రాష్ట్రీయం

కరవు మండలాలపై కేంద్రానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో కరవు మండలాలను ఆదుకునేందుకు కేంద్రానికి తగిన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అజెండాలోని అంశాలైన ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, ఫొని తుపాను నష్టాలు, వేసవిలో తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. రెండు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం వివరాలిలా ఉన్నాయి. ఫొని తుపాను ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో రూ 3.47 కోట్ల మేర నష్టం జరిగిందని ఇప్పటికే రూ 1.65 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు అంచనాలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. మరో 7349 మంది ఉద్యానవన రైతులకు రూ 3 కోట్ల మేర నష్టపరిహారానికి అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. ఖరీఫ్‌లో 347, రబీ సీజన్‌లో 257 కరవు మండలాలను గుర్తించామని, ఖరీఫ్‌లో రూ. 1800 కోట్లు, రబీకి రూ. 510 కోట్లుగా ఇన్‌పుట్ సబ్సిడీని అంచనా వేశామని తెలిపారు. ఖరీఫ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 900 కోట్లు మంజూరు చేసిందన్నారు. మిగిలిన 900 కోట్ల విషయమై సంప్రతింపులు జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ 58 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయిలో అంచనాలకు సర్వే జరుగుతోందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలటంతోపాటు పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని అధికారులు వివరించినట్లు తెలిసింది. ఉపాధి పనులకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల కరవు నేపథ్యంలో ప్రజలు వలస వెళుతున్నారని, నిధుల విడుదల్లో జాప్యం జరిగిందని తక్షణమే మంజూరు చేయాల్సి ఉందని తెలిపారు. మంచినీటి సరఫరాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ గ్రామాలు ఉన్నాయని, మారుమూల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలన్నారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో జాతీయ స్థాయిలో ఒకటి, రెండు స్థానాలకు పోటీ పడుతున్నామని తెలిపారు. తుపాను హెచ్చరికల విషయంలో ఆర్టీజీఎస్ కీలకపాత్ర పోషించిందని ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఈ వ్యవస్థ పొరుగు రాష్ట్రాలకు ఉపయుక్తంగా మారిందన్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందని, గత ఐదేళ్లలో అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించామని గుర్తుచేశారు.
చిత్రం... మంత్రివర్గ సమావేశంలో నవ్వుతూ మాట్లాడుకుంటున్న చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం