రాష్ట్రీయం

మొండిఘటానికి మొట్టికాయలు తప్పవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టు, విడుపులు అన్నవి ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఇది రాజకీయాల్లో ఉన్న వారు పూర్తిగా పాటించాలి. నేనన్నదే జరగాలి.. నేను చెప్పిందే చేయాలి అన్న మొండి వైఖరి తెచ్చే చేటు ఇంతా కాదు. మన టైం బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయ కాని.. తేడా వచ్చినప్పుడే వస్తుంది చిక్కంతా. అన్నివేళలా మొండిపట్టుదల పనికిరాదని, తాను ఊహించిందే ఎల్లకాలం జరగదని తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయ. కేవలం కొద్ది నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం చెలాయంచిన ఈ గులాబి పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మొట్టికాయలు పడ్డాయ. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మిత్రపక్షానికి చెందిన ఎంఐఎంకు ఒక సీటు పోగా, మిగిలిన 16 సీట్లూ తమవేనన్న ధీమాను తలకెక్కించుకున్న ఈ గులాబి బాస్ ఈ ఎన్నికల్లో ఒకింత నిర్లక్ష్యం చూపాడనే రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధినేతగా, ఉద్యమ నాయకుడు, రాష్ట్ర, కేంద్ర అమాత్యులుగా, ఉప సభాపతిగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అందెవేసిన చేయిగా, అనుభవైక వేద్యుడైన కేసిఆర్‌ది విలక్షణ వ్యక్తిత్వం.
విద్యార్థి దశ నుండే రాజకీయాలపై మక్కువ కలిన ఆయన 1975లో ఢిల్లీకి వెళ్ళి, సంజయ్ విచార్ మంచ్‌లో చేరి, సంజయ్ గాంధీ మరణంతో తిరిగి వచ్చి, 1982లో తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి, 1983లో రాజకీయ గురువైన మదన్‌మోహన్‌పై పోటీ చేసి, కేవలం 877ఓట్ల తేడాతో ఓడారు. తిరిగి 1985లో ఎన్నికలలో విజయుడై తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 89, 94, 99, 2001లలో వరుసగా విజయాలు సాధించారు. 87-88లో రాష్టమ్రంత్రిగా, 92-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా, 1999-2001లో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా పనిచేశారు. 2001 ఏప్రిల్ 21న టీడీపీకి రాజీనామా చేసి, ఏప్రిల్ 27న తెరాస ఉద్యమ పార్టీని స్థాపించారు. 2001 మే 17న కరీంనరగ్‌లో సింహగర్జన భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధించగలమని ప్రకటించారు. 2004లో కరీంనగర్ ఎంపీగా గెలిచి, 2004 నుండి 06 వరకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఉప ఎన్నికలో కరీంనగర్ నుండి గెలిచి, 15వ లోకసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి గెలుపొందారు. 2009 నవంబర్ 29న ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, 30న జైలుకు తరలించినా దీక్షను కొనసాగించారు. తెలంగాణ ఆవిర్భావానంతరం 2014 జూన్ 2న తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో తిరిగి ఘన విజయం సాధించి మలి సిఎంగా డిసెంబర్ 13న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కేసిఆర్, రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనకు పలువురితో కలిసి శ్రీకారం చుట్టిన నాటి నుండి అనుకున్నది ఆచరించడంలో, లక్ష్య సాధనలో, గమ్యాన్ని ముద్దాడడంలో ఏనాడూ, ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడని ప్రత్యేక మనస్తత్వం ఆయనది. త్రిభాషలలో అందెవేసిన చేయి కలిగి, అనర్ఘళ, అలవోక, సమయానుకూల, పండిత పామర జనాకర్షక ప్రాసంగికుడైన కేసిఆర్ స్వీయ నిఘంటువులో రాజీ అనే పదం ఎంత వెదికినా కానరాదేమో. దీర్ఘకాలిక ఉద్యమ ప్రస్తానంలో ఎన్ని ఆటుపోటులెదురైనా, లాభనష్టాలు ఎలా ఉండబోతున్నాయని ఆలోచించక మనసులోకి వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇవ్వబూనిన విలక్షణ విధానం ఆయనది. ఉద్యమ ప్రారంభంలో వెన్నుదన్నుగా ఉన్న ఎందరో ఆయనకు దూరమైనా, ఆయన కావాలని దూరం చేసుకున్నా ఏనాడూ పట్టింపు ఏమాత్రం లేని మొండి వైఖరి ఆయనది. ఉద్యమం ఊపిరిగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, రాజకీయపరంగా ముందుకు వెళ్ళడానికి, ఎవరినైనా కలుపుకోవడానికి, ఎంతవారినైనా దూరం ఉంచడానికి వెనకాడని వ్యవహార శైలి