రాష్ట్రీయం

ఫ్రెండ్లీ పోలీసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: మహిళలు, బాలికలు ఇతర బాధితులు ఎవరైనా భయపడకుండా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని, అలాగే బాధితుల కష్టాలు చెప్పుకోటానికి ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను రూపొందిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సచివాలయం రెండో బ్లాక్‌లో ఆమె ఆదివారం ఉదయం తన ఛాంబర్‌లోకి ప్రవేశించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట ఒక పోలీసు కానిస్టేబుల్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లు ఫైల్‌పై సంతకం చేస్తూ తొలుత పోలీసు సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో తొలిసారిగా ఓ మహిళ హోంశాఖ చేపడితే జగన్ హయాంలో ఓ ఎస్సీ మహిళ ఇంతటి కీలకమైన శాఖను చేపట్టడం జరిగిందంటూ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో మహిళా, గిరిజన పోలీసు బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా నాలుగు బెటాలియన్‌లను ఏర్పాటు
చేసుకునే అవకాశం లభించినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఆ దిశలో ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నారు. మహిళలు, చిన్నారులపై ఎలాంటి అత్యాచారాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోగలమన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకోటానికి ఒకటి, రెండు రోజులు సమయం ఇవ్వాలని మంత్రి మీడియాకు సూచించారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి ఎప్పుడో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే తాను స్పందించి దీని ఆధారంగా ఓ చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ పాస్టర్‌పై చర్యకు తాను ఆదేశాలు జారీ చేయటం, మరుక్షణమే అతను పరారీ కావటం జరిగిందని అయితే మీడియాలో ‘పోలీసులు అసమర్ధులు, వెంటనే చర్యలు తీసుకోలేకపోయారంటూ’ రకరకాల కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారానికోరోజు తమ కుటుంబంతో ఆనందంగా గడపడానికి పోలీసులకు వీక్లీఆఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2018 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని పోలీసు శాఖలోని ఖాళీల భర్తీకై త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
సరిగ్గా ఉదయం 9 గంటలకు మంత్రి సుచరిత భర్త దయాసాగర్‌తో కల్సి రాగా వేద పండితులు వేదమంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు వేదమంత్రాలు, ప్రార్థనలతో మంత్రిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, వస్త్ర వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని మంత్రిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

చిత్రం... రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మేకతోటి సుచరిత