రాష్ట్రీయం

నిరంతర వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్షేత్ర స్థాయిలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతర సరఫరా అందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. సవాళ్లను అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనే కృతనిశ్చయంతో ఉంది. సాధారణ విద్యుత్ సరఫరా పరిస్థితి, అంతరాయాలు, అనుకోని అవాంతరాలు వంటి అంశాలపై రోజువారీ లేదా తరచు ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ప్రతి ఇంటికీ 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే విషయమై ఇంధన బులెటిన్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. విద్యుత్‌రంగ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పథకం అమలుపై శ్రద్ధ చూపాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో తప్పనిసరి అవాంతరాలు ఎదురైతే అందుకు గల కారణాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు తెలియ జేసే ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు నివేదికలు కూడా అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగా రూ.4225 కోట్లు (65శాతం) వ్యవసాయక ఉచిత విద్యుత్‌కు కేటాయించారని శ్రీకాంత్ వివరించారు. సీఎం ఆదేశాల అమలుకు సంబంధించి శనివారం డిస్కంల అధికారులతో శ్రీకాంత్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాలో రాజీపడవద్దని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులకు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఒకవేళ సరఫరాలో వైఫల్యాలు ఉంటే ఎంత సమయం పడుతుంది? అందుకు గల కారణాలు, విద్యుదుత్పాదనలో సమస్యలు, పంపిణీ, వాతావరణ పరిస్థితులు (అధిక వర్షాలు, పెనుగాలులు) వంటి అంశాలపై సంబంధిత జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్లు నిత్యం బులెటిన్‌ల్లో వివరించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రానున్న 24 గంటలకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రతి వారం విద్యుత్ సరఫరాకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమాచారం కచ్చితంగా, పారదర్శకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని అధికారులను శ్రీకాంత్ ఆదేశించారు. మీడియాకు కూడా ఇంధన బులెటిన్‌ను విడుదల చేయాలన్నారు. విద్యుత్ రంగంలో జవాబుదారీతనాన్ని పెంచే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెలలో విద్యుత్ రోజువారీ డిమాండ్ 175 మిలియన్ యూనిట్లకు చేరినందున అందుకు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిస్కంలు గత నెలలో రోజుకు 181.65 మిలియన్ యూనిట్లు సరఫరా చేయాల్సి వచ్చిందని గతేడాది ఇదే సమయంలో 168.89 మిలియన్ యూనిట్లుగా ఉందన్నారు. ఈ ఏడాది డిమాండ్ 7.55 శాతం పెరిగిందని వివరించారు. గతేడాది జూలై కంటే ఈ నెలలో విద్యుత్ వినియోగం 15.46 శాతం పెరిగిందన్నారు. 9గంటల ఉచిత విద్యుత్, వర్షాభావ పరిస్థితుల కారణంగానే డిమాండ్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి సమయాల్లోనే అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని దీన్ని సవాల్‌గా తీసుకోవాలని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఇందుకు లైన్ మెన్ నుంచి చైర్మన్ స్థాయి వరకు అంతా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో రోజువారీ పవన విద్యుదుత్పాదనలో నెలకొన్న భారీ ఒడిదుడుకులు గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 22 శాతం పవన విద్యుత్ వినియోగం ఉన్నందున ఆ ప్రభావం ఎక్కువగా చూపుతోందని వివరించారు. 10వేల మెగావాట్ల గ్రిడ్‌లో రాష్ట్రానికి 7500 మెగావాట్ల అస్థిర పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఉందన్నారు. పవర్ ఎక్స్చేంజ్ ద్వారా ఏపీ డిస్కంలు ఈ అంతరాయాన్ని పూడ్చుకుంటున్నాయని తెలిపారు. ఈ నెలలో పవన విద్యుదుత్పత్తి భారీ ఒడిదుడుకులకు (25 నుంచి 77 మిలియన్ యూనిట్లు) గురవుతోందని చెప్పారు. రోజువారీ పద్ధతిలోనే అంచనాలు, వాస్తవాలకు మధ్య కొద్ది సమయంలోనే 50 నుంచి 2400 మెగావాట్ల వరకు వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. ఈ సమయంలో థర్మల్ ప్లాంట్లను స్విచాన్‌చేసి ఆఫ్ చేయటం సాధ్యపడదన్నారు. థర్మల్ ప్లాంట్‌లు విద్యుత్ సరఫరా చేయాలంటే వార్మ్ స్టార్ట్‌కు 8 గంటలు, కోల్డ్ స్టార్ట్‌కు 36 గంటలు పడుతుందన్నారు. ఇలాంటి సమయాల్లో వారం రోజులకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తే అధిక వ్యయం అవుతుందని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్నారు. వినియోగదారులే అసలైన యజమానులని వారితో నిరంతర సంప్రతింపులు జరపాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలన్నారు. డిస్కం అధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతివారం సమీక్ష జరుపుతారని చెప్పారు. విద్యుత్ రంగంపై ఉన్నత స్థాయి సమీక్షల అనంతరం ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. దీనివల్ల కోటీ 67 లక్షల గృహ విద్యుత్ వినియోగాదారులకే కాకుండా పారిశ్రామిక రంగానికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి విద్యుత్ రంగమే కీలకమని చెప్తూ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి అంశాలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏపీ జెన్‌కో ఎండీ బి శ్రీ్ధర్ తెలిపారు. తద్వారా విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచటమేకాక స్థిరత్వం వస్తుందన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో ట్రాన్స్‌కో జేఎండీలు చక్రధర్‌బాబు, ఉమాపతి, డిస్కంల సీఎండీలు నాగలక్ష్మీ సెల్వరాజన్, ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.