రాష్ట్రీయం

విద్యా మంత్రిని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఇంటర్ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్‌ను అఖిలపక్షం డిమాండ్ చేసింది. మొత్తం ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం గవర్నర్‌ను కోరింది. ఇంటర్ పరీక్షా ఫలితాల ప్రకటన తరువాత నెలకొన్న గందరగోళం, ఆత్మహత్యలు, ప్రభుత్వ వైఫల్యంపై వివిధ పార్టీల నేతలు గురువారం నరసింహన్‌ను కలిశారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీజేఎస్ నేత కోదండరామ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌వి రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నేతలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజ్‌భవన్ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలు సర్కారీ హత్యలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, ప్రజలకు నమ్మకం పోయిందని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్ధపాలన వల్ల రాష్ట్రంలో తిరోగమనంలో నడుస్తోందని ఆరోపించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోవడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారన్నారు. హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఉత్తమ్ వెల్లడించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పరీక్షలను నిర్వహించలేని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో దేశానికి ఉద్ధరిస్తారా? అని నిలదీశారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఒక ఏజన్సీ ఈ ఏడాది ఆరంభం నుంచి అన్ని తప్పిదాలే చేస్తోందని ధ్వజమెత్తారు. బోర్డు నుంచి మార్కుల డేటాను స్వీకరించి అప్‌డేట్ చేయలేదన్నారు. దీనిపై ఎన్నో కాలేజీల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.
ఫిరాయింపులను నిలువరించాలి: భట్టి
ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు బలవంతం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సీఎల్‌పీని ఎలా విలీనం చేసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అవమానించడం సహించరాని విషయమన్నారు. డబ్బు, పదవులు ఎరచూపించి ఎమ్మెల్యేలను బెదిరించి కొనుగోలు చేస్తున్నారని భట్టి ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలిన ఆయన కోరారు.
మీ అస్త్రాన్ని తీయండి: షబ్బీర్ అలీ
ఇంటర్ బోర్డు వైఫల్యంతో పాటు అనేక రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు గవర్నర్ నరసింహన్ తన వద్ద ఉన్న అస్త్రాన్ని బయటకు తీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కోరారు. తన వద్ద కలం తప్ప మరో అస్త్రం లేదని గవర్నర్ తమ వద్ద ప్రస్తావించారన్నారు. తాము రాజకీయాలు చేసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లలేదని, ఇంటర్ బోర్డువైఫల్యాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, గవర్నర్ జోక్యం చేసుకుని వ్యవస్థలు నిర్వీర్యం కాకుండా రంగంలోకి దిగాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
చిత్రం...ఇంటర్ ఫలితాల అవకతవకలపై గురువారం గవర్నర్‌కు ఫిర్యాదు చేసి వస్తున్న అఖిలపక్ష నేతలు