రాష్ట్రీయం

పని చేయని పాలకవర్గాల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: సమర్థవంతంగా పనిచేయని, అక్రమాలకు పాల్పడే మున్సిపాలిటీల పాలక వర్గాలను రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తూ కొత్త చట్టం రూపొందింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లకు రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణించడం, పురపాలక సంఘాలపై జిల్లా కలెక్టర్లకు విస్తృతమైన అధికారాలను కల్పించడం తదితర అంశాలతో మున్సిపల్ కొత్త చట్టం రూపొందించారు. ‘తెలంగాణ పురపాలికల చట్టం-2019’ పేరుతో ఒక బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో గురువారం ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం అయిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు బిల్లును ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ బిల్లుపై శుక్రవారం చర్చకు అనుమతి ఇస్తానని స్పీకర్ ప్రకటించారు. బిల్లును ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వెంటనే ఈ కాపీలను సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఈ బిల్లుపై ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా, అభ్యంతరాలు చెప్పాలనుకున్నా అవకాశం ఇస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ పురపాలికల చట్టం-2019 అమల్లోకి వస్తే ఇప్పటికే అమల్లో ఉన్న తెలంగాణ పురపాలికల చట్టం-1965, తెలంగాణ పురపాలక కార్పోరేషన్ల చట్టం-1994 రద్దయిపోతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీతోకలపి 13 కార్పొరేషన్లు ఏర్పాటవుతాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రజలు ప్రత్యక్ష విధానంలో పార్టీ ప్రాతిపదికన ఎన్నుకునేందుకు అవకాశం ఉండగా, మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక చేతులెత్తడం ద్వారా పరోక్ష విధానంలో నిర్వహిస్తారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులు పార్టీ విప్ దిక్కరిస్తే వారిని పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు వీలుగా బిల్లును రూపొందించారు. మేయర్ లేదా చైర్‌పర్సన్లు, లేదా డిప్యూటీ మేయర్ లేదా వైస్-చైర్‌పర్సన్లపై విశ్వాస పరీక్ష లేదా అవిశ్వాస పరీక్షలకు 50 శాతం మందిపైగా సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వారి కోరిక మేరకు సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి ఎన్నికైన సభ్యులు పదవీ ప్రమాణం చేసేందుకు తొలి సమావేశం జరిగే రోజు నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటారు. సభ్యులుగా పోటీ చేసేందుకు మున్సిపాలిటీలో ఓటరై ఉండటంతో పాటు 21 ఏళ్లు నిండి ఉండాలని నిబంధన విధించారు. ఏవైనా మున్సిపాలిటీలు చట్టవ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డా, ఇతరత్రా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డట్టు రుజువైతే సదరు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని రద్దుచేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. చైర్‌పర్సన్లు, లేదా మేయర్లు అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు అవకాశం కల్పించారు. హరితహారం కింద చెట్లను పెంచేందుకు నర్సరీల పెంపకం, చెట్లను కాపాడటం తదితర అవసరాలకోసం సంబందిత స్థానిక సంస్థ వార్షిక బడ్జెట్‌లో కేటాయించే నిధులను ‘గ్రీన్ బడ్జెట్’గా పిలుస్తారు. ఇందుకోసం రూపొందించే ప్లాన్‌ను ‘గ్రీన్ యాక్షన్ ప్లాన్’ అంటారు. హరిత హారంలో వార్డుల వారీగా నాటిన మొక్కల్లో 15 శాతంపైగా తక్కువ జీవిస్తే వార్డు సభ్యుడిని, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. చైర్‌పర్సన్లు అత్యవసర పరిస్థితి పనులకు మున్సిపల్ నిధులనుండి వ్యయం చేసే అధికారం కల్పిస్తూ, దానికి తదుపరి సమావేశంలో సర్వసభ్య సమావేశం అనుమతి తీసుకోవాలని పొందుపరిచారు. చైర్‌పర్సన్ లేకపోతే
వైస్-చైర్‌పర్సకు బాధ్యతలు అప్పగిస్తారు. వీరిద్దరూ లేకపోతే సభ్యుల్లో ఒకరికి చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతి వార్డులోనూ స్థానిక ఓటర్లతో కూడిన నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తారు. నీటిసరఫరా, శానిటేషన్, హరితహారం, క్రీడలు, పార్కుల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఇస్తారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా పరిగణించి, మేయర్లు, చైర్‌పర్సన్ల స్థానాల్లో 50 శాతం స్థానాలను ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు రిజర్వ్ చేస్తారు. రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఒక సారి బాధ్యతలు చేపట్టిన మేయర్, చైర్‌పర్సన్లపై మూడేళ్ల వరకు అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించేందుకు వీలులేదు. ఒక సారి అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగిన ఏడాది వరకు మళ్లీ అవిశ్వాసం, విశ్వాస తీర్మానాలు ప్రతిపాదించేందుకు వీలు లేకుండా చట్టం రూపొందించారు. ఏదైనా కారణాల వల్ల మేయర్, చైర్‌పర్సన్, సభ్యుల స్థానాలు ఖాళీ అయితే ఆరునెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పాలక వర్గాల్లో ఎవరైనా రాజీనామా చేస్తే, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఆమోదించాల్సి ఉంటుంది. పాలకవర్గం సభ్యులకు గౌరవవేతనం, టీఏ, డీఏలను పురపాలక నిధినుండే చెల్లించాల్సి ఉంటుంది. పురపాలక కమిషనర్ ముఖ్య కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ అధీనంలో కమిషనర్, ఇతర సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఏవైనా తప్పు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకునే అధికారం కల్పించారు. వీధులకు ఎవరిపేర్లయినా పెట్టాలని భావిస్తే ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆర్థిక అంశాల కోసం రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఇప్పుడున్న విధంగానే పనిచేస్తాయి.
ఆస్తిపన్ను బోర్డు
పన్నులకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ‘తెలంగాణ రాష్ట్ర ఆస్తిపన్ను బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తదితర అంశాల్లో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ‘పురపాలక భవన ట్రిబ్యునల్’ ను ఏర్పాటు చేస్తారు.