రాష్ట్రీయం

జెఎన్‌టియుతో అమీతుమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు వివాదం మరోమారు వివాదాస్పదం కాబోతోంది. రాష్ట్రంలో జెఎన్‌టియు గుర్తింపుపై ప్రైవేటు యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ, స్వయంగా జెఎన్‌టియులోనూ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ప్రైవేట్ కాలేజీలపై మాత్రం జెఎన్‌టియు కర్రపెత్తనం చేస్తోందని ఆరోపిస్తూ న్యాయవివాదానికి సైతం దిగాయి. ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సకాలంలో ఫీజులు వసూలుకాకపోవడం, మరోవైపు యూనివర్శిటీ, ప్రభుత్వ విధానాలతో సరిపడా విద్యార్ధులు లభించక, కాలేజీలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. 315 కాలేజీల్లో దాదాపు 174 కాలేజీలకు జెఎన్‌టియు గత ఏడాది గుర్తింపునిరాకరించింది. దానిపై కొన్ని యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి గుర్తింపు పొందినా, తరువాత సౌకర్యాలను కల్పించుకుంటేనే కాలేజీలకు గుర్తింపు కొనసాగించాలనే నిబంధన విధించింది. దాంతో గత ఏడాది గట్టెక్కిన కాలేజీలు ఈ ఏడాది గట్టెక్కుతాయనే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో యూనివర్శిటీకి, కాలేజీల యాజమాన్యాలకూ పెద్ద గొడవే జరగనుందనిపిస్తోంది. ఈ ఏడాది అఫిలియేషన్‌కు మార్చి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జెఎన్‌టియు సూచించినా, 58 కాలేజీలు గుర్తింపునకు ముందుకు రాలేదు. కొన్ని యాజమాన్యాలు జెఎన్‌టియు తీరుపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాయి. అఫిలియేషన్ పర్యవేక్షక కమిటీలు అవి ఇచ్చే నివేదికలను యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. పదే పదే కాలేజీలను వేధించడమే జెఎన్‌టియు పనిగా పెట్టుకుందని యాజమాన్యాల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది 1.25 లక్షల సీట్లు ఉండగా, 70వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, దాదాపు యాజమాన్య కోటాతో కలిపి 40 వేల సీట్లు మిగిలిపోయాయని, ఈ ఏడాది ఇంతవరకూ ఎమ్సెట్ ఇంజనీరింగ్ విభాగానికి 1.43 లక్షలమంది దరఖాస్తు చేశారని ఈ ఏడాది సైతం సీట్లు మిగిలిపోయే పరిస్థితి వచ్చిందని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. అదనపు సీట్లకు అనుమతి ఇచ్చే బదులు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంపై తాము దృష్టిసారించామని జెఎన్‌టియు అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తుకు దూరంగా ఉండిపోయిన 58 కాలేజీలకు యూనివర్శిటీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వారు వెంటనే అఫిలియేషన్ ప్రయత్నాలు చేసుకోవాలని లేకుంటే అడ్మిషన్ల సమయంలో తాము అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.