రాష్ట్రీయం

కరవును అధిగమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: ఈ ఏడాది వర్షాభావం వల్ల ఎదురయ్యే కరవు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. నీటి ఎద్దడి నివారణ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపిణీ, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. శాసన సభలో గురువారం ‘నీటి ఎద్దడి- వర్షాభావం- రైతుల సమస్యలు’ అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. రుతుపవనాలు ఈ ఏడాది జూన్ పదో తేదీకే రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదని ఏటా ఈ సమయానికి రాష్ట్రంలో సగటున 135.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 70.51 సెంటీమీటర్లు మాత్రమే కురిసిందని, 48 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని వివరించారు. జూలై రెండవ వారం వచ్చినా నాట్లు వేయలేని దైన్య స్థితి నెలకొందన్నారు. ఖరీఫ్‌లో 48 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉందని, ఏటా ఇప్పటికే 9.1 లక్షల హెక్టార్లలో నాట్లు పడేవని తెలిపారు. అయితే ఈ ఏడాది 3.8 లక్షల హెక్టార్లలోనే సాగు ప్రారంభమయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చి 40 రోజులే అయినా కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే గడ్డుపరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. 2013-14లో తీవ్రమైన కరవు, తుపాన్లతో అల్లకల్లోలం ఏర్పడిందని రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ 2300 ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించకుండా ఎగ్గొట్టి మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2018-19 ఖరీఫ్‌లో సైతం రూ.1838 కోట్ల నిధులు కరవును ఎదుర్కొనేందుకు లెక్కలు కట్టిందని, ఇందులో 900 కోట్లు కేంద్రం నుంచి వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఏడాది ఖరీఫ్‌లో విత్తనాల పంపిణీని మే నెలలోనే పూర్తి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిచినందునే విత్తనాల కొరతకు కారణమన్నారు. గతేడాది నవంబర్ నుంచే విత్తన సేకరణ జరపాల్సి ఉందన్నారు. అందువల్లే ప్రస్తుతం రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. ఈ సీజన్‌లో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంటే తాము బాధ్యతలు స్వీకరించినప్పుడు కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. అదేమని అధికారులను ప్రశ్నిస్తే నిధులివ్వకుండా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారని, నాడు అధికారులు ప్రభుత్వానికి పంపిన లేఖలను ముఖ్యమంత్రి జగన్ సభ ముందుంచారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుని స్పందించక పోవటంతో ఈ ఏడాది విత్తనాలకు కొరత ఏర్పడిందని తెలిపారు. అంతేకాదు గతేడాది కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 961 కోట్ల బకాయిలతో పాటు విత్తన సంస్థలకు రూ. 384 కోట్లు చెల్లించలేదన్నారు. మానవత్వం కూడా లేకుండా టీడీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చిన తరువాత వీటిని చెల్లించాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. కరవు కాలంలో వడ్డీ చెల్లింపులు, మాఫీ, రుణాల రీషెడ్యూల్ చేయాలనే ఆలోచన కూడా నాటి ప్రభుత్వానికి లేకపోవటం దౌర్భాగ్యమన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ లెక్కల ప్రకారం 2014 సంవత్సరానికి వ్యవసాయక అడ్వాన్స్‌లు 87వేల 612 కోట్లు ఉంటే దీన్ని మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ రుణాలు మాఫీ చేయకపోగా వడ్డీ సొమ్ము కట్టకుండా జీరో వడ్డీ పథకానే్న రద్దు చేసిందని దుయ్యబట్టారు. ఎస్‌ఎల్‌బీసీ లెక్కలను 24వేల 500 కోట్లకు కత్తిరించి 15 వేల కోట్లు కూడా చెల్లించలేదని ఆరోపించారు. దీనే్న రుణమాఫీగా చిత్రీకరించి రైతులను వంచించారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది వ్యవసాయ రుణాలు రూ 1,49, 224 కోట్లకు చేరాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే వైఎస్సార్ జీరో వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది రూ 84వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేస్తున్నారని సకాలంలో చెల్లింపులు జరిపితే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను 60 శాతం అమలులోకి తెచ్చామని, మరో 40 శాతం అందుబాటులోకి రావాలంటే రూ 17 వందల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పిన వెంటనే మంజూరు చేశామని వెల్లడించారు. ఆక్వా రైతులకు రూ 1.50కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో 55 లక్షల మంది రైతులకు కోటీ 38 లక్షల ఎకరాలకు గాను రూ 2164 కోట్ల మేర ప్రయోజనం కల్పిస్తున్నట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ 3వేల కోట్లు కేటాయించామని, సెనగ రైతులకు రూ. 330 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేశామన్నారు. తెలంగాణలో కంటే ఏపీలో ఆయిల్ పామ్ ధరలు తక్కువగా ఉన్నందున రూ. 80 కోట్లతో అదనపు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. పొగాకు ధరల్లో మాంద్యంపై తక్షణమే తమ ప్రభుత్వం స్పందించి నాణ్యత తక్కువ ఉన్న రకానికి ధర పెంచిందన్నారు. ఇవన్నీ నెలరోజుల్లో తీసుకున్న నిర్ణయాలైతే ఈ ఏడాదిలో తుపాన్లు సంభవించినా, కరవు వచ్చినా, పంటలు నష్టపోయే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల నిధి రూ 2వేల కోట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తెస్తామన్నారు. అక్టోబర్ నెల నుంచి ఎకరానికి రూ 12వేల 500 చొప్పున రైతు భరోసా కింద ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తామని పునరుద్ఘాటించారు. సన్న, చిన్నకారు రైతులకు రూ 8754 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కౌలు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా రైతాంగ సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. కౌలు రైతులకు 11 నెలల సాగు ఒప్పందం ఉండేలా అవసరమైతే చట్టాలకు సవరణ తెస్తామన్నారు. సహకార రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు. డెయిరీలు, సొసైటీలను బలోపేతం చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని, ఐదేళ్లలో గ్రామాలకు విస్తృతం చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల విక్రయాలు జరపకుండా ప్రతి నియోజకవర్గంలో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే కల్తీ నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తామన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు అవినీతి మయంగా మారాయని, డబ్బు సంపాదనకే ప్రాజెక్ట్‌లనే గత ప్రభుత్వ విధానాలను పక్కనపెట్టి నీరెలా ప్రవహిస్తుందనే విషయంపై దృష్టి సారిస్తామన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపేందుకు ప్రతి ప్రాజెక్ట్‌కు ఇంజనీర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రివర్స్ టెండరింగ్‌తో తమ ప్రభుత్వం పారదర్శకంగా తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. కరవు ఉపశమన తక్షణ చర్యల్లో భాగంగా నీటి ఎద్దడి నివారణకు ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ కోటి చొప్పున మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. సీమలో మామిడి, చీనీ పంటలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్ల ధరను రూ. 600కు పెంచుతున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో కరవొస్తే రబీలోనే ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 2800 కోట్ల సబ్సిడీని కూడా అందిస్తామని వెల్లడించారు. రుణాలు రీ షెడ్యూల్ చేసి వడ్డీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఉపాధి కల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. చివరగా తమ ప్రభుత్వం కుల, మత, ప్రాంతీయ, పార్టీల భేదాలకు తావివ్వదని చెప్తూ చంద్రబాబు సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం నీటి ఎద్దడి నివారణకు రూ కోటి మంజూరు చేస్తామని వ్యాఖ్యానించారు.

చిత్రం...శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి