రాష్ట్రీయం

తీరంలో అసైన్డ్ తిమింగలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన సముద్రతీరాన్ని అ‘సైన్డ్’ తిమింగలాలు మింగేస్తున్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనమవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. తీరం వెంట లక్షలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయి. అయితే ఇప్పటికే లెక్కకు మిక్కిలి భూములు అన్యాక్రాంతమయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం వరకు ప్రముఖుల కబంధ హస్తాల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో రొయ్యలు, చేపల చెరువుల సాగుతో చాలామంది అపర కుబేరులుగా మారారు. ప్రభుత్వాలు సైతం సెజ్‌లు, పోర్ట్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయటం, ఆపై ఆ ప్రతిపాదనలు అటకెక్కడంతో అందుబాటులో ఉన్న వరకు భూములు యథేచ్ఛ కబ్జాకు గురయ్యాయి. తీరంతో పాటు ప్రభుత్వపరంగా అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు అసైన్డ్ భోక్తలకు నోటీసులు కూడా అందాయి. అదే సమయంలో వాడరేవు-నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా వాడరేవు మధ్య పోర్టు కారిడార్‌ను 30 వేల ఎకరాల్లో రూ. 16వేల కోట్లతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందు కొచ్చింది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని తీర ప్రాంతంలో 24 వేల ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం సేకరించింది. దీన్ని అభివృద్ధి చేసేందుకు రస్-ఆల్- ఖైమా (ఆర్‌ఏకె), మాట్రిక్స్ ఎన్‌పోర్ట్ హోల్డింగ్స్ సంస్థలు ముందుకు రావటంతో ప్రభుత్వం భూ సేకరణ జరిపింది. ఇందులో వేల ఎకరాలు అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములను కూడా వాన్‌పిక్ కు ధారాదత్తం చేశారనే ఆరోపణలు లేకపోలేదు. వాన్‌పిక్ పేరుతో కారు చౌకగా అసైన్డ్ భూములను రైతుల నుంచి కొనుగోలు చేశారు. వాన్‌పిక్‌కు సంబంధించి 2008లో రస్-ఆల్-ఖైమాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. వైఎస్ మరణానంతరం ఈ ఒప్పందాన్ని 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటికే భూములకు సంబంధించి ఆర్‌ఏకె సంస్థ కొంత చెల్లింపులు జరిపింది. అంతేకాకుండా ఒప్పందం రద్దు కావటంతో కోర్టును ఆశ్రయించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని సీబీఐ నిర్ధారించింది. ఇందులో మధ్యవర్తిగా మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ దుర్గాప్రసాద్ వ్యవహరించారు. ఒప్పందానికి ప్రతిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రూ. 854 కోట్ల విలువైన 12వేల ఎకరాలకు పైగా కట్టబెట్టి క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే అభియోగాలు వచ్చాయి. ఈ వ్యవహారంతో వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణారావును కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. దీనిపై సీబీఐ కోర్టులో కేసు నడుస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం వాన్‌పిక్ భూములకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. తీర ప్రాంత అభివృద్ధికి రూపొందించిన కార్యాచరణలో భాగంగా ఎగుమతులు, దిగుమతుల హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. అయితే రాజధాని, పోలవరం ప్రాజెక్ట్‌లపై దృష్టి కేంద్రీకరించిన గత టీడీపీ ప్రభుత్వం వాన్‌పిక్‌ను విస్మరించింది. తాజాగా అసైన్డ్ భూములకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా వాన్‌పిక్ భూముల ప్రస్తావన కూడా వచ్చినట్లు చెప్తున్నారు. నిజాంపట్నం, వాడరేవు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఫిషింగ్ జెట్టీలను నెలకొల్పాలని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీటిని వాన్‌పిక్ భూముల్లో ఏర్పాటు చేస్తారా లేక మరోచోట నెలకొల్పుతారా అనేది తేలలేదు. కాగా తాజాగా అసైన్డ్ చట్టాన్ని సవరించేందుకు అవసరమైన బిల్లుకు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు మంత్రులు తప్పుపడుతున్నట్లు తెలియవచ్చింది. అసైన్డ్ చట్టాన్ని సవరించటమంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని వారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే జగన్ అవినీతిపై సమరం ప్రారంభించారు. ఇందులో భాగంగానే అసైన్డ్ చట్టానికి సవరణలు తీసుకురావాలని భావించినట్లు వినికిడి. అయితే ఈ వివాదాల వల్లే తాను పరాజయం పొందానని తన నియోజకవర్గంలో హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయని శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి అభ్యంతరాలు లేవనెత్తటంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లు సమాచారం.