రాష్ట్రీయం

వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడేమీ చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ జరుగుతోందని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ స్పష్టం చేశారు. వివేకా హత్య కేసుపై ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్రంలో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 20 నుంచి 30వరకు కిడ్నీలు మార్పిడి జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడైందన్నారు. విశాఖలో డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేశామని, 100మంది డ్రగ్స్ వినియోగదారులు, పది మంది విక్రేతలను గుర్తించామన్నారు. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని నిర్వహకులు ఎవరైనా వదిలేది లేదన్నారు. మరోవైపు గడిచిన 15రోజుల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య 300 వరకు చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగమే ప్రమాదాలకు కారణమవుతోందని స్పష్టం చేశారు. కీలకమైన కేసులను ఛేదించి ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందికి పోలీసుశాఖ ప్రతి సంవత్సరం మూడు నెలలకోసారి ప్రకటించే ‘ఏబీసీడీ’ అవార్డులను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం డీజీపీ అందజేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయని, ప్రతి నెలా ఏడు నుంచి ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జంక్షన్ల వద్ద సరైన లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అదేవిధంగా రోడ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు, అతివేగం, మద్యం తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, మరోసారి సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
‘ఏబీసీడీ’ విజేతలు వీరే..
డీజీపీ ప్రకటించిన ఏబీసీడీ విజేతల్లో మొదటి స్థానం తిరుపతి ఈస్ట్ పోలీసులకు దక్కింది. అత్యంత కీలకమైన కేసును చాకచక్యంగా తిరుపతి పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 2వ తేదీన గోవిందరాజ స్వామి ఆలయంలో కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రికవరీ చేయడంలో ప్రతిభ చాటుకున్న దర్యాప్తు అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించి ప్రథమ బహుమతి అందచేశారు. అదేవిధంగా మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు ఛేదించిన తూర్పుగోదావరి జిల్లా తడికలపూడి పోలీసులకు రెండో స్థానం, హత్యాయత్నం, బంగారం దోపిడీ కేసును ఛేదించిన ధర్మవరం రైల్వే పోలీసులకు మూడోస్థానం లభించింది. బస్సులో బంగారు నగలు ఉన్న బ్యాగు చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యాన్ని చూపిన నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట పోలీసులకు నాలుగోస్థానం లభించింది. మోసం, దోపిడీ కేసులో నకిలీ పోలీసును పట్టుకున్న కర్నూలు తాలుకా పోలీసులకు ప్రోత్సాహక బహుమతి అందచేశారు. వీరందరికీ సర్ట్ఫికెట్లు పంపిణీ చేశారు.
ఇదిలావుండగా.. నకిలీ ఔషధాల కేసులో పోలీసులతో కలిసి కేసును ఛేదించడంలో కృషి చేసిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు కూడా డీజీపీ సర్ట్ఫికెట్లు అందచేశారు. 2018కిగాను దేశంలోనే ఉత్తమ పోలీస్టేషన్‌గా విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్టేషన్ ఎంపికైనందున కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు లభించిందని, అదేవిధంగా ఉత్తమ పోలీసు సంస్కరణలు అమలు చేసినందుకు ఏపీ పోలీసుకు రూ.7.69కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు అందచేసిందని ఈసందర్భంగా డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐడి అదనపు డీజీ అమిత్‌గార్గ్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, కిషోర్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.