రాష్ట్రీయం

దేశ రాజధానిలో శ్రీరాముడి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మే 24: దేశ రాజధాని న్యూఢిల్లీలో జూన్ 1న శ్రీ సీతారాముల కల్యాణం అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అధికారికంగా ఈ ఏడాది ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో సీతారాముల కల్యాణం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలతో శ్రీరామనవమి నాడు నిర్వహించే తరహాలో సీతారాముల కల్యాణాన్ని దేశ రాజధానిలో చేస్తున్నట్లు భద్రాచలం దేవస్థానం ఈఓ తాళ్ళూరి రమేష్‌బాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964లో ఒకసారి అధికారికంగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో సీతారాముల కల్యాణం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి తిరిగి ఇప్పుడు కల్యాణం చేస్తుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి, డాక్టర్ మందా జగన్నాథం, తేజావత్ రామచంద్రునాయక్, కేఎం సహానీల ఆధ్వర్యంలో రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి ఢిల్లీలో సీతారాముల కల్యాణ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జూన్ 1వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ కల్యాణ క్రతువును అర్చకులు నిర్వహించనున్నారు. దేవస్థానం ఈఓ తాళ్ళూరి రమేష్‌బాబు, స్థానాచార్యులు స్థలశాయిల ఆధ్వర్యంలో అర్చకులు ఢిల్లీకి ప్రత్యేక బస్సులో బయలుదేరుతున్నారు.
నాడు చెక్క విగ్రహాలతో..
1964లో దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి సీతారాముల కల్యాణం నిర్వహించారు. అదే ఏడాది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి గర్భగుడిని పునరుద్ధరించారు. ఆ సమయంలో గర్భగుడిని మూసివేయడంతో మూలవరులను దర్శించుకునే అవకాశం భక్తులకు లభించలేదు. దీనితో చెక్క విగ్రహాలను తయారు చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. కొన్ని రోజుల పాటు భక్తులు ఈ విగ్రహాలనే దర్శించుకున్నారు. వాటినే న్యూఢిల్లీలో జరిగిన సీతారాముల కల్యాణానికి అనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్లింది. అప్పట్లో ఆంధ్రాభవన్‌లో వైభవోపేతంగా కల్యాణం జరిగాక చెక్క విగ్రహాలను అక్కడే అర్చకులు వదిలి వచ్చారు. దీంతో నాటి ఆంధ్రాభవన్ అధికారులు ప్రత్యేకంగా మందిరం నిర్మించి అందులో చెక్క విగ్రహాలను భద్రపర్చి పూజలు చేయడం ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రాభవన్‌లోనే ఈ విగ్రహాలు ఉండిపోయాయి. తెలంగాణ భవన్‌లో విగ్రహాలు లేకపోవటంతో ఈసారి రామాలయం నుంచి ఉత్సవమూర్తులను కల్యాణం కోసం తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులతో దేశ రాజధానిలో కల్యాణం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న దేశ రాజధానిలో జరుగుతున్న తొలి కల్యాణం ఇదే కావడం విశేషం.