ఆయనకే సొంతం. ఉద్యమకాలంలో కలిసి రావడానికి ఎవరు రాదలుచుకున్నా, స్వాగతించి, అక్కున చేర్చుకుని, భాగస్వామ్యానికి సుముఖత వ్యక్తం చేసిన కేసిఆర్, ఎన్నికల విషయంలో, ఇతర విధాన నిర్ణాయక విషయాలలో నామమాత్రంగా చర్చలు, సంప్రదింపులు చేశారే తప్ప నిర్ణయాధికారం ఆసాంతం ఆయన సొంతమేనన్నది తెలంగాణ జనమెరిగిన సత్యం. ఈ కారణంగానే ఇష్టం ఉన్నా, లేకున్నా, కష్టకారణమైనా, ఎన్నిసార్లు రాజీనామాలు చేయమన్నా, మారుమాటాడక, తమ అభిప్రాయాలను సైతం అగ్రనేత సన్నిధిన బహిర్గత పరిచే ధైర్యం, సత్తాఉన్నా, మిన్నకుండి పోవడం ఆయన అనుచరులకు చర్వితచర్వణమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములై, మంత్రి పదవులు చేపట్టడం సైతం ఎవరి ప్రమేయమూ లేని కేసిఆర్ సొంత నిర్ణయమే. సెంటిమెంట్‌ను ఓట్లుగా మలుచుకుని, సాధించిన శాసనసభ సీట్ల కన్నా, ఉప ఎన్నికలలో సీట్లు తగ్గినా, తాను స్వయంగా పోటీ స్థానాలు మార్చుకున్నా, విచారం వ్యక్తపరచడమో, అంతర్మథనం చేసుకోవడమో, తప్పిదాన్ని దిద్దుకుంటామనో కనీసం నమ్మకస్తులతోనైనా మాటవరుసకైనా వ్యక్తపరచని తీరు గులాబీ దళపతిది. తమకు ఇష్టం లేకున్నా, టీం లీడర్‌కు ఇష్టం లేక పోయినా, జట్టులో చోటు లేదని దూరం కావడం తప్ప గత్యంతరం లేని స్థితి చాలామందికి తప్పింది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకై భావసారూప్యం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం, ఆలె (టైగర్) నరేంద్ర), వెండితెర తార విజయశాంతి ... ఇలా ఒక్కరేమిటి, పార్టీ బాధ్యులే కాక, కవులు, కళాకారులు, వివిధ రూపాల ఉద్యమ సహాయకులు ఎవరు దూరమైనా, ఎంతమాత్రం కలత చెందక, బుజ్జగించే ప్రయత్నాలూ చేయక మొండిగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. ఆయన వ్యవహార శైలితో రాజీ పడని వారిని పొమ్మనలేక పొగ పెట్టి వెళ్ళగొట్టిన సందర్భాలూ లోక విదితాలే. ఉద్యమ సమయంలో మద్దతు ఇవ్వక పోవడమేకాదు, రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన, కేసిఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన వారిని దరి చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత ఆయనదే. ఇక ఎన్నికలలో ఒకసారి తెలుగుదేశం, మరోసారి కాంగ్రెస్‌లతో జత కట్టడం, కావలసిన మెజార్టీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా, ఇతర పార్టీలను బలహీన పరిచేందుకు ఆయా పార్టీల గుర్తులతో, కారు గుర్తును ఓడించిన వారిని సైతం, చేరిన మరుక్షణమే ప్రభుత్వంలో చేర్చుకోవడం, ఆశించిన పదవులు ఇవ్వడం కేసిఆర్ ఏకపక్ష నిర్ణయాలేనన్నది కాదనలేని వాస్తవం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనూ, కొందరికి టికెట్లు రావని తెలిసినా, తమ అధినేత మనస్తత్వం పూర్తిగా ఎరిగిన వారు కనుక, తమకు టికెట్లు ఎక్కడ రావేమోననే భయంతో, డూడూ బసవన్నలై, చేసేది లేక తలలూపారన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. అత్యంత సన్నిహితుడై, కేసిఆర్‌కు అన్ని వేళలా వెన్నుదన్నుగా నిలిచి, పోరాట యోధునికి యోగ్యుడైన, విశ్వసనీయుడైన రథసారథియై, కేసిఆర్ తర్వాత అంతటి అనుచరగణం, అభిమాన గణం, చరిస్మా కలిగి పార్టీలో నిన్న మొన్నటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరింప జాలక, రాజకీయాలనుండి తప్పుకోవడం మంచిదనే హృదయాంతరాళ నుండి పెల్లుబికి వచ్చిన ఆవేదనా భరిత సంచలన ప్రకటన చేసి సైతం, మనసు మార్చుకుని, చేసేదేమీ లేక, తిరిగి పార్టీ విజయానికి కాలికి బలపం కుట్టుకు తిరిగి రాజీపడడం, తమతో పాటు కేవలం మహమూద్ అలీకి మాత్రమే పదవిని కట్టబెట్టడం, దేశంలో కనీవినీ ఎరగని విధంగా ఇరువురితోనే ప్రభుత్వం నడిపినా, పూర్తి స్థాయి విస్తరణ చేయక, తొలి, మలి రాష్ట్ర మంత్రి వర్గాలలో ఒక్క మహిళకూ స్థానం కల్పించక పోవడం లాంటి అంశాలలో, ఒక్కరైనా నోరు మెదపక పోవడం లాంటి సంఘటనలు మార్పురాని తెరాస అధినేత కేసిఆర్ విలక్షణ, మొండి వైఖరి స్థితికి నిలువుటద్దాలై నిలుస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోనైనా ఈ గులాబి బాస్ వైఖరిలో మార్పు వస్తుందా అని పార్టీ వర్గాలు ఆశగా చూస్తున్నాయ.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494