రాష్ట్రీయం

వైద్య విద్య అడ్మిషన్లలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: వైద్య విద్యాకళాశాలల్లో ఎంబిబిఎస్, బి.డి.ఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను పునరుద్ధరించేందుకు తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయాలతో మార్గం సుగమం అయింది. 2010 వరకూ దేశంలో వివిధ రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తూ రావడంతో చిన్న రాష్ట్రాలపై ప్రవేశ పరీక్షల భారం విపరీతంగా పడింది. దాంతో పాటు స్థానిక విద్యార్ధులకే పరిమితం కావడం, ఇతర ప్రాంతాల వారిని కలుపుకుపోయే భారతీయతత్వం లేకపోవడంతో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్టును ఏర్పాటు చేసింది. 2010లో ఎఐపిఎంటి తొలి జాతీయ స్థాయి ప్రవేశపరీక్షను నిర్వహించింది. అయితే అందులో కేవలం అండమాన్, అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు ఎఎఫ్‌ఎంసిఐ, బిహెచ్‌యు, జెహెచ్‌యు, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ కూడా ఎఐపిఎంటిలో చేరాయి. దీనిని తొలిసారి రెండు దశలుగా నిర్వహించారు. ప్రిలిమినరీ, మెయిన్ అని నిర్వహించారు. మెయిన్‌లో ర్యాంకులు వచ్చిన వారికి సీట్లు కేటాయించారు.
కేవలం ప్రభుత్వ కాలేజీలు, అదీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీనిలో చేరడంతో జాతీయస్థాయి ప్రవేశపరీక్ష పరమార్ధం నెరవేరలేదు. దాంతో ఎంసిఐ ముందుకు వచ్చి గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ -1997 చట్టంలోని నిబంధనలు సవరించి దేశవ్యాప్తంగా ఒకే అర్హత-ప్రవేశపరీక్ష (నీట్)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆధీనంలోని 381 కాలేజీల్లోని 50,078 సీట్లను దీని పరిధిలోకి తెచ్చారు. నీట్ నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు, మిగిలిన 15 శాతం సీట్లను జాతీయ స్థాయి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు 2013లో తొలిసారి నీట్‌ను నిర్వహించారు. అయితే అదే ఏడాది నీట్ నిర్వహణపై తమిళనాడుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆఫ్ ఇండియా సహా 151 సంస్థల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ నీట్‌ను నిర్వహించే అర్హత మెడికల్ కౌన్సిల్‌కు లేదని ఆ పరీక్షను కొట్టిపారేసింది. దాంతో మెడికల్ అడ్మిషన్ల వ్యవహారం గందరగోళంలో పడటంతో కేంద్రం మళ్లీ ఎఐపిఎంటిని 2014లో పునరుద్ధరించింది. గత రెండేళ్లుగా ఎఐపిఎంటిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరీక్ష నుండి అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ సైతం బయటకువచ్చేసి కేవలం అర్హత పరీక్ష మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఏడు రాష్ట్రాలు మాత్రమే ఎఐపిఎంటి ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపడుతున్నాయి. మిగిలిన 22 రాష్ట్రాలు తమ సొంత పరీక్షలు లేదా అర్హత పరీక్ష మార్కుల ప్రాతిపదికగా అడ్మిషన్లు చేపడుతున్నాయి. 2016 కోసం ఇప్పటికే ఎఐపిఎంటి తన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది మే 1న జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహించి జూన్ 5వ తేదీన ఫలితాలను సైతం ప్రకటించనుంది. నీట్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించే పక్షంలో 2017-18 విద్యాసంవత్సరం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.