రాష్ట్రీయం

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటుకు కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటులో కమిటీ సిఫారసులను, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ఉందా అని టీడీపీ సభ్యుడు జి.శ్రీనివాసులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకున్నామని, కానీ విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చట్టంలో విస్తీర్ణం, జనాభా, చారిత్రక ప్రాధాన్యత, భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, విద్య తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త జిల్లాలతో పాటు కొత్త డివిజన్లు కూడా ఏర్పాటవుతాయన్నారు. కొత్త జిల్లాల త్వరలోనే కమిటీని నియమిస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో సభ్యుడు జి.శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు మండలాల పునర్విభజన అవసరమన్నారు. రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు, తిరుపతి పేరుతో రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. టీడీపీ సభ్యురాలు సంధ్యారాణి మాట్లాడుతూ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు జిల్లాల పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు. విజయనగరంలోని గిరిజన గ్రామం నుంచి పోలవరం మండలంలోని గిరిజన గ్రామానికి వెళ్లాలంటే దాదాపు 540 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అరకు, పాడేరు వెళ్లాలన్నా 260 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్వతీపురాన్ని జిల్లా ప్రధాన కేంద్రంగా పెట్టాలన్నారు. బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ గోవా కంటే తూర్పు గోదావరి జిల్లా పెద్దదని, కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం తీసుకుంటే మంచిందన్నారు. దంతేవాడ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ సభ్యుడు తిప్పేస్వామి హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని కోరారు. టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ గురజాలను జిల్లా చేసి, జిల్లా కేంద్రంగా కూడా చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పరిపాలనా సౌలభ్యం చూసుకుని, అందరికీ అందుబాటులో ఉండేలా మధ్యలో ఉండాలని సూచించారు. ఒక కమిటీ లేదా అఖిలపక్షం వేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పీడీఎఫ్ సభ్యుడు రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రముఖుల పేర్లు జిల్లాలకు పెట్టాలన్నారు. పీడీఎఫ్ సభ్యుడు లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, కమిటీ వేయాలని పీడీఎఫ్ సభ్యుడు వై.శ్రీనివాసులు రెడ్డి సూచించారు.