రాష్ట్రీయం

ఫ్యాన్ సునామీ.. సైకిల్ తుక్కు..తుక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుతర్వాత ప్రభంజనం సృష్టించిన యువనేత, ఆంధ్రా అగ్గిపిడుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రాలో 1983 మళ్లీ 36 ఏళ్ల తర్వాత 2019లో పునరావృతమైంది. ఫ్యాన్ ధాటికి సైకిల్ తుక్కు తుక్కైంది. టీడీపీని మట్టికరిపించారు. ఈ అద్భుత విజయాలను వైకాపా శ్రేణులు కూడా ఊహించలేదు. బొటాబొటి మెజారిటీతో అయినా నెగ్గుతామని వైకాపా భావించింది. మే 23వ తేదీ గురువారం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మొదటి రెండు గంటల్లోనే సునామీగా వైకాపా విజృంభించి టీడీపీని కబళించింది. రాష్ట్ర రాజకీయాలను గత నాలుగుదశాబ్థాలుగా పరిశీలిస్తున్న విశే్లషకుల అంచనాను తలకిందులు చేస్తూ వైకాపా కోస్తాంధ్ర, రాయలసీమలో తన ప్రభంజనాన్ని దాటింది. ఈ నెల 30వ తేదీన తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాజకీయంగా ప్రవేశం, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, పోరాటాలు నిజంగా అద్భుతమైనవని చెప్పవచ్చు. 1972 డిసెంబర్ 21వ తేదీన పులివెందులలో జన్మించిన జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. పులివెందుల పులిబిడ్డగా జనం ముద్దుగా పిలుచుకునే జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్నారు. అనంతరం ఎంబీఏ చేశారు. కడప పార్లమెంటు స్థానం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రా సీఎంగా ఉన్న ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. ఇక అప్పటి నుంచి జగన్ రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి జగన్‌కు ఇవ్వాలనే చాలా మంది ఎమ్మెల్యేలు కోరగా, అందుకు విరుద్ధంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కె రోశయ్యను నియమించారు. కారణాలు ఏమైనా వైఎస్ కుటుంబానికి, కాంగ్రెస్ హైకమాండ్‌కు మధ్య అగాధం పెరిగింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌పై అనేక అభియోగాలు మోపడం, సీబీఐ విచారణ జరపడం దీని వల్ల జైలుపాలుకావడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా, అటుపోటులు సంభవించినా, మొక్కవోని విశ్వాసంతో, ప్రజాసేవనే సంకల్పంగా జగన్ ముందడుగు వేశారు. వైఎస్ అకాలమరణంతో అనేక మంది ప్రజలు హృదయ వేదనతో మరణించారు. వారిని పరామర్శించేందుకు కూడా కాంగ్రెస్ అనుమతించలేదు. దీంతో జగన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను స్థాపించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా పోటీ చేయగా, విజయం వరించినట్లే వరించి చేతులు జారింది. ఆ ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లు వైకాపాకు వచ్చాయి. ఇక అప్పటి నుంచి అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అలుపెరుగకుండా పోరాడారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధనకు ఆమరణ దీక్షలు చేశారు. ఉద్యమాలు చేశారు. రైతులు, శ్రామికుల సమస్యల సాధనకు జనంలోకి వెళ్లి పోరాడారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిత మూడు వేల కి.మీకుపైగా పాదయాత్ర చేశారు. ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం అనుసరించే నిర్బంధకాండ, మరో వైపు అంతర్గత, బాహ్య శత్రువుల కుట్రలను తట్టుకుంటూ, తనపైన మోపిన అభియోగాల విచారణకు కోర్టుకు హాజరవుతూ , ప్రజల తరఫున మడమ తప్పకుండా పోరాడారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నేత. ఇచ్చిన మాటను జవదాటరనే పేరును ప్రజల్లో తెచ్చుకున్నారు. పాదయాత్రలు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల తవ్వకం పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే జగన్ అసెంబ్లీలోపల వెలుపల రాజీలేకుండా పోరాడారు. అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు జగన్‌ను మాట్లాడనివ్వకుండా, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పదే పదే లేవనెత్తుతూ దుర్భాషలాడారు. ఇష్టం వచ్చినట్లు వైకాపా అధినేత జగన్‌ను దూషించారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది భూములు అక్కర్లేదని, అమరావతి రాజధానికి తన ఆమోదం ఉందని కూడా జగన్ చెప్పారు.
