రాష్ట్రీయం

స్ట్రాంగ్ రూమ్‌లు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రశంసించారు. కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో 65 శాతానికి పైగా దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకోవటం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగటమే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు నిఘా కెమెరాలతో కలెక్టర్లు, ఎస్పీల నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని, ఆర్వోలు నిత్యం తనిఖీలు నిర్వహించి నివేదిక అందిస్తున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూములను రోజూ ఎవరు సందర్శిస్తున్నారో వీడియో చిత్రీకరణలతో సహా సిద్ధం చేస్తున్నామన్నారు. వినియోగంలో లేని, రిజర్వుడ్ ఈవీఎంలను కూడా కట్టుదిట్టంగా భద్రం చేశామన్నారు. స్ట్రాంగ్ రూములకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులొస్తే పరిష్కరించేందుకు అవసరమైన జిల్లా, రాష్ట్ర, ఆర్వోల స్థాయి అధికారుల సమాచారం, ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మూడు దశలుగా శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా సెంటర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల నుండి వారి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు సేకరించి, వారికి తగిన ఫొటో గుర్తింపు కార్డు జారీ చేసేందుకు చొరవ చూపాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించే అవకాశం లేనందున ఇతర ప్రాంతాల్లో వాటి భద్రతకు ఏర్పాట్లు చేయాలని ద్వివేది సూచించారు.
రీపోలింగ్‌కు విస్తృత బందోబస్తు:డీజీపీ
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ 2014తో పోలిస్తే తక్కువ పోలీస్ ఫోర్స్ ఉన్నప్పటికీ కలెక్టర్లు, ఎస్పీల చొరవతో చిన్నపాటి సమస్యలు మినహా పోలింగ్ సజావుగా నిర్వహించారని అభినందించారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టామని చెప్పారు. కౌంటింగ్ అనంతరం కూడా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నందున జిల్లాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలకు సూచించారు. రీపోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అదే రీతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఎస్ అనూరాధ, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, అదనపు సీఈఓ సుజాత శర్మ, సంయుక్త సీఈఓ డి.మార్కండేయులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం... కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం