ఆంధ్రప్రదేశ్‌

తిరుమలేశుని తరహాలో రామయ్య బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 12: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలు తిరుమల వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న తరహలోనే జరుపుతామని టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా అధికారులతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు ఒంటిమిట్ట విచ్చేశారు. ముందుగా సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్యాణ వేదికను 16వ తేదీ సాయంత్రానికల్లా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. టిటిడి ఆధ్వర్యంలో మొదటి సారిగా ఒంటిమిట్ట కోదండ రాముని ఉత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఉత్సవాలలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా జిల్లా అధికారుల సహయ, సహకారాలతో అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు ఇఓ తెలిపారు. గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, విఐపిలు భారీ స్థాయిలో హజరు కానున్నందున అందుకు తగ్గట్టు బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీకి సూచించారు. కల్యాణ వేదిక మ్యాపును పరిశీలించారు. లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బందోబస్తు, బారికేడింగ్, ఇతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ, కలెక్టర్ కెవి రమణతో చర్చించారు.
ఏక శిలానగరం ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో మంగళవారం టిటిడి ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, స్వామివారి మూలవిరాట్‌లను సంజీవరాయస్వామి ఆలయంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన స్వచ్చమైన నీటితో శుద్ధి చేశారు.

ఒంటిమిట్ట ఆలయంలో కల్యాణ వేదిక వద్ద మ్యాప్‌ను
పరిశీలిస్తున్న టిటిడి ఇఓ సాంబశివరావు, కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ

వైభవంగా గరుడాధివాసం
భద్రాచలం, ఏప్రిల్ 12: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం వైభవంగా జరిగాయి. అంతరాలయంలో స్వామికి విశేషతిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమరవాది శేషగోపాలాచార్యులు జీయర్‌మఠంలో పంచరంగులతో గరుత్మంతుడి పటాన్ని లిఖించారు. జీయర్‌మఠంలో ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలు నడుమ 28 మంది రుత్విక్కులు పాంచరాత్రాగమన శాస్త్రం ప్రకారం గరుత్మంతుడికి నేత్రో నీలనం చేశారు. కళ్లకు మైనం పెట్టి గరుడన్యాసం, గరుడధ్యానం, గరుడ మంగళాష్టకాలు, గరుడ జపం చేసి గరుత్మంతుడి చిత్రపటాన్ని ఊరేగింపుగా అంతరాలయానికి తీసుకెళ్లారు. అక్కడ స్వామి పాదాల చెంత ఉంచారు. హారతి, శేషమాలిక గరుత్మంతుడి మెడలో వేశారు. మేళతాళాలు నడుమ యాగశాలకు తీసుకెళ్లారు. బియ్యంపై గరుత్మంతుడిని పడుకోబెట్టారు. 16 కలశాలతో అభిషేకం చేశారు. మహాకుంభాన్ని స్థాపించి ఆవాహన చేశారు. అనంతరం జీయర్‌మఠంలో గరుడ చిత్రపటం వేసిన అమరవాది శేషగోపాచార్యులను దేవస్థానం, జీయర్‌మఠం వారు సన్మానించారు. రుత్విక్కులను కూడా సన్మానించారు. ఈ వేడుకలో మాజీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కురిచేటి పాండురంగారావు, సాయిబాబా ఆలయ చైర్మన్ మాగంటి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌టిఆర్ జలసిరి ద్వారా
6 లక్షల ఎకరాలకు సాగునీరు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 12: ఎన్‌టిఆర్ జలసిరి పథకం కింద రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి కె. మృణాళిని అన్నారు. 13 జిల్లాల డ్వామా పథకం సంచాలకులతో విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్ కింద బోరుబావులకు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్-1 కింద గతంలో మంజూరు చేసిన బోర్లలో 2,028 బోర్లకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు కల్పించకపోవడంపై ఆమె అధికారులను వివరణ కోరారు. నెలాఖరులోగా బోర్లన్నింటికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్-2 కింద కొత్తగా మంజూరు చేసిన 1,24,349 బోర్ల ఏర్పాటు జూన్ మాసాంతానికి పూర్తి చేయాలన్నారు. బోర్ల ఏర్పాటు పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించేలా చూడాలన్నారు. అడుగంటుతున్న భూగర్భజలాలను వృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేయాలన్నారు. భూగర్భజలాల అభివృద్ధికి ఉద్దేశించిన నీటికుంటల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల నీటి కుంటల నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 432 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపరచడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. గ్రామాల్లో చంద్రన్నబాట కార్యక్రమం కింద చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు.
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు,ఏప్రిల్ 12: వాహనాల తనిఖీ చేస్తుండగా నెల్లూరు పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు చిక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 55లక్షల నగదు, ఎర్రచందనం దుంగలు బైటపడ్డాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి విశాల్‌గున్నీ చెప్పారు. మంగళవారం నెల్లూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో నెల్లూరుపాళెం వద్ద ఆత్మకూరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బొలెరో వాహనం ఆగకుండా వెళ్లిపోతుండంతో పోలీసులు వెంబడించగా వాహనాన్ని వదలి ఇద్దరు పరారయ్యారన్నారు. మిగతావారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుంచి 55లక్షల రూపాయలు విలువ చేసి సొత్తును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. వాహనంలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ 5.50 లక్షల రూపాయలు, 5లక్షల రూపాయలు విలువ చేసే బొలోరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టుఎస్‌పి వివరించారు.
వారంలో 4 రోజులు విజయవాడలోనే లోకేష్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 12: జాతీయ పార్టీ తెలుగుదేశం పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో కాలక్రమంలో కునారితున్న నేపథ్యంలో పార్టీని కనీసం ఆంధ్రప్రదేశ్‌లో అయినా మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఇక నుంచి వారంలో నాలుగు రోజుల పాటు విజయవాడలో ఉండాలని నిర్నయించుకున్నారు. ఇదే సమయంలో సీనియర్ నాయకులందరూ తనకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 22 న ప్రారంభించాలని నిర్ణయించారు. అయినా విజయవాడ కార్యాలయం ఫ్రంట్ ఆఫీస్ గానూ, గుంటూరు కార్యాలయం బ్యాక్ ఆఫీస్‌గా పనిచేస్తాయన్నారు.
వడగాడ్పులకు ముగ్గురి మృతి
విశాఖపట్నం, ఏప్రిల్ 12: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడదెబ్బకు మంగళవారం ముగ్గురు మృతి చెందారు. విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంకు చెందిన యడ్ల చిన్నబుల్లి(70) వడదెబ్బతో మృతి చెందింది. విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన గునాన అప్పయ్య(45) వడదెబ్బతో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వీరభద్రాపురానికి చెందిన ఎ.సీతారాం(52) వడదెబ్బకు మృతి చెందాడు.
మాజీ మావోయిస్టు దేవుడు మృతి
ప్రత్తిపాడు, ఏప్రిల్ 12: మాజీ మావోయిస్టు పెరుమాళ్ళ దేవుడు (62) (నల్లన్న) మంగళవారం కాకినాడలో మృతి చెందాడు. నల్లన్న గత కొంతకాలంగా అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన స్వస్థలం ప్రత్తిపాడు. ఆయనకు భార్య కుమారి, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. చిన్నతనం నుండి పాటలు పాడే అలవాటు ఉండడంతో మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. గిరిజన ప్రాంతాలకు చెందిన వారి కోసం గీతాలు ఆలపించేవాడు. డిగ్రీ వరకు చదువుకుని మావోయిస్టు ఉద్యమంలో చేరి, కీలక పాత్ర పోషించాడు. ఈయనను ఒకసారి పోలీసులు అరెస్టు చేసినప్పుడు విడుదల నిమిత్తం అప్పటి పెద్దాపురం ఆర్డీవో విష్ణును కిడ్నాప్ చేశారు. రాష్ట్రంలో అధికారులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారి కావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది.
వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్ల గల్లంతు
నాగాయలంక, ఏప్రిల్ 12: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాముడు చేపల బోటు ప్రమాదవశాత్తూ మునగటంతో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ నెల 9న ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మెరైన్ సిఐ మురళీకృష్ణ, సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వాటపల్లి వీరరాఘవయ్య, కొక్కిలిగడ్డ భిక్షం ప్రమాదవశాత్తూ బోటు మునగడంతో నీటిలో కొట్టుకుపోయారు. మిగిలిన వారిలో విశ్వనాథపల్లి బాబూరావు, నాయుడు హరినారాయణ, మోకా వెంకటస్వామి, కొక్కిలిగడ్డ ఆదినారాయణ ప్రాణాలతో బయటపడ్డారు. సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వీరు చేపల వేట నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

