రాష్ట్రీయం

జనరంజకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: తమ ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా జనరంజక బడ్జెట్‌ను అమలు చేస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి వెల్లడించారు. నవరత్నాల అమలుకు అత్యధికంగా 80 శాతం నిధులు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమ తుల్యం చేసుకుంటూ ఆర్థిక దుబారాను తగ్గించుకోవటం ద్వారా ఇది సాధ్యపడుతుందని చెప్పారు. టీడీపీ హయాంలో జరిగిన కేటాయింపులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తుతిస్తూ తమ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం బుగ్గన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెత్తిన కిరీటం.. చేతిలో ఖడ్గం..ఆపై కత్తి అంచున ఓ చిన్న దోమను చంపుతూ బాహుబలి గెటప్‌తో కటౌట్...ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు దోమలపై దండయాత్ర ప్రచార దృశ్య మాలికలని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఈ కార్యక్రమం ప్రారంభానికి అప్పట్లో చంద్రబాబు వస్తున్న సందర్భంగా ఈ తరహా
కటౌట్‌లు వెలిశాయన్నారు. గత ప్రభుత్వంలో ‘మేటర్ వీక్.. పబ్లిసిటీ పీక్’ అని చమత్కరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కటొక్కటిగా ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీరు- చెట్టు, వనం-మనం, మీ ఇంటికే మీ భూమి, దోమలపై దండయాత్ర, హ్యాపీ సండే అంటూ కొత్త పథకాలను అమలు చేశారని వీటిలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమ్మ ఒడి కార్యక్రమం, రాజధానికి కేటాయింపులను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు తమ హయాంలో ఎంతెంత కేటాయింపులు జరిగాయో, ఎంత దోచుకు తిన్నారో తెలుసుకోవాలని చురకలంటించారు. అధికారులు, ఉద్యోగులను సమీక్షల పేరుతో వేధిస్తే హ్యాపీ సండే ఎలా గడుపుతారని నిలదీశారు. వనం- మనం కార్యక్రమం ద్వారా అసలేం చేశారో తేల్చాలన్నారు. నీరు- చెట్టు కార్యక్రమానికి ఐదేళ్లలో రూ. 793 కోట్లు కేటాయించి రూ. 4,853 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 4,5 విడతల రుణమాఫీకి నిధులు కేటాయించకుండా తమ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధానికి రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించారని టీడీపీ సభ్యులు విమర్శిస్తున్నారని అసలు టీడీపీ హయాంలో రాజధానికి చేసిన ఖర్చు రూ. 273 కోట్లు మాత్రమే అన్నారు. అయినా ఇక్కడ అన్నీ తాత్కాలికమే కదా అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ల నిధులు ఎన్నికల ఏడాదిలో కేటాయింపులు ఘనంగా పెంచి ఖర్చు చేసింది శూన్యమన్నారు. ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు.

అరచేతిలో అమరావతి గ్రాఫిక్స్
అరచేతిలో అమరావతి గ్రాఫిక్స్‌ను చూపి చంద్రబాబు ప్రజలను వంచించారని రాజేంద్రనాధ్‌రెడ్డి మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో నాటి ఆర్థిక మంత్రి యనమలను వెంటేసుకుని మలేషియా, సింగపూర్, శ్రీలంక, లండన్, జపాన్, జర్మనీ, అమెరికా, లండన్, రష్యా, చైనాల్లో పర్యటించి వచ్చి ఆ దేశాల్లోని ప్రధాన నగరాల తరహాలోనే అమరావతిని నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు. చివరకు దర్శకుడు రాజవౌళితో డిజైన్లు గీయించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ. 15 వందల కోట్లు విడుదల చేస్తే ఏపీ బడ్జెట్‌లో కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ. 500 కోట్లు ప్రతిపాదించిందని అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నవరత్నాలకే బడ్జెట్‌లో 80 శాతం ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మించిన భవనాల్లో ఊపిరాడక ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ప్రమాదం లేకపోలేదని వ్యాఖ్యానించారు. ఎక్కడా వెంటిలేషన్ అనేది కనిపించని రాజధాని నిర్మాణం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు.
వడ్డీలేని రుణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో చెల్లించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ సర్కార్ రూ. 11,595 కోట్లు కేటాయించి కేవలం 629 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని దశల వారీ అమలు చేస్తామని ప్రకటించిందని ఇందులో భాగంగా ఈ ఏడాది బెల్ట్ షాపులను నియంత్రించటంతో పాటు ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించే యోచనతో ఉందన్నారు. చివరగా పూర్తి స్థాయిలో నిషేధిస్తామని పునరుద్ఘాటించారు. గత ఎన్నికల ముందు రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ రైతుల్ని దగా చేసిందని విమర్శించారు. రూ. 87వేల కోట్లకు గాను 24 వేల కోట్లకు కుదించి 15 వేల కోట్లు మాత్రమే చెల్లించారని ఇంకా 4325 కోట్లు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. ముళ్ల కంచెలు తప్ప పరిశ్రమలేవీ కనిపించటం లేదన్నారు. గతేడాది రాయితీల కింద రూ. 3500 కోట్లు కేటాయించి 740 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఐటీ నిపుణుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు హయాంలో ఐటీ పరిశ్రమలు కూడా అడుగంటాయని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అట్టడుగున ఉన్న నిరుపేద వర్గాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉందన్నారు. ఇందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమానికి రూ. 6600 కోట్లు, ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ కింద రూ. 4వేల కోట్లు, పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ. 15 వందల కోట్లు, రైతు భరోసాకు రూ. 8750 కోట్లు, వ్యవసాయానికి రూ 28వేల కోట్లు, గృహనిర్మాణానికి రూ. 8500 కోట్లు కేటాయించిందని వివరించారు. వచ్చే ఐదేళ్లలో అప్పులు పెరిగే అవకాశాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలపై భారం పడకుండా అభివృద్ధి, సంక్షేమాలను సమతుల్యం చేస్తామని భరోసా ఇచ్చారు. ఫిస్కల్ లోటు 3.58 శాతం ఉందని ఆరోపిస్తున్న టీడీపీ సభ్యులు గత ప్రభుత్వ హయాంలో ఎంత వచ్చిందనేది గ్రహించాలన్నారు.ప్రతి ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి చంద్రబాబు అప్పులు చేశారన్నారు. ఫలితంగా తమ ప్రభుత్వంపై మూడు లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. ఆర్థికంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దుబారాను తగ్గిస్తూ పథకాలు అమలు చేయాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

చిత్రం...సభలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి