రాష్ట్రీయం

బీజేపీ వైపు.. రాజగోపాల్ రెడ్డి చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 16: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకడిగా..ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కుదిపేస్తుంది. దేశ ప్రజలు మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమంటూ రాజగోపాల్‌రెడ్డి తాజాగా చేసిన వాఖ్యలు ఆయన బీజేపీలో చేరుతారన్న సంకేతాలనిస్తుండటం కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌పై కేడర్‌లో నమ్మకం సన్నగిల్లిందని, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇన్‌చార్జి కుంతియాల సారథ్యంలో పార్టీ పూర్తిగా గల్లంతైందని, రాహుల్ నాయకత్వం బలహీన పడిందని, పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తనను సస్పెండ్ చేయకముందే తానే కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టి బీజేపీలో చేరేందుకు రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య మార్పు కోసం ఆఖరి ప్రయత్నం చేసి, అటు పిమ్మట బీజేపీ అగ్రనాయకత్వం టచ్‌లోకి వెళతారన్న ప్రచారం వినిపిస్తోంది. తనతో పాటు తన అన్న, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలే సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెంకట్‌రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌ను వీడనంటూ, మరికొంత కాలం వేచి చూద్దామంటూ పార్టీ మార్పుపై డైలమాలో ఉన్నట్టుగా అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నాయకత్వ మార్పుకు ఐదేళ్లుగా గళం..
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మార్చాలంటూ ఐదేళ్లుగా తన గళాన్ని వినిపించడంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అందరికంటే ముందున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి మొదలుకుని అన్న వెంకట్‌రెడ్డితో కలిసి తరచూ రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే ఉత్తమ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పీసీసీ సారథ్య బాధ్యతలు తమకు అప్పగిస్తే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామంటూ ప్రకటించారు. ఇటీవల ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కుంతియా, ఉత్తమ్‌లపై రాజగోపాల్‌రెడ్డి బాహటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కి వారి వైఖరితో మరోసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారానికి దూరం కాబోతుందంటూ తన ఆందోళనను వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ అధికనాయకత్వం షోకాజ్ జారీ చేసినప్పటికీ ఎన్నికల వేళ పార్టీ ప్రయోజనాల నేపథ్యంలో ఇరువురు వెనక్కి తగ్గారు. రాజగోపాల్‌రెడ్డి అన్నట్టుగానే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడం, కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం దారుణంగా దెబ్బతినడంతో ఎన్నికల పిదప మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ నాయకత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కనీసం పార్లమెంట్ ఎన్నికల నాటికైనా పీసీసీ సారథిని మారుస్తారని భావించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడం వారిని మరింత నిరాశ పరిచింది. చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమవ్వగా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం పార్టీ గణనీయంగా దెబ్బతినడాన్ని రాజగోపాల్‌రెడ్డి జీర్ణించుకోలేపోయారు. తెలంగాణలో గ్రామాల్లో సరైన కేడర్ సైతం లేని బీజేపీ ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ అతికష్టంగా మూడు స్థానాలకే పరిమితమవ్వడం, సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన పరిణామాల క్రమంలో రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్న భావనకు గురయ్యారు. రాష్ట్ర ప్రజలు అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్న ఆలోచనతో ఉన్న రాజగోపాల్‌రెడ్డి తాను కోరినట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పు జరిగే పరిస్థితి లేకపోవడంతో పార్టీలో ఉండి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడలేమన్న భావనకు వచ్చారు. అటు కేంద్రంలో మోదీ సారథ్యంలో రెండోసారి అధికారంలోకి రావడంతో బీజేపీలో చేరి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటం ఉద్ధృతం చేయాలన్న ఆలోచనతో ఉన్న రాజగోపాల్‌రెడ్డి రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.