రాష్ట్రీయం

కాపు రిజర్వేషన్లపై దద్దరిల్లిన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : కాపు వర్గీయులకు రిజర్వేషన్ అమలుపై శాసనసభ దద్దరిల్లింది. మంగళవారం ప్రశ్నోత్తరాల అనంతరం కాపులకు బీసీ రిజర్వేషన్ అంశంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సంవాదం చోటుచేసుకోగా, వైసీపీ.. టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ప్రశ్న సూటిగా అడిగితే తాను సమాధానం చెప్తానని ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. బడ్జెట్ సమావేశం మీద చర్చ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు రాజకీయంగా కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని రిజర్వేషన్ల విషయంలో మోసం చేసినందువల్లే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓట్లు రాకుండా ప్రతిపక్షంలో కూర్చున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌లో తమ ప్రభుత్వం 5 శాతం కాపులకు వర్తింప చేయాలని ఉత్తర్వులు జారీచేసిందని దీన్ని కొనసాగిస్తారా అని ప్రభుత్వాన్ని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దీనిపై సీఎం జగన్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి అడ్డుతగిలారు. దీంతో జగన్ సహనం కోల్పోయి అచ్చెన్నాయుడు శరీరమైతే పెంచారు కానీ.. బుర్ర పెంచలేదని ఎద్దేవా చేశారు. బుర్ర ఎంత పెంచానో నీకు చూపిస్తాను..రా..అంటూ అచ్చెన్నాయుడు బదులిచ్చారు. అచ్చెన్నాయుడుపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైఎస్సే కాపులకు పంగనామాలు పెట్టారని ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా.. లేదా.. అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చనిపోయిన నేతల గురించి, 2004లో జరిగిన సంఘటనల గురించి ప్రస్తావించటమెందుకు.. మీరేం చేశారో.. మేం ఏం చేస్తున్నామో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షం ఉందని మా వైపు కనె్నత్తి కూడా చూడటంలేదని ముఖ్యమంత్రి వైపు చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. స్పీకర్ తీవ్రంగా స్పందిస్తూ ‘నన్ను ఎవరూ డిక్టేట్ చేయలేరు.. నేను ఎవరికీ భయపడను..అవకాశం వస్తుంది..అప్పుడు మాట్లాడండి.. మీరు మాట్లాడే సమయంలో మంత్రులు లేదా ముఖ్య మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే వినాల్సిందేనని స్పష్టం చేశారు. సభా సాంప్రదాయాల కనుగుణంగా నడుచుకోవాలని చురకలంటించారు. మేం మాట్లాడే సమయంలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నామనే భావన రావాలన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసినందునే ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందని కనీసం మనస్సాక్షికైనా సర్ది చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. కాపులకు 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు చేస్తారా.. లేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కాపుల సంక్షేమానికి తమ మేనిఫెస్టో నవరత్నాలులో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేశారు. స్పీకర్ నిరాకరిస్తూ మీరు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు.. ఇంకా టాపిక్‌ను పొడిగించాల్సిన అవసరంలేదని వారించారు. ప్రభుత్వ వివరణపై సంతృప్తి చెందని టీడీపీ ఎమ్మెల్యేలు గుమికూడి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.