రాష్ట్రీయం

విత్తన రంగంలో ఉత్తమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: వ్యవసాయం, విత్తనోత్పత్తితో పాటు వివిధ రంగాల్లో భారత్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిని ఆర్జించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి కైలాష్ చౌదరి స్పష్టం చేశారు. 32వ ఇస్తా (ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్) అంతర్జాతీయ సమావేశాన్ని ఆయన బుధవారం ఇక్కడి హైటెక్స్‌లో పారంభించారు. ఉపగ్రహాలను సౌరమండలంలోకి ప్రవేశపెట్టడంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని, వ్యవసాయ రంగంలో కూడా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో విజయపథంలో నడుస్తోందని మంత్రి ప్రకటించారు. ఇస్తా సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సహకారం అందిస్తున్నాయన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని, ఈ విషయంలో దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు చేస్తున్న పరిశోధనలు రైతులకు చేరుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాల క్రితం ఆహార ధాన్యాలపై ఇతర దేశాలపై భారత్ ఆధారపడి ఉండేదని కైలాశ్ చౌదరి పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశం తన అవసరాలకు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని ఆయన ప్రకటించారు. యూనివర్శిటీలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు చేస్తున్న కృషి ఫలితమే ఇందుకు కారణమని వివరించారు. వరి, గోధుమ, పప్పులు, నూనెగింజలు తదితర ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత
గణనీయంగా పెరిగిందన్నారు. ‘ఇస్తా’ సదస్సు చేసే తీర్మానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రైతుల సంక్షేమమే..
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఈ సమావేశంలో మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంటల పెట్టుబడి కింద రైతులకు ఏటా రెండు పంటలకు కలిపి ఎకరాకు 10 వేల రూపాయలు రైతుబంధు పథకం కింద ఇస్తున్నామని, రైతులు ఎవరైనా మరణిస్తే, బీమా కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని, వేలాది గ్రామాలు, పట్టణాకు తాగునీటిని అందించేందుకు కాళేశ్వరంతో పాటు అనేక నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ఈ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా ఇనమడించనున్నదని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇస్తా సమావేశాలతో ఆసియాలోనే తెలంగాణకు అరుదైన గౌరవం దక్కిందన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నిజరూపం దాలుస్తోందన్నారు. దేశంలో తెలంగాణ ఇప్పటికే 60 శాతం విత్తన మార్కెట్‌ను వశపరచుకున్నదన్నారు. సదస్సులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రముఖులకు వౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఆహ్లాద వాతావరణంలో సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు.
విత్తనోత్పత్తి రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంలో ఇస్తా పాటుపడుతోందని ఇస్తా అధ్యక్షుడు క్రేగ్ మెక్‌గిల్ పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ఇస్తా సంస్థ లక్ష్యమన్నారు. అన్ని దేశాలకు అవకాశాలు లభించేందుకు ఇస్తా అంతర్జాతీయ సమావేశాలను వేర్వేరు దేశాల్లో నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుందని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి అన్నారు. సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ (సీడ్స్) అశ్వినీ కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ విత్తన, ఆర్గానిక్ సర్ట్ఫికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తదితరులు మాట్లాడారు.

చిత్రం... హైటెక్స్‌లో విత్తన సదస్సును ప్రారంభిస్తున్న కేంద్ర వ్యవసాయ మంత్రి కైలాష్ చౌదరి