రాష్ట్రీయం

‘అనంత’ను కమ్మిన కరవు మేఘం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కరవు మేఘం అనంతపురం జిల్లాను కమ్మేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన వర్షాలు ఎగనామం పెట్టాయి. దీంతో తాగు, సాగునీటి సమస్యతో పాటు వర్షాధారంగా సాగు చేసే వేరుశెనగ పంట విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో వర్షాధారం, బోర్లు, బావుల కింద వేరుశెనగ పంట విస్తారంగా సాగు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కనిపిస్తుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, కొన్ని మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి వెంటాడుతోంది. వేసవిలో జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, గోరంట్ల, పెనుకొండ, మడకశిర, హిందూపురం, శింగనమల, రాయదుర్గం నియోజకవర్గాల్లోని 35 మండలాల పరిధిలోని గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) గణాంకాల మేరకు గ్రామీణ ప్రాంతాలకు 5 టీఎంసీల నీరు అవసరం. జిల్లాలోని పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్), గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, బుక్కపట్నం చెరువు, జీడిపల్లి, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌ల ద్వారా కృష్ణా జలాలను హంద్రీ నీవా, హెచ్చెల్సీ నుంచి తుంగభద్ర నీటిని తరలించి దాహార్తి తీరుస్తున్నారు. ఇలా జిల్లాలోని 3,312 గ్రామాల్లో 2,000 గ్రామాలకు ఉపరితల నీటి వనరుల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, మిగిలిన 1,312 గ్రామాల్లో వేసవిలో 700 గ్రామాల్లో భూగర్భ జలం క్షీణించింది. మరో 600 గ్రామాల్లో నీటి మట్టం పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలు లేని, బోర్లు ఎండిపోయిన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి సమయంలో 700 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం రోజుకు 3,500 ట్రిప్పులతో తరలిస్తున్నారు. జూన్‌లో కురిసిన వర్షంతో 70 గ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరిగినా, ఇంకా 677 గ్రామాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరికొద్ది రోజులు ‘నైరుతి’ వర్ష విరామం కొనసాగితే మళ్లీ 700 పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్ తెలిపారు. కాగా భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.4 వేల కోట్లతో జలధార పథకం పనులు చేపట్టారు. 2040 వరకు పెరిగే జనాభాకు అనుగుణంగా జలధార పథకం పనులు చేపట్టినా, దానిని పునఃసమీక్షించి 2051 సంవత్సరం నాటికి జనాభా పెరుగుదలకు అనుగుణంగా పథకాన్ని రూపకల్పన చేస్తున్నారు.
కాగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పరిధిలోని రాని రాయదుర్గం నియోజకవర్గంలోని 29 గ్రామాలను జలధార కింద చేర్చారు. అలాగే తాడిపత్రికి గండికోట నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. 50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చేపట్టిన జేసీ.నాగిరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కొన్ని పనులు కాంట్రాక్టర్ కారణంగా ఆగిపోవడంతో తిరిగి వాటిని చేపట్టారు. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా అందుతున్న నీటిని 14 ఎంఎల్‌డీ నీటిని తాడిపత్రి ప్రజలు వాడుకుంటున్నారు. జేసీ నాగిరెడ్డి పథకం పూర్తయితే, ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా 29 గ్రామాలకు నీటిని మళ్లించే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలోని పలు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నాయి. దీనికి తోడు వర్షాభావంతో జిల్లాలోని 63 మండలాల్లో జూలైలో గరిష్టంగా 55 మండలాల్లో వర్షం జాడే లేకుండా పోయింది.
అధికారిక గణాంకాల మేరకు గురువారం 58 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో సగటున 28 నుంచి 30 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని 2,856 గ్రామాల్లోని 2,15,441 వ్యవసాయ బోర్లలో 2,15,437 బోర్లను రైతులు జీయో ట్యాగింగ్ చేయగా, వాటిలో 49,681 బోర్లు నీరు లేక పని చేయడం లేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 4,96,088 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 4,74,392 హెక్టార్లలో పంట సాగువుతుందని అంచనా వేసినా, జూన్ నెలలో అడపాదడపా కురిసిన వర్షాలతో కేవలం 25,465 హెక్టార్ల విస్తీర్ణం (5.1 శాతం)లో మాత్రమే వేరుశెనగ పంట సాగైంది. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న 3 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయల్లో ఇప్పటి వరకూ 2,52,229.9 క్వింటాళ్లు 2,21,199 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ నెల 15 వరకూ మిగతా రైతులకు విత్తన కాయలు సరఫరా చేయనున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ నెలాఖరులోగా పదునైన వర్షం రాకుంటే సాగుబడి చతికిలపడే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు తప్ప మరో గత్యంతరం ఉండదని భావిస్తున్నారు. ఆ దిశగా జిల్లా వ్యవసాయ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.
అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలంలో ట్రాక్టర్‌తో దుక్కులు దున్నుతున్న రైతు.. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం
చిత్రం... తాళ్లకెరలో మంచినీటి కోసం కుళాయి వద్ద బారులు తీరిన నీటి బిందెలు