తెలంగాణ

కూతురు పుట్టలేదని... మగ శిశువును చంపేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: కొడుకు పుట్టలేదని ఆడ శిశువులను కడతేరుస్తున్న నేటి సమాజంలో కూతురు పుట్టలేదని కొడుకును హత్య చేసింది ఓ తల్లి. నెల కూడా నిండని ముక్కుపచ్చలారని మగ శిశువును హత్య చేసి.. ఆ నేరం గొలుసు దొంగలపై నెట్టేందుకు యత్నించిన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ ఎస్.అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్ పరిధిలోని దేవినగర్‌లో నివసించే శ్రీ్ధర్‌రాజ్, పూర్ణిమ (35) దంపతులకు తొలుత బాబు జన్మించాడు. రెండో కాన్పులో పుట్టిన బాబు చనిపోయాడు. మూడో కాన్పులోనూ మళ్లీ బాబు పుట్టాడు. పూర్ణిమకు మొదటి నుంచీ కూతురు జన్మించాలని కోరుకునేదని, ముగ్గురు కుమారులు జన్మించడంతో పిల్లలపై విరక్తి పెంచుకుందని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో బ్లేడుతో పసిబిడ్డ మెడపై కోయడంతో మృతిచెందాడు. ఈ నేరాన్ని గొలుసు దొంగలపై వేసేందుకు ప్రయత్నించింది. బాబును ఎత్తుకుని బయటకు వెళ్లగా గుర్తుతెలియని దుండగులు తనపై మత్తు మందు చల్లి గొలుసు దొంగిలించేందుకు యత్నించారని, ఆ పెనుగులాటలో బాబు మెడపై కత్తితో దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. పూర్ణిమ కథనంపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తనకు ఆడపిల్ల అంటే ఇష్టమని, ఇప్పుడు కూడా మగపిల్లాడే జన్మించడంతో హత్య చేసానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.
సాగర్‌కు ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్, ఏప్రిల్ 6: నాగార్జునసాగర్ జలాశయానికి బుధవారం తెల్లవారుజాము నుండి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. 2, 3 రోజులుగా శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు వస్తున్న నీటిరాక నిలిచిపోయింది. దీంతో సాగర్ జలాశయ నీటిమట్టం మరింత తగ్గుముఖం పట్టింది. బుధవారం తెల్లవారుజాము నుండి 2,061 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరగా బుధవారం సాయంత్రానికి 6,420 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 507.20 అడుగులు ఉండగా ఎడమకాల్వకు 5,120 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
తెలంగాణకు
హజ్ కోటా పెంచండి
కేంద్ర మంత్రి సుష్మాను కోరిన సిఎం కెసిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: హజ్‌యాత్రకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కోటాను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్లేందుకు 17 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 2532 మంది కోటా మాత్రమే కేటాయించడం వల్ల చాలామంది నిరాశ చెందారని తెలిపారు. కనీసం 4500 మందికి హజ్‌యాత్రకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని సిఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
కెటిఆర్ పిల్లాడు కాదు..
చిరుత: కర్నె
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కె.తారకరామారావు (కెటిఆర్) చిన్న పిల్లాడు కాదని, చిరుతపులి అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కెటిఆర్ చిన్నపిల్లాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రభాకర్ తిప్పి కొట్టారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కెటిఆర్ పంజా విసిరితే కాంగ్రెస్ నాయకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ కాలేదా అని అన్నారు. టిఆర్‌ఎస్ కార్యాలయం లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయితే, గాంధీభవన్‌లో కూర్చుని కాంగ్రెస్ నాయకులు ఇస్తామన్నది ‘కవర్’ పాయింట్ ప్రజంటేషన్ అని ఆయన ఎద్దేవా చేశారు.
లోకేశ్‌కు జైకొడుతున్న పార్టీ
మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: ప్రస్తుతం రాజకీయం అంతా యువరాజు లోకేశ్ చుట్టూ తిరుగుతోంది. యువరాజ పట్ట్భాషేక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోయినా, ఆయన పట్ట్భాషేకం కోసం పార్టీ అంతా వేచి చూస్తోంది. ఆయనను ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో గెలిపించేందుకు చాలా మంది తమతమ నియోజకవర్గాలను వదులుకోడానికి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నారు. పార్టీలో ఎవరి నోట విన్నా, లోకేష్ మాటే వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఉగాది తరువాత ఉంటుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉన్నా, లోకేశ్‌ను బాబు తన క్యాబినెట్‌లోకి తీసుకోవడం ఖాయమన్నది స్పష్టంగా తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అదే పంథాలో లోకేష్‌ను కూడా తీర్చిదిద్దాలని బాబు ఉవ్విళ్లూరుతున్నారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఐటి శాఖ అప్పగిస్తారన్న ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతోంది. తెలంగాణలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కూడా ప్రస్తుతం అదే శాఖను చూస్తున్నారు. అందుకే లోకేష్‌కు కూడా ఆ శాఖ అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

