రాష్ట్రీయం

ఎగ్జిట్‌పోల్స్‌పై నమ్మకం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని, సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఎగ్జిట్ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. దేశంలో స్థానిక సంస్థల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి విధులు, నిధులు బదిలీ చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఇప్పటకీ రాజీవ్ గాంధీ తెచ్చిన సంస్కరణలే పునాదిగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కంప్యూటర్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందన్నారు. రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఇది విచారకరమన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఐటీలో భారత్ అగ్రగామిగా ఉండేందుకు రాజీవ్ గాంధీ ప్రణాళికలే కారణమన్నారు. యువకులకు ఓటు హక్కు తెచ్చారన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను కల్పిస్తూ రాజ్యాంగసవరణలు చేశారన్నారు. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పడంలో దిట్ట, 23వ తేదీన మతతత్వశక్తులకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పనున్నారన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పరిపాలన దక్షుడని, విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టిన గొప్ప నేత అన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సంస్కరణల వల్ల కంప్యూటర్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్నామన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ దేశంలో రాజకీయ ఉగ్రవాదం పెరిగిందన్నారు. రాజీవ్ గాంధీ మరణంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు. మహానేతలను కించపరుస్తూ మాట్లాడడం దారుణమన్నారు. రాజకీయ టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ ఐదేళ్లలో ప్రధాని మోదీ ఏమి చేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ, ఐదేళ్లలో మోదీ ఏమి చేశారో జనానికి గుర్తు లేదన్నారు. కానీ రాజీవ్ గాంధీ అంటే టీవీలు, సెల్‌పోన్‌లు , ఉగ్రవాదం వ్యతిరేక పోరు, ఎన్నికల సంస్కరణలు, గ్రామాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు పనులు గుర్తుకు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంజాగుట్టలో రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
చిత్రం...రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి