రాష్ట్రీయం

‘కౌంట్’డౌన్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ప్రధాన పార్టీల రాజకీయ భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ రోజైన 23వ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన జాతకాలపై ఈనెల 11 నుంచి కూడికలు..తీసివేతలు.. సొంత సర్వేలలో పార్టీలు తలమునకలయ్యాయి. అయితే ఓటర్లు గుంభనంగా ఉండటంతో ఎగ్జిట్‌పోల్స్‌కు సైతం ఓటరు నాడి అంతుచిక్కటంలేదు. దీంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయావకాశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సర్వేలు పూర్తయ్యాయి. వీటిలో టీడీపీకి 110 నుంచి 120 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లు తేలిందని చెప్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ తరుపున సర్వేలు నిర్వహించిన పీకే బృందంతో పాటు కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. అయితే ఇరు పార్టీల అధినేతల్లో మాత్రం ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేస్తూ 50 శాతం వీవీ ప్యాట్ రశీదులను లెక్కించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఈ అంశంపై వైసీపీ ఆసక్తి చూపడంలేదు. ఐదేళ్ల తన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామరక్షని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేస్తుండగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక గాలిలో తమ విజయం తథ్యమని వైసీపీ అధినేత జగన్ ధీమాగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు ఈవీఎంలు మొరాయించినా మరుసటిరోజు తెల్ల వారుజాము వరకు ఓటింగ్ జరిగింది. పోలింగ్‌శాతం పెరగటం తమ పార్టీకే అనుకూలమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని తమ పార్టీ కీలకభూమిక వహిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిపై పార్టీలు ఓ అంచనాకు రాకపోవటమే ఇందుకు తార్కాణంగా రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందని ప్రకటించాయి. అదే స్థాయిలో ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనేది అంతుచిక్కటంలేదు. ఈ సారి ఓటర్లు గుంభనంగా ఉండటంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైకి మాత్రం అధినాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఒకవేళ అనుకున్న ప్రకారం సీట్లు రాకపోయినా, అధికారంలోకి రాకపోయినా క్యాడర్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మరికొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు ముంచుకు రావటంతో ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కుకోకుండా క్యాడర్‌కు ధైర్యం చెప్పుకుంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ఈసారి అనేక సర్వేలు నిర్వహించింది. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన చంద్రబాబు సైతం పోలింగ్ సరళిపై ఓ అంచనాకు రాలేక పోతున్నారని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ప్రధాన పార్టీల మనుగడ ఆధారపడి ఉందనేది స్పష్టమవుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదాన్ని, విభజన హామీల అమలును అన్ని పార్టీలు తెరపైకి తెచ్చాయి. తెలంగాణ తరహాలో సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందని భావిస్తున్నారు. అది ఎవరికి అనుకూలిస్తుందనే విషయమై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. కేంద్రంలో బీజేపీయేతర ప్రత్యామ్నాయ పార్టీల అధికారంపై టీడీపీ ఆశలు పెట్టుకుంటే ఎన్నికల వరకు పరోక్షంగా ప్రోత్సహించిన ఎన్డీఏలో వైసీపీ భాగస్వామి అవుతుందనే వాదనలు వినవస్తున్నాయి. అనివార్య పరిస్థితులు ఎదురైతే హోదా ఇస్తామనే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విషయం కూడా పరిశీలనలో ఉందని వైకాపా నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్లలో గెలుపు కంటే అత్యధిక లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునే విషయంలోనే ప్రధాన పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. కౌంటింగ్ ముగిసాక కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అయితే తాము చక్రం తిప్పవచ్చని వ్యూహరచన చేస్తున్నాయి. ఇక కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు అ‘టెన్షన్’ అవుతున్నాయి. జనసేన ఓట్లు ఎవరిని ప్రభావితం చేస్తాయనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పసుపు- కుంకుమ, పింఛన్లు, అన్నదాత- సుఖీభవ, నిరుద్యోగభృతి తమకు కలిసొచ్చే అంశాలుగా టీడీపీ ప్రచారం చేస్తోంది. కాగా తెలుగుదేశం పార్టీ అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగెత్తి ఉన్నారని ఈసారి కచ్చితంగా తాము అధికారంలోకి రావటం ఖాయమని వైసీపీ ధీమాతో ఉంది. ఇక ప్రాంతాల వారీగా, కులాల వారీగా కూడికలు, తీసివేతలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో కౌంటింగ్ ఏజెంట్లకు ఈ వారం రోజులు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పోలింగ్ రోజున అనుకోని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విషయమై అధికార వర్గాల్లో కూడా ఆందోళన నెలకొంది.