టిఎస్‌పిఎస్‌సి ద్వారానే
‘గురుకుల’ నియామకాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో వివిధ గురుకుల విద్యాలయాల్లో 2444 పోస్టులను టిఎస్‌పిఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోషల్‌వెల్ఫేర్ గురుకులాల్లో 758, బిసి వెల్ఫేర్ గురుకులాల్లో 307, ప్రభుత్వ గురుకులాల్లో 313, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 436, మైనార్టీ వెల్ఫేర్ గురుకులాల్లో 630 పోస్టులను భర్తీ చేయాలని టిఎస్‌పిఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది.
‘పుర్రె గుర్తు’ తగ్గించేందుకు
కేంద్రాన్ని ఒప్పిస్తా
నిజామాబాద్ ఎంపి కవిత భరోసా
కోరుట్ల, ఏప్రిల్ 6: తెలంగాణలోనే లక్షలాది మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ కట్టలపై పుర్రె గుర్తు చిన్న సైజ్‌లో మద్రించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీడీ కార్మికుల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా అదనపు ట్రిప్పులు చేయించి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చుతామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోకుండా ఉండేలా ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు బొమ్మను చిన్న సైజ్‌లో ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీడీ కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్వర్ణకారులు బంగారంపై వ్యాట్ ఎత్తివేయాలని ఎంపి కవితకు వినతి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ పాల్గొన్నారు.

