రాష్ట్రీయం

ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముడికి ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 15: రెండవ భద్రాద్రిగా వాసికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమం టిటిడి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీశ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్ నాయుడు ఉన్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య టిటిడి యంత్రాంగం మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేదపండితులు తరలివచ్చి వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే తరహాలోనే కోదండరామునికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం 9గంటల నుంచి గంట సేపు వైష్ణవ ఆగమశాస్త్ర ప్రకారం వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ముందుగా విష్వక్సేన పూజ, బలిహరణ, అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు జరిపారు. టిటిడి జెఇఓ పోలా భాస్కర్ నేతృత్వంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమం అనంతరం టిటిడి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది.
ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లా నుంచే గాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8గంటలకే క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు మూడుగంటల సేపు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒంటిమిట్టలో ధ్వజారోహణం చేస్తున్న దృశ్యం