2014 ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వినమ్రంగా మీడియా ముందుకు వచ్చి ఓటమిని అంగీకరించి జనంలో ఉంటామని, ప్రజాసమస్యలపైన రాజీలేకుండా పోరాడుతామని నిర్మోహమాటగా చెప్పిన రాజకీయ యోధుడు జగన్. జగన్ మాటల్లో సమయస్ఫూర్తి కనపడుతుంది. అవసరమైనంత మేరకే మాట్లాడుతారు. ఉత్తుత్తి ఉపన్యాసాలు, వాగ్థానాలు ఇవ్వరు. 37 ఏళ్లకే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన జగన్, పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వైఎస్ జగన్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతారు. అదే ఆయన బలం. అనేక తెలుగు సూక్తులు, పద్యాలు, సంస్కృత పదాలను తడుముకోకుండా చెప్పగలరు. ఏకసంధాగ్రహి. ఒక్కసారి తనను కలుసుకున్న వారిని గుర్తుపెట్టుకుని పేరుతో పలుకరిస్తారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మాదిరిగా మరొకరు ఎవరైనా ఇన్ని సంఘర్షణలు ఎదుర్కొని ఉంటే శత్రువులతో రాజీపడి ఉండేవారు. జగన్ ఒక రకంగా చెప్పాలంటే 2009 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న అత్యంత శక్తివంతురాలైన సోనియాగాంధీతోనే ఢీ అంటే ఢీ అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్, టీడీపీ, ఇతర చిల్లరమల్లర పార్టీలు, కాంగ్రెస్‌లోనే తన తండ్రి వద్ద ప్రాపకం సంపాదించి పదవులు పొందిన పెద్దలు బహిరంగంగా తనను, తన కుటుంబాన్ని విస్మరించినా తట్టుకుని నిలబడ్డారు. జగన్‌ను రాజకీయాల్లో ఏకాకిని చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు ఏకమై దుర్మార్గమైన పాచికలు వేసినా మానసిక స్థైర్యాన్ని కోల్పోని ధీరుడు జగన్. రాజకీయాల్లో ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారు. జగన్ ఏ పనిచేసినా టీడీపీ టార్గెట్ చేసింది. జగన్‌కు ఓటు వస్తే అమరావతి రాజధానిని మార్చివేస్తారని ఆరోపణలు చేసింది. జనం ఈ మాటలను నమ్మలేదు. జగన్ గతంలో తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నా ఆ నాటి కాంగ్రెస్, టీడీపీలు వివాదం చేశాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా చలించకుండా తల్లి శ్రీమతి విజయమ్మ, సోదరి షర్మిల, పార్టీలో తనను నమ్ముకుని ఉన్న నేతల సహాయంతో దేశ రాజకీయాల్లో కనీవినీ ఎరుగని విధంగా అద్భుతమైన విజయాలను నమోదు చేసి రికార్డు సృష్టించిన గొప్ప రాజకీయ యోధుడు జగన్. 2009 నుంచి 2019 మధ్య రాజకీయంగా తనను తొక్కేసేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలను చూసి జగన్ కృంగిపోలేదు. 2014లో అధికారంలోకి రాకపోయినా, టీడీపీ ముప్పుతిప్పలు పెట్టిన తనను నమ్ముకుని ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో విజయ తీరాలకు 150ప్లస్ సీట్లతో ఆంధ్రా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097