రాష్ట్రీయం

ఏటా అదే తంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంజనీరింగ్, వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిరభ్యంతర పత్రాల జారీ , అనుబంధ గుర్తింపు, ఫీజుల ఖరారుపై ప్రతి ఏటా అదే తంతు కొనసాగుతోంది. ఏప్రిల్- మే నెలల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించి, జూన్‌లో అడ్మిషన్లను చేపట్టి, జూలై 1వ తేదీ నుండి తరగతులు నిర్వహించాలనే స్పష్టత ఉన్నా, అనుబంధ గుర్తింపు విషయంలోనూ, జాతీయ సంస్థల గుర్తింపు విషయంలోనూ, నిరభ్యంతర పత్రాల జారీలోనూ, ఫీజుల ఖరారులోనూ షెడ్యూలు తెలిసినా వివిధ శాఖల మధ్య సమన్వయలోపంతోనూ, ప్రభుత్వ సాచివేత ధోరణితో వివాదాలు అనునిత్యం కొనసాగుగుతున్నాయి. అనుబంధ గుర్తింపు విషయంలో యూనివర్శిటీలు ఆఖరి నిమిషం వరకూ స్పష్టమైన నియమనిబంధనలను రూపొందించుకోకపోవడం, ఒక పక్క అడ్మిషన్లు ప్రారంభమైన తర్వాత ఆదరాబాదరాగా తనిఖీలు నిర్వహించడం, ఆయా కాలేజీలకు ఏదో ఒక కొరత చూపించి అనుబంధ గుర్తింపు నిరాకరించడం, దాంతో ఆయా విద్యాసంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించి అనుమతి పొందడం ప్రతిసారీ జరుగుతున్నదే. వాస్తవానికి తెలంగాణ అడ్మిషన్లు , ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటైనా, సరిపడా యంత్రాంగం, సహాయ సిబ్బంది లేకపోవడంతో మిగిలిన పనులకు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై ఆధారపడటంతో ఈ మొత్తం వ్యవహారం నెల రెండు నెలల్లో పూర్తి చేయలేకపోతోంది. ప్రతి ఏటా ఫీజులపై యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. గత ఏడాది ఫీజులకు సంబంధించి హైకోర్టులో కేసులు వేసి తర్వాత సుప్రీంకోర్టు వరకూ యాజమాన్యాలు వెళ్లాల్సి వచ్చింది. ముందుగానే కాలేజీలకు సంబంధించిన జమ-ఖర్చుల పత్రాలను, అఫిడవిట్లను స్వీకరించి ఆడిటింగ్ జరిపించి లాభ నష్టాలను భేరీజు వేసి తదనుగుణంగా ఫీజులను నిర్ధారించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తతతో వ్యవహారం పీకలమీదకు వస్తోంది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోమారు ఫీజులను సమీక్షించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకుని ఐదు
నుండి 8 శాతం వరకూ ఈ ఫీజుల పెంపుదల ఉంటోంది. మూడేళ్లకోమారు కాకుండా ప్రతి ఏడాది వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజులను సమీక్షించాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. కాలేజీల వారీ, ఆయా బ్రాంచిల వారీ ఫీజులను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంత వరకూ ఏఎఫ్‌ఆర్‌సీ ఆ పద్ధతిలో ఫీజులను ఖరారు చేయలేకపోతోంది. ప్రస్తుతం కాలేజీల వారీ ఫీజులను నిర్ధారిస్తోంది. గతంలో అన్ని కాలేజీలకూ ఒకే ఫీజు స్లాబ్ ఉండేది. ఇపుడు కాలేజీల వారీ స్లాబ్‌లు మారడంతో కాలేజీల్లో చేరే విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి వస్తోంది. ఈ దశలో ప్రభుత్వం ప్రతి ఏటా విఫలమవుతోంది. దానికి తోడు సమీక్ష విషయంలో రెగ్యులేటరీ కమిటీ సరైన పంథా అవలంభించకపోవడంతో న్యాయవివాదాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా డాక్యుమెంట్లను స్వీకరించడం వరకూ సక్రమంగా పూర్తిచేస్తున్నా, ఆయా కాలేజీల వాదనలను వినడంలో సరైన వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి.
మరో పక్క యూనివర్శిటీలకు, ఉన్నత విద్యా మండలికి సమన్వయం లోపించి, షెడ్యూలును అనుసరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏటా జరిగే పనికి కూడా సరైన ప్రణాళికను అనుసరించకపోవడంతోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
ఫీజుల పెంపుపై హైకోర్టుకు
యాజమాన్యాలు సమర్పించే ఆదాయ- వ్యయ పట్టికలు ఆధారంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీ 2019-22 బ్లాక్ పీరియడ్‌కు ట్యూషన్ ఫీజులను ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి యథాతథంగా ఫీజులను కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. న్యాయవివాదాల దృష్ట్యా అవసరమైతే షెడ్యూలు మార్చాలని చూస్తోంది
ఎమ్సెట్ షెడ్యూలులో మార్పులు
ఎమ్సెట్ షెడ్యూలు ప్రకారం వెబ్ ఆప్షన్లను 27వ తేదీ నుండి నమోదు చేయాల్సి ఉంది. అయితే గందరగోళం నివారించేందుకు దానిని జూలై 1 నుండి 4వ తేదీకి మార్చారు. వెబ్ ఆప్షన్లను జూలై 4న ఫ్రీజ్ చేస్తారు. తొలి సీట్ల కేటాయింపు జాబితాను జూలై 6న ప్రకటిస్తారు. అభ్యర్ధులు ఫీజు చెల్లించి జూలై 12లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.