అమెరికా వీసా స్కాంలో
తెలుగువారే సూత్రధారులు

మోసపోయిందీ మనవారే జైలు ఊచలు లెక్కిస్తున్న 300 మంది చైనా, భారత్‌ల నుండి 1076 మంది గాలిలో యూనివర్శిటీ
అడ్డగోలుగా వీసాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: భారీ వీసా కుంభకోణానికి పాల్పడ్టారని ఆరోపిస్తూ అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్విస్టిగేషన్ యూనిట్ అరెస్టు చేసిన 10 మంది ఎన్‌ఆర్‌ఐలలో ముగ్గురు తెలుగువారే కీలక నిందితులుగా చెబుతున్నారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సైతం తెలుగువారి ప్రమేయాన్ని ఖరారు చేసింది. దీంతో బాధితులు, నిందితులు సైతం తెలుగువారే కావడం విచిత్రమైన పరిస్థితి. ఐ-20 జారీ, హెచ్ 1బి, ఎఫ్-1 వీసాల జారీలో జరుగుతున్న మతలబును గుర్తించేందుకు అమెరికాలోని హోంల్యాండ్ అధికారులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. అందులో భాగంగా వారే ఒక నకిలీ యూనివర్శిటీని ప్రారంభించారు. ఆ మేరకు ఫేస్‌బుక్‌లో కూడా ఒక అకౌంట్ తెరిచారు. దానిని చూసి భారత్ సహా 26 దేశాలకు చెందిన వారు సంప్రదించడం, భారీగా నిధులు ఇస్తామని తమకు వీసాలు ఇప్పించాలని తాము చదువుకోవడానికి రావడం లేదని, కేవలం ఉద్యోగాల కోసం వస్తున్నామని పేర్కొంటూ ప్రలోభ పెట్టారు. ఈ తరహా ‘రిక్వెస్టులు’ చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలను హోంల్యాండ్ అధికారులు ట్రాప్ చేశారు.
యూనివర్శిటీ ఆఫ్ నార్తరన్ న్యూజెర్సీ (యుఎన్‌ఎన్‌జె) పేరిట గాలిలో విశ్వవిద్యాలయాన్ని సృష్టించి అందులో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇస్తూ, చేరిన వారికి పని పర్మిట్లను జారీ చేయడం ద్వారా భారీ కుంభకోణానికి వీరంతా పాల్పడినట్టు అమెరికా హోంల్యాండ్ అధికారులు చెబుతున్నారు. హోంల్యాండ్‌లో పనిచేస్తున్న వీరంతా కలిసి నకిలీ యూనివర్శిటీని సృష్టించి దాని ద్వారా ఒకే సమయంలో స్టూడెంట్, వర్కు పర్మిట్ వీసాలు రెండింటినీ బాహ్య ఏజెంట్లు జారీ చేశారు. అలా వీసాలు పొందిన 21 మందిని స్థానిక అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ స్కామ్‌లో మొత్తం 1076 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులే 300 మంది వరకూ ఉన్నారు,మిగిలిన వారు భారత్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, మరికొంత మంది చైనాకు చెందిన వారని తెలిసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నవారే ఈ నకిలీ యూనివర్శిటీని సృష్టించడంపై అంతటా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. అమెరికాలో పనిచేసేందుకు వీసాలు, వర్కుపెర్మిట్లు పొందేందుకు భారతీయులు భారీ మొత్తంలో ఈ బ్రోకర్లకు సొమ్ము చెల్లించారని తేలింది. దాదాపు ఏడాది పాటు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అధికారులను, బ్రోకర్లను, ఏజెంట్లను, రిక్రూటర్లను, యాజమాన్యాలను అరెస్టు చేసింది. అరెస్టు అయిన తెలుగు వారిలో తాజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టి ఉన్నారు. వీరితో పాటు జ్యోతి పటేల్, షహజాద్ ఎం పర్వీన్, నేంద్ర సింగ్ ప్లాహా, సంజీవ్ సుఖిజా, హర్‌ప్రీత్ సచ్‌దేవ, అవినాష్ శంకర్, సయ్యద్ ఖాసిం అబ్బాస్ తదితరులున్నారు. అధికారులు సృష్టించిన నకిలీ యూనివర్శిటీలో అసలు అధ్యాపకులు గాని, క్లాసులు గానీ అసలైన విద్యార్ధులు గానీ లేకపోయినా బ్రోకర్లు మాత్రం ఆ పేరును ఉపయోగించుకుని డబ్బు తీసుకుని వీసాలు ఇప్పించారు. వాళ్లకు ప్రధానంగా ఐ-20 ఫారాలను జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఈ తరహా బెడద ఎక్కువైపోవడంతో అమెరికన్ అధికారులు ఈ ఫేక్ యూనివర్శిటీని సృష్టించి దాని ద్వారా మొత్తం డొంక కదిలించేందుకు వ్యూహం పన్నారు.

