రాష్ట్రీయం

కొలిక్కిరాని ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 11: గోదావరి బేసిన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు కొలిక్కి రాలేదు.. లక్ష్యానికి దూరంగా ఏళ్ళ తరబడి ప్రహసనంగా కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు డెల్టాల ఆధునికీకరణ పనుల నిమిత్తం కేటాయించిన నిధులు, వ్యయం, ఫలితాలు తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం నిశిత దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయ ప్రధానమైన పాలనా ప్రాధాన్యత తీసుకున్న జగన్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రతి అంశంపైనా సునిశిత దృష్టి పెట్టి పథకాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఆధునికీకరణలో భాగంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లోని నాగార్జున సాగర్, తుంగభద్ర, ఏలేరు, నాగావళి తదితర ప్రాజెక్టులను 2014-15లో రూ.12,984.03 కోట్ల నిధులతో 46.63 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ కోసం ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇందులో గోదావరి డెల్టా 10,38,362 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.3,366 కోట్లు కేటాయించారు. 2014 వరకు రూ.716.65 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. కృష్ణా డెల్టాలో 13,35,100 ఎకరాల ఆయకట్టుకు రూ.4,573 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో ప్రధానంగా ముంపు నుంచి జనావాసాలను, ఆయకట్టును రక్షించేందుకు కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, కుందు, పెన్నా, కండలేరు, కాళంగి నదులపై 670 కిలో మీటర్ల పొడవైన వరద గట్ల పటిష్టతకు కూడా రూ.2,113.31 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. గోదావరి వరద గట్ల పటిష్టవంతానికి ఆధునికీకరణలో భాగంగా రూ.548.32 కోట్లు కేటాయించారు. ఈ పనులపై కూడా థర్డ్ పార్టీ కమిటీ పరిశీలన చేయనుంది. కాటన్ బ్యారేజి నుంచి తూర్పు డెల్టాలో 2,81,303 ఎకరాలు, మధ్యమ డెల్టాలో 2,01,896 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 5,29,936 ఎకరాలు మొత్తం 10,13,376 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ మొత్తం ఆయకట్టుకు పూర్తి స్థాయిలో పటిష్టవంతంగా సాగునీరు అందించేందుకు ఆయకట్టు స్థిరీకరణను ఉద్దేశించి ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. రెండు మూడేళ్ళ పాటు నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేస్తే ఆపై వచ్చే వరదలు, వర్షాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు నష్టపోకుండా, ముంపునకు గురి కాకుండా, ఏటిగట్ల పరీవాహ ప్రాంతాలు ఎటువంటి వరద కోతకు గురి కాకుండా వుండేందుకు ఈ పనులు చేపట్టారు. కానీ దాదాపు పదేళ్ళకు పైగా ఆధునికీకరణ పనులు కొలిక్కి రాకపోవడంతో ఏటికేడాది ఈ పనులు మొదటికొస్తున్నాయి. ఈ పనులకు ప్రతి ఏటా సాంకేతిక మంజూరు తీసుకుంటారు. ఆ విధంగా గత ఏడాది సాంకేతిక మంజూరు తీసుకున్న పనుల్లో ఆ ఏడాది చేయగా మిగిలిపోయిన పనులను ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఇలా ప్రతి ఏటా ఆధునికీకరణ పనులు చేస్తూనే వుండటం వల్ల నిర్దేశిత ఫలితాలు రైతులకు దక్కడం లేదు.
అదే విధంగా ఏలేరు ఆధునికీకరణ పనులు కూడా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. 2014-15 టీడీపీ తొలి బడ్జెట్‌లో ఏలేరుకు రూ.18.65 లక్షలు పెట్టారు. విశాఖ జిల్లా చింతపల్లి తాలూకా సంబరకొండ కొండల్లో ఏలేరు నది పుట్టింది. ఏలేశ్వరం గ్రామం వద్ద ఏలేరు నదిపై రిజర్వాయర్ నిర్మించారు. 24.11 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో 1991లో ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అనుబంధ తిమ్మరాజు చెరువు, ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ, పిఠాపురం బ్రాంచి కెనాళ్ళ అనుసంధాన ఆయకట్టు వెరసి మొత్తం ఒక లక్షా 9వేల 314 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. మొదట్లో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ (వైఐ) ఆధునికీకరణను రూ.38 కోట్లతో చేపట్టారు. వర్షాకాలం, వరద కాలంలో వరద నీరు ప్రవాహానికి 69.70 కిలోమీటర్ల పొడవునా మురుగు పారుదల వ్యవస్థను మెరుగు పర్చేందుకు అప్పటి ప్రభుత్వం జి ఓ ఆర్టీ నెంబర్ 569 ప్రకారం 2008లో రూ.138 కోట్లతో పరిపాలనా ఆమోదం ఇచ్చింది. దీంతో ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రధాన పనుల ఆధునికీకరణ రూ.8.7 కోట్లు, వైఐ వ్యవస్థ మురుగు పారుదల వ్యవస్థ ఆధునికీకరణకు సుమారు రూ.11.6 కోట్లు, తిమ్మరాజు చెరువుకు రూ.3.03 కోట్లు, ఇతర పనులకు రూ.10.41 కోట్లు కేటాయించారు. రెండో దశ ఆధునికీకరణకు రూ.168.24 కోట్లు, ఈ రెండు దశలను కలిపి సవరించిన అంచనాలతో రూ.295.83 కోట్లతో జీవో ఆర్టీ నెంబర్ 241 ప్రకారం 2015లో పరిపాలనా ఆమోదం ఇచ్చారు. ప్రస్తుతం రెండో దశ ఆధునికీకరణలో భాగంగా రూ.157.46 కోట్ల విలువైన పనులు ఇంకా జరుగుతూనే వున్నాయి. ఇదిలా వుండగా నీరు చెట్టు, ఆధునికీకరణ పనులు ఒక ప్రహసనంగా గోదావరి జిల్లాల్లో జరుగుతూనే వున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులు, జరుగుతోన్న పనులపై కూడా థర్డ్ పార్టీ కమిటీ పరిశీలన జరపనుండటంతో అధికారుల, కాంట్రాక్టర్ల లెక్కలు తేలనున్నాయని తెలుస్తోంది.