రాష్ట్రీయం

అవినీతికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 19: కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 100 కోట్ల పరిమితి దాటిన పనులన్నింటినీ జుడీషియల్ కమిషన్ పరిశీలన అనంతరమే అనుమతించే విధంగా నూతన విధానాన్ని అమల్లోకి తేనుంది. అంతేకాదు నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చట్టాల్లో సవరణలు తీసుకురానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంతకు ముందు ప్రకటించిన విధంగా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు నిర్దేశించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలనే యోచనతో ఉంది. శుక్రవారం సచివాలయం ఒకటో బ్లాక్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతికి అడ్డుకట్ట వేసి టెండర్లలో పారదర్శకత ఉండేలా హైకోర్టు న్యాయమూర్తి/రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో పరిశీలన జరిపేలా నిర్దేశించిన బిల్లుకు కేబినెట్ ఓకే తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చులో నియంత్రణ పాటించటమే లక్ష్యాలుగా ముసాయిదా బిల్లు రూపుదిద్దుకుంది. రూ. 100 కోట్లు
దాటిన అన్ని వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను హైకోర్టు న్యాయమూర్తి లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటయ్యే జుడిషియల్ కమిషన్ పరిధి లోకి తీసుకురానుంది. పనులు ప్రతిపాదించే ప్రతి ప్రభుత్వ శాఖ సంబంధిత పత్రాలను కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లు పిలవటానికి ముందే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్, అన్ని ప్రాజెక్ట్‌లను కమిషన్ పరిశీలిస్తుంది. పనులు ప్యాకేజీలుగా వర్గీకరించినప్పటికీ ప్రాజెక్ట్ వ్యయం రూ. 100 కోట్లు దాటితే కమిషన్ పరిధిలోకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిపుణుల సహకారాన్ని కోరినా, అవసరమైనా ప్రభుత్వం అందిస్తుంది. పనుల ప్రతిపాదనలను వారం రోజుల పాటు ప్రజాబాహుళ్యంతో పాటు కమిషన్ పరిశీలనకు అందుబాటులో ఉంచుతారు. ఆపై మరో 8 రోజులు కమిషన్ పరిశీలిస్తుంది. సూచనలు, సలహాలు అందించే వారికి తగిన రక్షణ కల్పిస్తామని కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మొత్తం 15 రోజుల్లో పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం బిడ్డింగ్ ఉంటుంది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దీన్ని అడ్డుకుంటే నియంత్రించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని కమిషన్ ఏర్పాటు చేసుకునే విధంగా చట్టంలో వీలు కల్పిస్తారు. కమిషన్‌కు చైర్మన్‌గా ఉండే జడ్జితో పాటు వారి వద్ద పనిచేసే సిబ్బందిని ప్రభుత్వ సేవకులుగా గుర్తిస్తారు. ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్‌లు, సర్వీస్ కాంట్రాక్ట్‌లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించేందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించింది. అంతేకాదు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టానికి అవసరమైన ముసాయిదా బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది.
వైఎస్సార్ నవోదయం
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లకు ఊరటగా వైఎస్సార్ నవోదయం అనే నూతన పథకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా 86వేల ఎంఎస్‌ఎంఈలను గుర్తించి వాటిపై ఉన్న రూ. 4వేల కోట్ల రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పరిష్కరించేందుకు నిర్ణయించారు. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఆర్థికాభివృద్ధి మండలి స్థానే కొత్త చట్టం
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) స్థానే కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నిర్దేశించిన ఏపీ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్ -2019 ముసాయిదా బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, 7గురు డైరెక్టర్లతో మండలి ఏర్పాటవుతుంది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, ప్రాజెక్ట్‌లకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్య నియంత్రణ, విధానాల రూపకల్పనే చట్టం లక్ష్యాలు. బోర్డు డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వ్యవహరిస్తారు. ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలి ఏర్పాటవుతుంది. ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈఒలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. విజయవాడలో ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లో మరో కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువ పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం కల్పిస్తారు. గతంలోని ఏపీఈడీబీలో అవసరానికి మించి భారీ సంఖ్యలో పదవులు, పక్షపాతం, అవినీతి, విదేశీ పర్యటనల పేరిట దుబారా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఎస్సీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్‌ను అందించాలని మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 15,62,684 మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వంపై రూ. 411 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. ఇందుకోసం త్వరలో కమిషన్‌లు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధనకు ఇది ఉపకరిస్తుంది. విద్యా హక్కు చట్టం అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే విధంగా నిరుద్యోగులకు భరోసా కల్పించింది. పీపీపీ పద్ధతిన ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్ట్‌లలో కూడా 75 శాతం ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక చట్టం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. నిర్వాసితులకు జీవనోపాధి గ్యారంటీ కల్పించటం చట్టం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విప్లవాత్మక చట్టానికి అవసరమైన ముసాయిదా బిల్లుపై మంత్రమండలి ఆమోద ముద్ర వేసింది.
టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో సభ్యునిగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌కు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ఇందుకు అవసరమైన మేరకు హిందూ ధార్మిక చట్టంలో సవరణలకు నిర్దేశించిన బిల్లుకు కేబినెట్ సానుకూలంగా స్పందించింది.

బీసీలకు ఊరట
బలహీన వర్గాల్లోని కొన్ని కులాలకు ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రజకులు, నారుూబ్రాహ్మణులు, దర్జీలకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులు, సొసైటీలు, ట్రస్ట్ బోర్డ్‌ల నియామకాల్లో 50 శాతం వారికే ప్రాతినిధ్యం కల్పించేందుకు మంత్రివర్గ సమావేశం సానుకూలంగా స్పందించింది. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తారు. ఆలయ కమిటీలలో కూడా 50 శాతం రిజర్వేషన్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.