రాష్ట్రీయం

పత్రికారంగంలో మేరు శిఖరం గోరాశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: పత్రికారంగానికి ఆంధ్రభూమి మాజీ సంపాదకుడు గోరాశాస్ర్తి ఆజానుబాహువని, మేరు శిఖరమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం నాడు సాహిత్య అకాడమి, వయోధిక పాత్రికేయుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన గోరాశాస్ర్తీ శతజయంతి ఉత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు జీఎస్ వరదాచారి అధ్యక్షత వహించారు. తొలుత గోరాశాస్ర్తి కి నివాళులు అర్పించిన ఉప రాష్టప్రతి అనంతరం మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పిన గోరాశాస్ర్తీ జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడని, అటువంటి మహానీయుల జీవితాలు జర్నలిజం విద్యార్థుల కరిక్యులమ్‌లో చేర్చాలని ఉప రాష్ట్రపతి హితవు పలికారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలనేదే తన అభిమతమని, అలా అంటే ప్రభుత్వాన్ని ఊదరగొట్టమనే అర్థం కాదని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ఎత్తి చూపి దేశ ప్రజల ఆలోచనలను సకారాత్మక దిశగా మళ్లించాలని పిలుపునిచ్చారు. పత్రికలు వ్యక్తిగత వ్యాపార సాధనాలు కారాదని, సమాజ పురోగతికి మార్గదర్శకాలు కావాలని అన్నారు. పాత్రికేయులు తలెత్తుకునేలా
వ్యవహరించాలని, అందరికీ ఆదర్శప్రాయంగా మెలగాలని అన్నారు. సంపదను ప్రతి ఒక్కరూ రూపాయిల్లోనే లెక్కిస్తారని, నిండైన పదజాలంతో సంపదను అక్షరాల్లో లెక్కించిన సాహితీ మూర్తి గోరాశాస్ర్తి అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సంపదను అక్షరాలతో లెక్కించేవారినే ప్రపంచం గుర్తుంచుకుంటుందని, అదే మార్గంలో వెళ్లిన గోరాశాస్ర్తీని నేటికీ స్మరించుకుంటున్నామని అన్నారు. గోరాశాస్ర్తి సంపాదకీయాల కోసమే ఆనాడు ఆంధ్రభూమిని చదివేవారని, అలాంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. వారి జీవితాన్ని ఈ తరం పాత్రికేయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువ చూపే రోజుల్లో రైల్వే ఉద్యోగాన్ని వదిలి సాహిత్యంపైనా, జర్నలిజంపైనా మక్కువతో గోరాశాస్ర్తి ఈ రంగానికి వచ్చారని, తెలుగు, ఆంగ్లభాషల్లో ఏకకాలంలో సంపాదకీయాలు రాయగల సాహితీ సవ్యసాచిగా పేరుతెచ్చుకున్నారని అన్నారు. గోరాశాస్ర్తి ఏ భాషలో రాసినా చెణుకులు, చతురత, విమర్శల విషయంలో పరిధి దాటి వెళ్లలేదన్న ఉపరాష్ట్రపతి , వారి సంపాదకీయాలను పాఠకుల జ్ఞాన సంపాదనకు మార్గాలుగా భావించేవారని గుర్తు చేశారు. ఈ తరం జర్నలిస్టులకు ఇలాంటి మహనీయుడి జీవితాన్ని, సంపాదకీయాలను పాఠాలుగా బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నిర్వహించిన ‘స్వతంత్ర’ పత్రికలో పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆంధ్రభూమి సంపాదకుడిగా తెలుగు ప్రజలకు, సాహితీకారులకు అత్యంత చేరువయ్యారని అన్నారలు. నిజాన్ని నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు రాయడం గోరాశాస్ర్తీ ప్రత్యేకత అని అన్నారు. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, విమర్శనూ సమపాళ్లలో కలుపుతూ రాయడం అంత సులభం కాదని తెలిపారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం తర్వాత గోరాశాస్ర్తీ ఆంధ్రభూమి సంపాదకీయంలో రాసిన సంపాదకీయాన్ని గుర్తుచేశారు. గోరాశాస్ర్తి ఒక పార్టీకీ, వర్గానికీ చెందని వ్యక్తి అని, తనకు సన్నిహితులైన వ్యక్తుల్ని సైతం సునిశితంగా విమర్శించడంలో గోరాశాస్ర్తి ఏనాడూ సంకోచించలేదని, వారి ప్రతి సంపాదకీయం పాఠకుడితో మాట్లాడినట్టు ఉండేదని అన్నారు. గోరాశాస్ర్తి దూరదృష్టిని గుర్తుచేసిన ఉప రాష్ట్రపతి కలగూరగంప పార్టీలు ఒక విచిత్రమైన సమాఖ్య అని చెప్పారని, నేటి రాజకీయ పరిస్థితులకు అది అద్దం పడుతుందని పేర్కొన్నారు. తెలుగు పాత్రికేయులు అందర్నీ ఒకే చోట కలవడం ఆనందంగా ఉందని, పాత మిత్రులను కలవడం అమ్మమ్మను కలిసినంత సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు భాషకూ, పాత్రికేయ వృత్తికీ మరింత గౌరవాన్ని తెచ్చిపెడతాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సాహిత్యంలో ఉందని, ముఖ్యంగా మాతృభాష సాహిత్యం మన గతాన్ని తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గోరాశాస్ర్తి సంపాదకీయాల సంకలనం వినాయకుడి వీణ పుస్తకం, మోనోగ్రాఫ్‌నూ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమి కార్యదర్శి కే. శ్రీనివాసరా, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు జీఎస్ వరదాచారి, కార్యదర్శి కే. లక్ష్మణరావు, ఉడయవర్లు, ఎన్. శ్రీనివాసరెడ్డి, రాధాకృష్ణ, బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రభూమికి ప్రశంసలు
సదస్సులో వక్తలంతా ఆంధ్రభూమి పత్రిక, అందులోని సంపాదకీయాలను ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు. ఆనాడే ఆంధ్రభూమి ప్రథమశ్రేణి పత్రిక అయ్యిందని ఉప రాష్ట్రపతి కొనియాడారు. అందరూ ఒకమారు ఆంధ్రభూమి ఘనకీర్తిని గుర్తుచేసుకున్నారు.
ఫిరాయింపులపై సెటైర్లు
ఉప రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తుత రాజకీయాలపై విసుర్లు వేశారు. ప్రతి ఊరిలో మున్సిపల్ శాఖ అధికారులు బోర్డులు పెట్టాలని, నిన్న, నేడు, రేపు అంటూ బోర్డులు పెట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నారో రాస్తే ప్రజలకు ఏ రోజుకారోజు అర్థమవుతుందని పార్టీల ఫిరాయింపులపై సెటైర్లు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని, ప్రజలే ఖచ్చితంగా ఉన్నారని, కానీ ఎగ్జిట్ పోల్స్ వ్యాపారంగా మారిందని పరోక్షంగా విమర్శించారు.
చిత్రం...హైదరాబాద్‌లో శనివారం గోరాశాస్ర్తి శయజయంతి సదస్సులో ప్రసంగిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు