రాష్ట్రీయం

తగ్గిన ఉత్తీర్ణతా శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బీ. జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఏ. అశోక్ కుమార్, పరీక్షల కంట్రోలర్ సుశీల్ కుమార్ గురువారం సాయంత్రం విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఫస్టియర్, సెకండియర్‌లోనేగాక, వొకేషనల్ విభాగంలోనూ పరీక్షల ఫలితాల శాతం బాగా తగ్గింది. 2018లో ఫస్ట్‌ఇయర్ 62.73 శాతం మంది ఉత్తీర్ణులుకాగా, ఈ ఏడాది 60.5 శాతంగా నమోదైంది. సెకండియర్‌లో గత ఏడాది 67.06 శాతం రాగా, ఈ ఏడాది 64.8 శాతం వచ్చింది. వోకేషనల్ ఫలితాల్లో గత ఏడాది ఫస్టియర్‌లో 58.55 శాతం రాగా ఈ ఏడాది 53.2 శాతం వచ్చింది. సెకండియర్‌లో గత ఏడాది 69.56 శాతం రాగా, ఈ ఏడాది 67.7 శాతం మాత్రమే వచ్చింది.
సెకండియర్ ఫలితాలు..
సెకండియర్ పరీక్షలకు జనరల్ రెగ్యులర్ అభ్యర్ధులు 3,82,534 మంది, ప్రైవేటు అభ్యర్ధులు 68,960 మంది, వోకేషనల్‌లో రెగ్యులర్ అభ్యర్ధులు 35,734 మంది, ప్రైవేటు అభ్యర్ధులు 3,121 మంది పరీక్ష రాశారు. వీరిలో జనరల్‌లో రెగ్యులర్ అభ్యర్ధులను తీసుకుంటే 1,49,574 మందికి ఏ గ్రేడ్ దక్కింది. 65,388 మందికి బీ గ్రేడ్, 25,013 మందికి సీ గ్రేడ్, 7,780 మందికి డీ గ్రేడ్ దక్కింది. 2,47,755 మంది ఉత్తీర్ణులు కాగా, మొత్తం మీద ఉత్తీర్ణత శాతం 64.8, బాలికలు 70.8 శాతం, బాలురు 58.2 శాతం పాసయ్యారు. 1,98,430 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో 1,40,549 మంది పాసయ్యారు. బాలురు 1,84,104 శాతం రాయగా వారిలో 1,07,206 మంది పాసయ్యారు. ప్రైవేటులో 68,960 మంది పరీక్ష రాయగా, వారిలో 16,924 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ రెగ్యులర్ 24,194 మంది, ప్రైవేటు అభ్యర్ధులు 1,441 మంది పాసయ్యారు.
ఫస్టియర్ ఫలితాలు..
ఫస్టియర్ జనరల్‌కు 4,09,133 మంది వొకేషనల్‌కు 43,520 మంది హాజరయ్యారు. జనరల్‌లో ఏ గ్రేడ్ 1,28,913 మందికి బీ గ్రేడ్ 70,054 మందికి, సీ గ్రేడ్ 33,449 మందికి, డీ గ్రేడ్ 14,991 మందికి వచ్చాయి. మొత్తం ఉత్తీర్ణత 60.5 శాతంగా నమోదైంది. బాలికలు 2,09,982 మంది రాయగా వారిలో 1,38,704 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,99,151 మంది బాలురు పరీక్ష రాయగా, వారిలో 1,08,703 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 66 కాగా, బాలుర ఉత్తీర్ణత 55 శాతమని బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు.
గత మూడేళ్లలో..
2017లో జనరల్ ఫస్టియర్ ఉత్తీర్ణత 57.37 శాతం, సెకండియర్ 67 శాతం, 2018లో ఫస్టియర్ 62.73 శాతం, సెకండియర్ 67.06 శాతం, 2019లో ఫస్టియర్ 60.5 శాతం కాగా సెకండియర్ 64.8 శాతం పాసయ్యారు.
23 నాటికి మార్కుల జాబితాలు
23వ తేదీ నాటికి బొర్డు అభ్యర్ధుల మార్కుల జాబితాలను ఆయా కాలేజీలకు పంపిస్తుందని, అభ్యర్ధులు వాటిని 23వ తేదీ తర్వాత పొందవచ్చని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. మార్కుల జాబితాల్లో పొరపాట్లు ఉంటే వాటిని వచ్చే నెల 18వ తేదీలోగా బోర్డు దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.
పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు
ఫస్టియర్, సెకండియర్ అభ్యర్ధులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజును ఈ నెల 25వ తేదీలోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి తెలిపారు.
ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్
ఫస్టియర్ అభ్యర్ధులు పరీక్ష ఫీజుకు తోడు ఒక్కో పేపర్‌కు 150 రూపాయిలు అదనంగా చెల్లించి ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరుకావచ్చని ఆయన చెప్పారు. ఎక్కువ మార్కులు ఎందులో వస్తే వాటిని కొనసాగిస్తామని ఆయన వివరించారు. ఒక వేళ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు అన్ని సబ్జెక్టులు రాస్తే కొత్తగా వచ్చిన మార్కులనే కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
సెకండియర్ ఇంప్రూవ్‌మెంట్
2017 తర్వాత ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న వారు ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరుకావచ్చు, అయితే వారు ఫస్టియర్ తరహాలో కాకుండా మొత్తం సబ్జెక్టుల ఫలితాలను ఎంచుకోవల్సి ఉంటుంది. రెండోసారి రాసినవా లేదా మొదటి సారి రాసినవా ఎంచుకోవాలి, అంతే తప్ప ఏది ఎక్కువ మార్కులు వస్తే అదే అనే అవకాశం వీరికి ఉండదు.
మే 14 నుండి సప్లిమెంటరీ
మే 14వ తేదీ నుండి ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. అయితే పంచాయతీ సంస్థల ఎన్నికల నేపథ్యంలో తేదీలు మార్చాలా వద్దా అన్నది శుక్రవారం నాడు నిర్ణయించి తుది టైమ్‌టేబుల్‌ను విడుదల చేస్తామని కార్యదర్శి అశోక్ తెలిపారు. రీ కౌంటింగ్‌కు వంద రూపాయిలు, రీ వెరిఫికేషన్‌కు పేపర్‌కు 600 రూపాయిలు ఈ నెల 25లోగా చెల్లించాలని అన్నారు.
మేడ్చల్ టాప్
సెకండియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, మహబూబాబాద్ 49 శాతంతో చివరిలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 62 శాతం, రంగారెడ్డి 72 శాతం, కొమరం భీం జిల్లా 75 శాతం ఉత్తీర్ణత సాధించింది.
చిత్రం..ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తున్న విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్, పరీక్షల కంట్రోలర్ సుశీల్ కుమార్