రాష్ట్రీయం

నాడు విద్యార్థిగా.. నేడు సీఎంగా.. పోరాటంలో రాజీ పడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 20: నాడు ఎస్వీయూ విద్యార్థిగా విద్యార్థుల సమస్యలపై పోరాడాను. విద్యార్థి దశలోనే ఎమ్మెల్యే అయి నియోజకవర్గ ప్రజల సమస్యలపైన పోరాడాను. నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా. తన చివరి ఊపిరి వరకు ప్రజా, రాష్ట్ర హక్కుల కోసం ఎవరితోను రాజీపడే ప్రసక్తేలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. శనివారం తిరుపతిలోని కోట కొమ్మల వీధిలో ఎన్‌టిఆర్ ట్రస్టు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను బాబు తన సతీమణి, ఎన్‌టిఆర్ ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరితోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలో జరుగుతున్న కుట్రపూరిత విధానాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. అందుకే భవిష్యత్తులో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగేలా పోరాటం చేస్తానన్నారు. ఈవీఎంల విధానం విశ్వాసం కోల్పోడంతోనే వీవీపాట్‌లను కూడా అదనంగా ఏర్పాటు చేశారన్నారు. ఈ క్రమంలో కనీసం 50 శాతం వీవీపాట్‌ల ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఇందుకు సంబంధించి 23 రాజకీయ పార్టీలను కలుపుకుని సీఈసీని కలిసి డిమాండ్ చేశారు. తాను అడుగుతున్నది అతి చిన్న డిమాండ్ అని బాబు అన్నారు. ఈవీఎంలు, వీవీపాట్‌లను లెక్కేస్తే అసలు నిజాలు ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. మరి ఎందుకు ఈసీ దీనికి అంగీకరించడంలేదో చెప్పాలన్నారు. సామాజిక న్యాయం, హక్కులపై విద్యార్థి దశ నుంచే రాజీలేని పోరాటం తన జీవితంలో ఒక నిత్యకృత్యంగా మారిందన్నారు. అందుకే రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర హక్కులు, ప్రజా సంక్షేమాలపై రాజీలేని పోరాటం చేస్తున్నానన్నారు. నాడు ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోదీ వెంకన్న పాదాల సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని మాట ఇచ్చి మాట తప్పారన్నారు. అందుకే తాను కేంద్రంతో పోరాటం చేస్తున్నానని అన్నారు. ఇందులో భాగంగానే ధర్మపోరాట దీక్షలను ఢిల్లీ వేదికగా చేపట్టానన్నారు. అంతేకాకుండా రాష్ట్ర హక్కులను కాలరాసిన మోదీ పైన శంఖారావం పూరించి దేశంలోని వివిధ పార్టీలతో కలసి పోరాడుతున్నాని అన్నారు. ప్రధాని మోదీ ఇంటి ముఖం పట్టడం ఖాయమన్నారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ, ఐటీ, ఈసీలతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవన్నారు. అయితే మోదీ నేడు ఈ స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్తలను తన చెప్పులతో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని దీనికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని బాబు చెప్పారు. దేశ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థల్లో పనిచేసే అధికారులు మోదీ కోసం కాకుండా తమ బాధ్యతలను నిస్వార్థంగా నిర్వహించాలన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో జరిగిన తొలివిడత ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టించి ఎక్కువ మంది ఓటర్లు పాల్గొనకుండా వైకాపా శ్రేణులు కుట్రపన్నారని అన్నారు. ఎన్నికలను పూర్తిగా పర్యవేక్షిస్తున్న తాను ఈవిషయాన్ని గుర్తించే ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చానన్నారు. దీంతో స్పందించిన ఓటర్లు కూడా ముఖ్యంగా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. పోలింగ్ ప్రారంభమైన తరువాత మరుసటి రోజు తెల్లవారు జామున 4.30 గంటల వరకు మహిళలు ఎంతో సహనంతో క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఇది శుభపరిణామమన్నారు. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో నీటి ఎద్దడిని నివారించి ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో తాను అధికారులతో భిన్న రూపాల్లో సమావేశాలు నిర్వహించానన్నారు. తిరుపతి సహా 4వేల గ్రామాల్లో నీటి సమస్య ఉందని సీఎం చెప్పారు. దీనిపై వైకాపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తే వారు తనను ప్రశ్నిస్తున్నారన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలో ఎక్కడా అధికారులతో సమావేశాలు జరగడం లేదా? కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహించడం లేదా? వారికి ఈసీ నిబంధనలు వర్తించకుండా, తనకు మాత్రమే నిబంధనలు వర్తిసాయా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఎన్నికల సమయంలో బీహార్, కర్ణాటక సీఎం , మాజీ ప్రధాని దేవేగౌడ హెలికాఫ్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేశారని అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఫోటోలు తీసిన అధికారిని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిందన్నారు. అంటే ఎన్నికల కమిషన్ ఎవరికి కొమ్ము కాస్తోందో సమాధానం చెప్పాలన్నారు. అనేక మంది అధికారులను బదిలీ చేసిన విషయాన్ని ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్నికాపాడు కోవడం తన ఒక్కడి బాధ్యత కాదని అధికారులు కూడా భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని ఇందులో తాను టీమ్ లీడర్ మాత్రమేనని అధికారులు కూడా భాగస్వాములేనని అన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా నరేగా పనులను గమనిస్తే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలించిందని ఆయన తెలిపారు. ఇది సమష్టి కృషితోనే సాధ్యమైయ్యిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా తాను చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి బోర్డును తయారు చేసుకున్నాడని బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోగానే తాము గెలుస్తామని జబ్బలు చరుచుకున్నవారంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడంలేదన్నారు. తన పోరాటం ఎన్నికల కమిషన్‌పై కాదని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనన్నారు. అధికారులు కూడా ఇందుకు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తన ఐదేళ్ల పాలనలో అధికారులతో పనిచేయించడానికి ప్రయత్నించానే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనికాదన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన తప్పును తానుప్రశ్నిస్తున్నానని, తనకు వెన్నుదన్నుగా ఉండాల్సిన రిటైర్డ్‌ఐఏఎస్ అధికారులు 65 మంది ఎన్నికల కమిషన్‌ను సమర్థిస్తూ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశంకు అనుకూలంగా అంతర్లీనంగా ప్రజలు అండగా నిలిచారన్నారు. రానున్న ఫలితాలే అందుకు నిదర్శనం కానున్నాయన్నారు. తన జన్మదినం రోజున ఎన్‌టిఆర్ బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
చిత్రం... తిరుపతిలో శనివారం ఎన్టీఆర్ ట్రస్టు తరఫున బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు