రాష్ట్రీయం

ఏడు బూత్‌లలో నేడు రీపోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 18: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన మేరకు ఏడు పోలింగ్ బూత్‌ల్లో ఆదివారం రీపోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ పోలింగ్ బూతుల పరిధిలో ఉన్న ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పూర్తిస్థాయిలో వాతావరణం కల్పించామని, ఈ రీపోలింగ్‌లో 5,451మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీ ఎస్ ప్రద్యుమ్న తెలిపారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన రీపోలింగ్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు. తొలిసారిగా ఐదు స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించిందని, తాజాగా వెంకట్రామాపురం కుప్పం బాదూరు, కాలేపల్లిల్లో పోలింగ్ బూత్‌ల్లో కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పోలింగ్‌బూత్‌కు 250మంది పోలీసులతో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఇరుపార్టీల అభ్యర్థులు గానీ, నాయకులుగానీ, కార్యకర్తలు
గానీ ఏ చిన్న అల్లర్లకు పాల్పడినా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. పోలింగ్ జరిగే కేంద్రాలు 321 ఎన్ ఆర్ కమ్మపల్లి, 104పులివర్తివారిపల్లి, 316కొత్తకండ్రిగ, 316కమ్మపల్లి, 313వెంకట్రామాపురం, 310కాలేపల్లి, 323కుప్పంబాదూరులలో ఆదివారం ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 6గంటల వరకు నిర్వహిస్తామన్నారు. చిత్తూరు పార్లమెంటు, చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
ఒక్కో పోలింగ్‌బూతులో 60మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారని, ప్రతి పోలింగ్ బూత్‌లో ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎన్నికల పర్యవేక్షణ చేస్తుంటారన్నారు. పీఓలు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పిదాల వల్ల పోలింగ్ కేంద్రాల లోపల జరిగే పరిణామాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రీపోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రత్యేక ఉన్నతాధికారి, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఓటరు స్లిప్‌తో పాటు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వికలాంగుల విషయంలో జాగ్రత్త వహించి వారి స్థితిని బట్టి మాత్రమే వారికి తోడు పంపడం జరుగుతుందన్నారు. ఓటరు కంపార్ట్‌మెంట్‌లోనికి ఓటరు తప్ప మరెవరూ వెళ్లకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రిసైడింగ్ అధికారి మాత్రమే వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో 3800 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున అన్నింటిని వెబ్‌కాస్టింగ్‌లో పరిశీలించలేకపోవడం, పీ ఓల తప్పులు వలన ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించిందన్నారు.
చిత్రం...ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివెళుతున్న ఎన్నికల సిబ్బంది