రాష్ట్రీయం

అన్ని హంగులతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: రాష్ట్ర పరిపాలన యంత్రాంగానికి, అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి గుండెకాయ లాంటి సచివాలయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చకా చకా పావులు కదుపుతోంది. ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయంలో తన వాటాకు వచ్చిన 15.5 ఎకరాల్లోని భవనాలను అప్పగించడంతో కొత్త సచివాలయం భవనాలు పాత స్థలంలో నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వ సచివాలయ భవనాలు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 25 ఎకరాల్లో అన్ని హంగులతో, సకల వౌలిక సదుపాయాలతో, వాస్తు దోషాలకు తావులేకుండా కొత్త భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సువిశాలమైన, పది బ్లాక్‌ల కూల్చివేత పని పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది. ఈనెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఈ పనిమీద దృష్టి పెడతారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 27వ తేదీన కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 2021లో కొత్త భవనాల నిర్మాణం పూర్తయితే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న తెలంగాణ సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సచివాలయం వెలుపలకు తరలించనున్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్, అరణ్యభవన్, భూమి పరిపాలనాధికారి కార్యాలయం, ఏసీ గార్డ్స్‌లోని మున్సిపల్ కార్యాలయాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఫైళ్లతో తరలివెళ్లనున్నారు. కొత్త సచివాలయం నిర్మాణానికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 25 ఎకరాల్లో 30 శాతం స్థలంలోనే భవనాలను నిర్మించనున్నారు. 5.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాల నిర్మిస్తారని అంచనా. దాదాపు పది అంతస్థుల భవనాలను నిర్మిస్తారు. మిగిలిన స్థలంలో సందర్శకులు కూర్చునేందుకు గ్యాలరీ, పార్కింగ్ స్థలం, పార్కులు,
క్యాంటీన్లు నిర్మిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్లుగా కొత్త సచివాలయం నిర్మాణానికి అన్ని విధాల ప్రయత్నించారు. బైసన్‌పోలో మైదానం రక్షణ శాఖ ఆధీనంలో ఉండడం వల్ల క్లియరెన్సు రాలేదు. ఈ లోగా ఆంధ్రాలో ప్రభుత్వం మారడం, ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించడంతో నిరుపయోగంగా సచివాలయం భవనాలు ఇచ్చేందుకు అంగీకరించడంతో కొత్త సచివాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ప్రస్తుత సచివాలయంలో ఒక హిందూ దేవాలయం, ఒక మసీదు ఉన్నాయి. వీటి గురించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చివేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన జ్ఞాపకాలు మాత్రమే పనిచేసిన వారికి గుర్తుంటాయి. పాత చరిత్ర కనుమరుగైనట్లే. డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ఎన్టీరామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు లాంటి ఎంతో మంది కాకలు తీరిన రాజకీయ నేతలు ఇక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించారు. రాష్ట్ర విభజన తర్వాత తమకు కేటాయించిన భవనాల నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఏడాదిన్నర పాటు పాలన సాగించారు.