రాష్ట్రీయం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 14: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వ్యాసాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. అంకుర్పారణలో భాగంగా గురువారం రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సభా ప్రార్థన, రక్షాబంధనం, నవగ్రహ, వాస్తు హోమాలు, మహా సంకల్పం, మృత్యు సందర్శన వంటి పూజా కార్యక్రమాలను వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు నిర్వహించారు. భారీ ఎండల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా రూ.85 లక్షలతో చలువపందిళ్లు, భక్తులకు చూడముచ్చటగా కోటిరూపాయలతో విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించే సామర్థ్యంగల టిటిడి ఆధ్వర్యంలో ఈసారి మొదటిసారిగా నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఏకశిలానగర కోదండరామయ్యస్వామి బ్రహ్మోత్సవాలు భారీ ఏర్పాట్లతో నిర్వహించనున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ లైట్లతో అలంకరించారు. వృద్ధుల భజనలు, కోలాటాలు, చెక్క్భజనలు, కేరళ వాయిద్యాల కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీతారాములు, వివిధ దేవతా మూర్తుల ఆకారాలను విద్యుత్‌లైట్లతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ అలంకరణలతో ఏక శిలానగరం మరో వైకుంఠంగా మారింది. ఆలయ డిప్యూటీ ఇఓ బాలాజీ ఆధ్వర్యంలో అంకుర్ఫారణ జరిగింది. వేద మంత్రోచ్చరణలతో రామాలయం రామనామ స్మరణలతో మార్మోగింది. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణం, శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి సీతారాములు శేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ధ్వజారోహణ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇఓ సాంబశివరావు, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కలెక్టర్ కేవి రమణ తదితరులు పాల్గొననున్నారు.ఒంటిమిట్టలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమికి విఐపిల రాకను దృష్టిలో పెట్టుకుని సుమారు 2,500 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.

చిత్రం బ్రహ్మోత్సవాల అంకురార్పణ కోసం
పుట్టమన్ను సేకరిస్తున్న దృశ్యం