రాష్ట్రీయం

రాహుల్ ప్రధాని అయితేనే ‘హోదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తుందని, ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదాపై సంతకం పెడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. రాజకీయపార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతీయ పార్టీలు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడానికి సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర మాజీమంత్రి ఏ.సాయిప్రతాప్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడం శుభపరిణామమన్నారు. కడప నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కేంద్ర మాజీమంత్రి ఏ.సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మేయప్పన్ సాయిప్రతాప్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరగదని అన్నారు. మోదీపై దేశప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తవౌతోందని, మోదీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని మోదీ తేల్చిచెప్పారని స్పష్టం చేశారు. మోదీ పాలనలో మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. మోదీ నియంతృత్వ
ధోరణిపై ఆ పార్టీ నాయకులే అసహనంగా ఉన్నారన్నారు. కార్పొరేట్‌ల కోసం తప్ప సామాన్య ప్రజలకోసం మోదీ పాలన చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదన్నారు. కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
రాజంపేటలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తా
బలహీనవర్గాలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల వారికి అండగా నిలిచిందన్నారు. రాజంపేటలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌పార్టీ ఖచ్చితంగా గెలిచేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వటవృక్షం లాంటిదని, అప్పుడప్పుడు వడలిపోయినా తిరిగి కొత్త ఊడలతో ఎప్పటికీ పచ్చగానే ఉంటుందన్నారు. ఇక తన చివరిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సాయిప్రతాప్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నాయకులు నీలి శ్రీనివాసులు, సత్తార్, జక్కరయ్య, బేగం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.
చిత్రంలో పార్టీ జాతీయ కార్యదర్శి మేయప్పన్, తులసిరెడ్డి తదితరులు