు ప్రముఖ కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే పత్రికకు సంపాదకత్వం వహించేవారు. ఆమె సోదరి వింజమూరి సీతాదేవి 2016లో మరణించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలు. హార్మోనియం వాయించడంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు, ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆమె పాట రికార్డు అయింది. ఆమె బాల మేధావి. స్వాతంత్య్రోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకు ఉంది. ఆమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రాసిన ప్రముఖ దేశభక్తి గీతం జయజయజయ ప్రియ భారత పాటకు బాణీ కట్టారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గీతాలు అనే రెండు పుస్తకాలను ఆమె 90వ ఏట చెన్నైలో 2008 ఏప్రిల్ 12న జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా యూనివర్శిటీ కళాప్రపూర్ణ అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్యారిస్‌లోనూ ఆమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రదానం చేశారు. ఇదిలావుండగా, వింజమూరి మృతిపట్ల కళాకారులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి ఆమె సేవలు చేశారని శ్లాఘించారు. సోదరి వింజమూరి సీతాదేవితో కలిసి వేలాది గీతాలను ఆలపించారని గుర్తుచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.
వింజమూరి అనసూయాదేవి (ఫైల్‌ఫొటో)