రాష్ట్రీయం

బహుమతులన్నీ తిరుమల శ్రీవారి సొంతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 11: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి, విశ్వాసాలతో భక్తులు సమర్పించే కానుకలు ఏవైనా మరొకరికి బహూకరించకూడదని... భవిష్యత్ తరాలకు ఒక చరిత్రగా వాటిని పరిరక్షించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీవారి దర్శనార్థం రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి పురాతన నాణేలను స్వామివారి చిత్రపటంలో ఏర్పాటు చేసి బహూకరించడానికి టీటీడీ అధికారులు ప్రయత్నించినట్లు ప్రచారం సాగింది. దీంతో మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. అలాంటి ఆలోచన చేయలేదని టీటీడీ వివరణ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ స్వామివారికి భక్తులు అనేక విధాలుగా కైంకర్యాలు చేస్తూ వచ్చారు, బహుమతులు విరాళంగా ఇచ్చారు. గతంలో తాను టీటీడీ ఈఓగా పనిచేసినప్పుడు ఇలాంటి వాటిని గమనించానన్నారు. దశాబ్దాల క్రితం అప్పట్లో చెలామణిలో ఉన్న నాణేలను కూడా భక్తులు శ్రీవారికి ఇచ్చారన్నారు. వాటిని శ్రీవారి ఆస్తిగానే భావించాలన్నారు. వాటిని ఒక గుర్తుగా స్వీకరించి అలాంటివి భక్తుల కైంకర్యాలుగా ఎలా ఇస్తున్నారన్నది భవిష్యత్ తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకే రకమైన నాణేలు 10, 20 వరకు ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఉన్నాయి కదా అని వాటిని మరొకరికి బహూకరించకూడదని, జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న మ్యూజియంలో ఇలాంటి పురాతన నాణేలను తరలించి నాడు భక్తులు స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు చేశారో ఆధారాలతో ముందుంచవచ్చని గతంలో తాము భావించామన్నారు. అటు తరువాత ఆ ఆలోచనలో మార్పు జరిగినట్లు విన్నానన్నారు. పురాతన నాణేల బహూకరణకు సంబంధించిన అంశం తనకు తెలిసిందని, వీటి పూర్వాపరాలు తెలుసుకుని ఎవరైనా అలాంటి దుస్సాహసమైన ఆలోచన చేసివుంటే వారిని ఏవిధంగా శిక్షించాలో టీటీడీ యాజమాన్యానికి గుర్తుచేసి వారి ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదిలావుండగా ఈ వివాదానికి సంబంధించి మరో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పురాతన నాణేలు అవి రాజుల కాలం నాటివైనా, బ్రిటీష్ కాలం నాటివైనా ప్రజలు తమ అవసరాలకు చేతి మార్పిడులు చేసి ఉంటారన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అణాలు కూడా పురాతనమైనవేనని వాటిని భద్ర పరచడం అవసరమేనని, బహూకరించడం నేరం ఎలా అవుతుందని వాదిస్తున్నారు.
అంతేకాకుండా ఎంతోమంది భక్తులు నిలువుదోపిడీతో స్వామివారికి తాము ధరించిన ఆభరణాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారన్నారు. అలాంటి ఆభరణాలను టీటీడీ యాజమాన్యం కరిగించి బంగారు డాలర్ల రూపంలో స్వామి చిత్రాన్ని వేసి విక్రయిస్తున్నారు కదా, అది కూడా నేరమే కదా అని వాదిస్తున్నారు. భగవంతుని ముందు రాజులైనా, బ్రిటీష్ పాలకులైనా, నేటి సామాన్యభక్తులైనా ఒకటే కదా అన్నది వారి వాదన.
ఇదిలా ఉండగా పురాతనమైన నాణేలు పురావస్తుశాఖ పరిధిలో ఉంటాయని వాటిని బహూకరించే అధికారం ఎవరికీ లేదని వాదిస్తున్నారు. అలాంటప్పుడు పురాతన వస్తువులను గుర్తించి పురావస్తుశాఖ తన ఆధీనంలో పెట్టుకుంటే ఇలాంటి వివాదాలకు తావుండదుకదా అన్నది మరికొందరి వాదన. ఏదేమైనా పురాతన నాణేలు పొందుపరిచిన చిత్రపటాన్ని ప్రధానికి ఇవ్వాలన్న అధికారుల ఆలోచన కొత్త వివాదానికి తెరలేపుతోంది. మరి ఈ వ్యవహారం ఎలా మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.