ఎండ ప్రచండం
కడపలో 44.5 * కర్నూలులో 44 డిగ్రీలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 12: రాయలసీమలో సూర్య ప్రతాపం కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప నగరంలో ఏప్రిల్ నెలలో గత దశాబ్దంలోనే ఎన్నడూలేని విధంగా పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరింది. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 43 డిగ్రీలు కాగా కర్నూలు నగరంలో 44, నంద్యాలలో 41, ఆదోని పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకపోయినా గాలిలో తేమ శాతం కారణంగా వడగాల్పుల ప్రభావం ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తోంది.

పెట్రోహబ్‌గా ఉత్తరాంధ్ర
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 12: ఉత్తరాంధ్రను పెట్రోహబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నిర్ణయించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్రూడ్‌ఆయిల్ నిల్వలు ఉన్నట్లు సాంకేతిక నిపుణులు నివేదికలు ఇచ్చారన్నారు. దీంతో ఈ ప్రాంతాలను పెట్రోహబ్‌గా తీర్చిదిద్దేందుకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకుందన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని వివిధ అంశాలను దశలవారీగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరులేన్లుగా జాతీయ రహదారులను విస్తరించేందుకు 65 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ వెల్లడించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ప్రధాని వాజపేయి హయాంలోనే జాతీయ రహదారులను బిజెపి ప్రభుత్వం విస్తరించిందన్నారు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపధ్యంలో జాతీయ రహదారులను విస్తరించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేందుకు ఈ రహదారులు ఎంతగానో దోహదపడతాయన్నారు.