అక్రమ రవాణా వల్ల
ఏటా రూ.572 కోట్ల నష్టం

- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: అక్రమ రవాణా వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి)కు ఏటా రూ.572 కోట్ల నష్టం వాటిల్లుతోందని, ఇందుకు కారణంగా గుర్తించిన 391 రూట్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా, ఓవర్‌లోడింగ్, ఆర్టీసితో సమన్వయం తదితర అంశాలపై బుధవారం సచివాలయంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసి జెఎండి రమణారావు, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్రమ రవాణా కారణంగా ఆర్థికంగా ఆర్టీసి దెబ్బతింటున్నందున జిల్లాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి పరిస్థితిని చక్కదిద్దాలని అన్నారు. గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌తో ఆర్టీసికి 4.88 లక్షల మంది ప్రయాణీకులు అదనంగా పెరగడం, తద్వారా ఆర్టీసికి రూ.4.88 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్టీసి జెఎండి రమణారావు తెలిపారు. 26,556 వాహనాలను తనిఖీ చేసి 3336 వాహనాలను సీజ్ చేశామని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.
డిటిసిలు, ఆర్టీవోలు కింది స్థాయి అధికారులతో కలిసి ఆర్టీసి, పోలీసులు, ఆర్టీసి విజిలెన్స్ విభాగం కలిసి కట్టుగా అక్రమార్కుల మీద కఠినంగా వ్యవహరించాలని, ఒత్తిడులకు తలొగ్గరాదని మంత్రి సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశాలను గురించి వివరాలు సేకరించిన మంత్రి, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు.
అనుమతి లేని వాహనాలపై చర్యల తీసుకోవాలని, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు లేకుండా చూడాలని చెప్పారు. ఓవర్ లోడ్ వాహనాలతో రోడ్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి రాష్ట్రంలో చొరబడుతున్న తెల్ల క్యాబ్‌ల నియంత్రణ చేయాలని కోరారు. ఎపిలో తిరిగే 90 రూట్ పర్మిట్ల కాలం పూర్తయిన నేపధ్యంలో ఆ రాష్ట్రంతో సంప్రదించాలని అధికారులు కోరగా, అవసరమైతే ఎపి రవాణా శాఖ మంత్రితో సమావేశమవుతామని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసి ఈడిలు పురుషోత్తమ్‌నాయక్, నాగరాజు, సత్యనారాయణ, బోర్డు కార్యదర్శి రవీందర్, జెటిసిలు వెంకటేశం, పాండురంగ నాయక్, రఘునాత్ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట మున్సిపోల్ ప్రశాంతం

71.38 శాతం పోలింగ్ నమోదు

సిద్దిపేట, ఏప్రిల్ 6: దశాబ్దకాలం తర్వాత జరిగిన మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు చెదురు, మదురు సంఘటనల మినహా బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల్లో 71.38శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్‌లోని 34 వార్డులకు 6వార్డులు ఏకగ్రీవమైనాయి. 28వార్డు ల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని 28వార్డులకు 72పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ద్వారా పోలింగ్‌ను పరిశీలించారు. సమస్యాత్మక స్టేషన్లలో వీడియోగ్రఫీ చేయించారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల వద్ద తాగునీరు, మజ్జిగ, ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. 74,710మొత్తం ఓటర్లకు 53,327మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 26,792 మహిళలు, 26,535 పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్‌పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తీరును సూక్ష్మ పరిశీలకులు పరిశీలించారు. ఉదయం 7గం.కు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. మొదటి 2 గంటల్లో కేవలం 16.52 శాతం నమోదు కాగా సాయంత్రానికి 71.38 శాతం నమోదైంది. సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరగడంతో కొన్ని వార్డుల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని వార్డుల్లో తక్కువ సంఖ్యలో క్యూలో ఉన్నారు. పట్టణంలో టిఆర్‌ఎస్, బిజెపి పోటాపోటీగా తలపడ్డ 14, 17 వార్డుల్లో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు పోటాపోటీగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లోకి అధికార పార్టీ నాయకులు వెళుతున్నారని బిజెపి నేతలు ఫిర్యాదు చేయగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాల చెదరగొట్టి స్వల్పంగా లాఠీలకు పని చెప్పారు. పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీసుమతి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. డిఎస్పీ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్‌ఐలు పెట్రోలింగ్ నిర్వహిస్తు పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల నేతలు, కార్యకర్తలు లేకుండా చెదరగొట్టారు. ఎన్నికల పరిశీలకులు దినకర్‌బాబు పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈవిఎంలను స్థానిక ఇందూర్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.

సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే
కరవు విలయ తాండవం
బిజెఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఏప్రిల్ 6: కరవును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రాష్ట్రంలో కరవు తీవ్రత అధికమైందని బిజెఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆయన నేతృత్వంలోని బిజెపి కరవు బృందం జిల్లాలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి, హాలియా మండలాల్లో పర్యటించి ఎండిన పంటలు, తోటలు, చెరువులను పరిశీలించింది. నల్లగొండ మండలం రసూల్‌పురంలో రైతు గుండెబోయిన చంద్రయ్య వరి పంట, బత్తాయి తోటను, దాసరి వెంకన్న వరి పంటను పరిశీలించారు. వర్షాలు లేక బోర్లు అడుగంటి సాగునీరందక పంటలు ఎండిపోయినట్లుగా రైతులు లక్ష్మణ్‌కు వివరించారు. ముశంపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు ఇరుగు చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం కోసం సిఎం, కలెక్టర్‌ను సంప్రదిస్తామన్నారు. తమ పార్టీ తరపున ఐదువేల నగదు, బస్తా బియ్యం అందించాలని జిల్లా కమిటీని ఆదేశించారు.
రైతు జక్కలి దశరథ మూడెకరాల ఎండిన వరి పొలాన్ని పరిశీలించగా అతను ఐదు బోర్లు వేసినా చుక్క నీరు పడక అప్పుల పాలైనట్లుగా లక్ష్మణ్ బృందానికి తన గోడు వినిపించాడు. తదుపరి కనగల్ మండలం ఇరుగండ్లపల్లిలో ఆలకుంట్ల యాదయ్య ఎండిన పొలాన్ని పరిశీలించారు. ఎండిన తన వరి పంటలో పశువులను మేపుతున్న కుమ్మరిగూడెం వెంకన్న పొలాన్ని వారు పరిశీలించి సమస్యలు విన్నారు. తిప్పర్తి మండలం చెర్వుపల్లిలో నరసింహారెడ్డికి చెందిన ఎండిన చెరకు తోటను సందర్శించారు. అనంతరం హాలియాలో కరవుతో అడుగంటి నెర్రెలు బారిన పెరూర్ సముద్రం చెరువును లక్ష్మణ్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరవు తీవ్రతపై ఆలస్యంగా కేంద్రానికి నివేదిక పంపినప్పటికి ముందెన్నడు లేనంతగా 791 కోట్ల కరవు సహాయాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర నిధులకు తోడుగా రాష్ట్రం కూడా జిల్లాకు 50 కోట్లు మంజూరు చేసి రైతులను, కూలీలను ఆదుకుని తాగునీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణ దిశగా రుణామాఫీని ఒకేసారి మంజూరు చేసి ఖరీఫ్‌లో రైతులకు పంటలు రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పశుగ్రాసం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతు రుణాల కోసం బడ్జెట్‌లో 6 లక్షల కోట్ల కేటాయింపులు చేసిందన్నారు. బిజెపి కరవు బృందంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్‌కుమార్, బంగారు శృతి, అధికార ప్రతినిధి కె.శ్రీ్ధర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి జి.మనోహర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు ఓరుగంటి రాములు, పి.శ్యాంసుందర్, పి.సాంబయ్య, బాకి పాపయ్య ప్రభృతులు ఉన్నారు.

యాదాద్రిలో ప్రధాని సోదరుడి పూజలు

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 6: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాదభాయి దామోదర్‌దాసు మోదీ బుధవారం సందర్శించారు. ఆయన ఆలయంలో దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని, సిఎం కేసిఆర్ ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. స్వామి వారి దర్శనం తనకు ఎంతో ఆహ్లాదాన్నీ, అనుభూతినీ కలిగించిందన్నారు. ఆయన వెంట ఆల్ ఇండియా డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, జ్యోతి దర్శి కిరణ్‌పాల్ తదితరులున్నారు.