రాష్ట్రీయం

సభలో ‘కరవు’ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: బడ్జెట్ సమావేశాల తొలిరోజు కరవుపై మాటల దాడితో శాసనసభ దద్దరిల్లింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. రైతులకు జీరో వడ్డీ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఒకానొక దశలో స్పీకర్‌పై సైతం చంద్రబాబు మండిపడే రీతిలో సాగింది. రాష్ట్రంలో ‘నీటి ఎద్దడి- వర్షాభావం- రైతుల సమస్యల’పై ప్రభుత్వం తరుపున తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశాన్ని చర్చిస్తూ విత్తనాల కొరతకు టీడీపీనే కారణమన్నారు. రైతాంగ రుణాలను రీషెడ్యూల్ చేయకపోగా వడ్డీ మాఫీని రుణమాఫీగా చిత్రీకరించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చే ఏడాది కాలంలో చేపట్టే కార్యాచరణ గత 40 రోజులుగా అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు కరవును అధిగమించేందుకు తక్షణ చర్యలను సభలో ప్రస్తావించారు. జగన్ ప్రసంగం ముగించిన వెంటనే చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 11 శాతం వృద్ధిరేటు వచ్చిందని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ కరవుపై చర్చించాలని షెడ్యూల్‌లో ఉంటే అందుకు భిన్నంగా మాజీ సీఎం ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. సభ సాక్షిగా ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలను పాతేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు జోక్యం చేసుకుని చేతకానితనంతో తమపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రకటించిన జీరో వడ్డీ పథకం ఎప్పటి నుంచో అమలులో ఉందన్నారు. ఇదే సమయంలో దీనిపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది.
2014-19 మధ్య కాలంలో రైతులకు సున్నా వడ్డీ పథకం కింద తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చెల్లించిందో చంద్రబాబు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుపట్టారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి అసలు ఈ పథకం అమలు చేయలేదని రికార్డులతో నిరూపిస్తే రాజీనామా చేసి ఇంటికి వెళతారా అని నిలదీశారు. చంద్రబాబు స్పందిస్తూ వ్యవసాయాభివృద్ధిలో గత ఐదేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలిపామన్నారు. ఆ లెక్కలు మనం రాసుకునేవి కావని జీఎస్డీపీ, జీడీపీ జాతీయ స్థాయిలో గణాంకాలు ఉంటాయన్నారు. లెక్కలు తెలీకుండానే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు.. మీ లెక్కలు మీరు రాసుకునే పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంతో ఏం సాధించారని ప్రశ్నించారు.
మీరు మారరు.. మనుషులా..రాక్షసులా : జగన్
సీఎం జగన్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఎంత ఖర్చుచేశారని తాను అడిగానని, పధకమే రద్దుచేసిన నేపథ్యంలో తమ ప్రభుత్వం మేలు చేస్తామంటే సాను కూలంగా స్పందించాల్సింది పోయి వితండ వాదనలెందుకని అసహనం వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టించుకోని వీళ్లు మనుషులా? రాక్షసులా అని మండిపడ్డారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ మీకు శరీరాలు, వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా మీలో ఇప్పటికీ మార్పురాలేదని వ్యంగ్యంగా అన్నారు. మీరు సక్రమంగా ఉంటే ఇటునుంచి అటు ఎందుకు మారతారని ఎద్దేవా చేశారు. సహనం కోల్పోవద్దని హితవు పలికారు.
ఇది శాసనసభా..! రౌడీల రాజ్యమా: చంద్రబాబు
జీరో వడ్డీ పథకం కింద ఎంత ఖర్చు చేశారని రికార్డులు తిరగేయాలని ముఖ్యమంత్రి తనను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ పేషీలో రాసుకొచ్చేవి.. అధికారులు రికార్డులు తెస్తేకానీ చెప్పే పరిస్థితి లేదని, మేం ఇచ్చామో.. ఇవ్వలేదో చెబితే సరిపోతుందన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. 2014-19 వరకు రైతులకు వడ్డీ మాఫీ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదే సమయంలో చంద్రబాబు ఏం ఊడపీకారో తేల్చంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వంలో హుందాతనం ఉండాలి.. అంతా కలసికట్టుగా రౌడీ రాజ్యంలా చెలరేగిపోతున్నారు.. ఇంత లెక్కలేనితనమా? జీరో వడ్డీపై నేను లెక్కలు చెప్పాలా? తమాషా చేస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. సున్నా వడ్డీ కింద నువ్వేం చేశావంటూ వయసును కూడా లెక్కచేయకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు గాడిదలు కాసేవాళ్లన్నా మేం పడి ఉండాలా? బీ కేర్‌ఫుల్ అంటూ హెచ్చరించారు. ఒకానొక దశలో స్పీకర్‌పై సైతం చంద్రబాబు మండిపడ్డారు. తాను చెప్పేది వినాలని పట్టుపట్టారు. రికార్డులు చూసుకోండి.. మా ప్రభుత్వం చేయకపోతే చేయలేదని చెప్పండి.. చేస్తే చేసిందని చెప్పండి.. అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకోండని స్పష్టం చేశారు. దీంతో మంత్రి బొత్స జోక్యం చేసుకుని మేం మీ అంత సంస్కార హీనులం కాదన్నారు. కరవు పరిస్థితికి కారణం మీరు కాదా అని నిలదీశారు.