రాష్ట్రీయం

గ్రామ స్వరాజ్యానికి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు ప్రగతి సాధనలో క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యానికి పూర్వ వైభవం తీసుకరావాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగ్రామిగా నిలిచే జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ. 10 కోట్ల మంజురు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నిధిని 32 జిల్లాలు పొందుతాయన్న ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్ పర్సన్స్, వైస్ చైర్మన్లతో ప్రగతిభవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లకు దిశా నిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామలలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నట్టు సీఎం చెప్పారు. గతంలో జడ్‌పీ చైర్మన్లకు పెద్దగా పని ఉండేది కాదు, కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకవచ్చి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్రను క్రియాశీలకంగా మార్చామన్నారు. జడ్‌పీ చైర్మనకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదా కల్పించడంతో పాటు, వారందరికి కొత్త కార్లు ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. పదవీ గర్వం, అధికార దర్పం ఏ కోశానా రానీయకుండా ఎప్పటి మాదిరిగానే సహజత్వాన్ని కోల్పోకూడదని హితవు పలికారు. పదవి రాగానే మారిపోవద్దారు. అలా చేస్తే వెనుకనున్న జనం నవ్విపోతారన్నారు. దర్పంతో గౌరవం పెరగదని, ప్రవర్తన వల్ల పెరుగుతుందన్నారు. పెట్టుడు గుణం కంటే పుట్టుడు గుణం మంచిదన్న పెద్దల మాట మరచిపోవద్దని సీఎం గుర్తు చేశారు.
వివిధ సమస్యలతో వచ్చే ప్రజలను గౌరవించి వారి సమస్యలను పరిష్కరించడం నాయకునికి ఉండాల్సిన మంచి లక్షణమన్నారు. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదన్నారు. సరళంగా మాట్లాడటమే ఎప్పటికైనా పెట్టని కోట అని హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో వారు ఎప్పటికప్పుడు గమినిస్తుంటారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విజయాలు, అపజయాలు సర్వ సాధారణమని, కానీ రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండటం నాయకునికి ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తామన్నారు. ఇప్పటి మాదిరిగా 32 జిల్లాల్లో ఇంత ఏకపక్షంగా గతంలో ఫలితాలు ఎప్పుడు వెలువడలేదన్నారు. మంచి ఫలితాలతో పాటే మరింత బరువు, బాధ్యతలు పెరిగిన విషయం మరిచిపోవద్దని, మీ పాత్ర మరింత ఉన్నతంగా ఉండాలని సీఎం అన్నారు. హైదరాబాద్ నుంచే యావత్ భారతదేశానికి పంచాయతీరాజ్ ఉద్యమం విస్తరించిందన్నారు. చాలా కాలం పాటు పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు పనిచేశాయన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి క్రమేణా కొరవడుతూ వచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రామాలలో ఏది మంచిగా జరగడం లేదన్నారు. పల్లెలు పెంట కుప్పలుగా మారాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలు అద్బుతంగా మారినప్పుడే రాష్ట్రం బాగుపడుందన్నారు. గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం, పంచాయతీరాజ్ చట్టం కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పని చేసి మంచి ఫలితాలు సాధిస్తేనే మూడేళ్ల తర్వాత అతని ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శులపనై పూర్తి నియంత్రణ స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆరు నెలల్లో పూర్తి మార్పు కనిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పట్టుకోమ్మలుగా చేయడంలో ప్రజాప్రతినిధులు నిమగ్నం కావాలని, ప్రతీ గ్రామం ఒక గంగదేవిపల్లి, ఒక అంకాపూర్, ఒక ముల్కనూరు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
చిత్రం... ప్రగతి భవన్‌లో జరిగిన నూతన జడ్సీ చైర్మన్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్