రాష్ట్రీయం

గోదావరి తీర్పు ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి జిల్లాల ఓటర్ల తీర్పు ఎటువైపుందోనని రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నామో నామమాత్రంగానైనా తమ తీరును వెల్లడించకుండా జరిపిన నిశ్శబ్ద ఓటింగ్ వారిలో ఒకింత భయాన్ని సైతం కలిగిస్తోంది. మహిళా ఓటర్లు సైతం తెల్లవారుజాము మూడు గంటల వరకు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్న చైతన్యం ఏ చారిత్రక తీర్పునకు గోదావరి జిల్లాల జాగృతి దోహద పడనుందోనని, ఎటువంటి విలక్షణ తీర్పునకు ఆలంబనో అని పోలింగ్ సరళిని బట్టి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పార్టీలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన చూస్తుంటే అభ్యర్ధులెవరికీ గెలుపుపై ధైర్యం లేదని తెలుస్తోంది. విలక్షణ రాజకీయాలకు ఆలవాలమైన గోదావరి జిల్లాల ఓటరు నాడి ఈ సారి పైకి కన్పించ లేదు. ఓటర్లు చాలా గుంభనంగా వ్యవహరించారు. నిశ్శబ్దంగా ఓటర్లలో మార్పు కన్పించింది. ఆ మార్పు ఎవరి భవిష్యత్‌ను తలకిందులు చేస్తుందో తెలియడం లేదు. గోదావరి జిల్లాల్లో ఒక బలమైన సామాజికవర్గం మాత్రం తమ బలమేమిటో అధికార పార్టీకి తెలియజేయాలనే ఒక కృతనిశ్చయంతో, కసితో ఉనికి పోరాటానికి అంకితమై తమ పట్టును ప్రదర్శించారని స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్న పిల్లలను సైతం రప్పించి మరీ ఓట్లు వేయించారు. గోదావరి జిల్లాల్లో పట్టు, పంతం ప్రదర్శించారు. గెలుపు మాటెలా ఉన్నప్పటికీ ఇది తమ ఉనికి పోరాటంగా వారంతా జాగృతి అయ్యారు.
దీనికి తోడు ఓటుకు చాలా అధిక మొత్తంలో ఆశించారని, ఆశించిన స్థాయిలో తమకు డబ్బు అందకపోవడం, కొంతమందికి ఇచ్చి, మరి కొంత మందికి అసలు అందకపోవడం వంటి కారణాలతో ఓటర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆగ్రహానికి గురైన ఓటర్లు ప్రత్యామ్నాయంగా ఆలోచించి ఆ పార్టీకి వేసినట్టు తెల్సింది. అందరికీ ఇచ్చారు..మాకెందుకు ఇవ్వరు ఈసారి మీకు ఓటేసేది లేదు చూడండి అన్న వారి ఆగ్రహం, ఆక్రోశం స్పష్టంగా బయట పడింది. ఆఖరికి ప్రత్యామ్నాయ మార్పు దిశగా అయాచితంగా కలసి వచ్చిందని తెలుస్తోంది. ఆశాభంగం కాస్తా ప్రత్యామ్నాయ మార్పు దిశగా రూపాంతరం చెందింది. గెలుపు కోసం కాదు గానీ మలుపు అన్నట్టుగా సంఘటితమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఓట్లు కోసం పిల్లలు పెద్దలతో ఓట్లు వేయించుకున్నారు. నవతరం ఓటర్ల కోసమైనా పెద్దల ఓట్లు వేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పొచ్చు. ఇదే సామాజిక సంఘటిత శక్తి ఎక్కడెక్కడ నుంచో ఉద్యోగాలకు సెలవులు పెట్టించి బూత్‌ల వద్దకు రప్పించగలిగింది. తెల్లవారుజాము మూడు గంటల వరకు పోలింగ్ బూత్ లైన్‌లో నిలబడేలా చేయడం చూస్తుంటే ఈ నిశ్శబ్ద చైతన్యం ఎవరి కొంప ముంచనుందోననేది కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఓటుకు డబ్బు ఇస్తామని ఇవ్వకపోవడం, పంచుతామని పక్కదారి పట్టించడం, ఓటర్లకు ఇవ్వకుండా ఓటర్ల పేరు చెప్పి ద్వితీయ శ్రేణి నాయకులు తినేయడం, స్థానిక నాయకులు ఓటర్ల కోపానికి లోనయ్యారు. ఈ కోపం ఎవరి కొంప ముంచనుందో అనే అంశంపై కూడా పోలింగ్ అనంతరం అభ్యర్ధులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మార్పు కోరుకోవడం ఒకెత్తయితే, మరో వైపు కోపంతో ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవడంతో అయాచితంగానే ‘మార్పు’నకు దోహదపడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి జిల్లాల్లో క్రాస్ ఓటింగ్‌కు దారి తీసిందని తెలుస్తోంది. ఈ క్రాస్ ఓటింగ్ కాస్తా చాలా నిశ్శబ్దంగా ఒకపార్టీకి దక్కిందని చెప్పొచ్చు. కాగా, రాజమహేంద్రవరం లోక్‌సభ బరిలో జనసేన అభ్యర్ధి వదలకుండా ఉండి వుంటే ప్రధాన పోటీ ఇచ్చిన పార్టీగా మారేదని, చేజేతులారా వదిలేశారని పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి జనసేన కాస్తంత కసిగా పని చేసి వుంటే ఇది వచ్చే సీటని అనుకుంటున్నారు. అయినప్పటికీ ఈ నిశ్శబ్దంగా జరిగిన క్రాస్ ఓటింగ్‌లో జనసేన ద్విముఖ పోటీకి చేరిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం లోక్‌సభ బరిలో వైసీపీకి, జనసేనకు మాత్రమే పోటీ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ బెడద మూడవ స్థానంలో ఉన్న పార్టీ విజయానికి దోహదం చేసి అవకాశాలు కూడా లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి పార్టీపరమైన వర్గం ఓటుతో పాటు మహిళా, పింఛన్‌దారులు, రైతులు, కాపు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల పరంగా విడిపోయి జాగృతి చూపినట్టు తెలుస్తోంది.