రాష్ట్రీయం

బాసరకు భారీగా భక్తుల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 14: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువులతల్లి కొలువుదీరిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం పూజ లు జరిపించి మంచి విద్యాబుద్ధులను కల్పించాలని కోరుతూ భక్తులు బాసర క్షేత్రానికి క్యూ కట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శ్రీ సరస్వతీ నామస్మరణతో మారుమోగింది. ఉదయం నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు చిన్నారులు అమ్మవారి దర్శనం అక్షర స్వీకార పూజలకు క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారి దర్శన సేవలకు రెండు గంటల సమయం పట్టింది. అక్షరాభ్యాస పూజలకు ఒక్కో బ్యాచ్‌కు రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో క్యూలైన్‌లో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్షరాభ్యాస పూజలు దర్శనం సేవలను ఆలయ అధికారులు నిరంతరాయంగా కొనసాగించారు. వేసవి సెలవులు ముగియడం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో తమ చిన్నారులకు అమ్మవారి చెంత అక్షరాభ్యాస పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస పూజల అనంతరం భక్తులు తమ చిన్నారులతో ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని అమ్మవార్లకు ముడుపులు సమర్పించుకున్నారు.
భారీగా అక్షరాభ్యాస పూజలు
అమ్మవారికి శుక్రవారం పర్వదినం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి చెంత భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి భారీగా తరలివచ్చారు. సాధారణ అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు చిన్నారులకు వేడుకగా అక్షర శ్రీకార పూజలు జరిపించారు. ఒక్కరోజే అమ్మవారి సన్నిధిలో 1000 మందికిపైగా చిన్నారులతో ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. ఆర్జిత సేవలు ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి పది లక్షల రూపాయల వరకు ఆదాయ సమకూరినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
నిర్మాత దిల్‌రాజు పూజలు
ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు తన మనుమడికి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ప్రత్యేక అక్షరభ్యాస మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి అక్షరాభ్యాస పూజను ఘనంగా జరిపించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారునికి పూజలు జరిపించడం సంతోషంగా ఉందని అన్నారు.
సౌకర్యాలలేమితో భక్తులకు ఇక్కట్లు
బాసర క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సౌకర్యాల లేమితో భక్తులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. వేసవి ఎండలు మండుతుండడంతో పలుచోట్ల తాగునీటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ అధికారులు ప్రధానంగా వసతి గదులు తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.