రాష్ట్రీయం

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 15: చలువ పందిళ్ళలో అశేష భక్తజనం తదేకంగా కళ్లప్పగించి చూస్తుండగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఖమ్మం జిల్లా భద్రాచలంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలే నూతన స్వర్ణకవచ ధారులైన ఉత్సవమూర్తులకు కల్యాణం విశేషంగా జరిపించారు. వేదమంత్రాల మధ్య జగదభిరాముడు సీతమ్మ వారి మెడలో జనక, దశరథ, రామదాసులు తయారు చేయించిన మూడు మంగళసూత్రాలతో మాంగల్యధారణ చేశారు. ఈ అపురూప ఘట్టం తిలకిస్తున్న వేలాది మంది భక్తజనం జై శ్రీరాం.. అంటూ నినదించడంతో మిథిలానగరి పులకించిపోయింది. సకల దేవతలకు ప్రీతిపాత్రమైన వైకుంఠ రాముడు పెళ్లికుమారునిగా దివ్యమంగళ రూపంతో వెలిగిపోగా, జనకమహారాజు గారాలపట్టి, అపురూప లావణ్యవతి జానకీదేవిని నయన మనోహరంగా అలంకరించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సంప్రదాయంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈఓ సాంబశివరావు, డాలర్ శేషాద్రి సుదర్శన పర్కం సమర్పించారు. ముందుగా మూలవరులకు ప్రత్యేక ఆరాధన చేసి స్వామికి అభిషేకం చేశారు. ఆ తర్వాత నీలమేఘశ్యాముడు ధీరోధాత్తుడిగా ఆశీనుడై, సీతామహాలక్ష్మీ వినయ సంపన్నురాలిగా కూర్చుని ఊరేగింపుతో మిథిలానగరానికి వచ్చారు. విశ్వక్సేనుడికి పూజలు నిర్వహించే ప్రక్రియతో పెళ్లి సంబరం ప్రారంభమైంది. శ్రీరాముడు, సీతమ్మల ఆశీస్సులను భక్తులకు అందించడానికి పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. సీతమ్మకు 12 దర్బలు, 24 అంగుళాలతో చేసిన యోక్రదర్బను దోషనివారణకు నడుముకు ధరింప చేశారు. ఈ యోక్రధారణ తెలుగువారి వివాహాల్లో చేస్తారు. గర్భధారణ సమస్యలు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు. స్వామివారికి బంగారు యజ్ఞోపవీత ధారణ చేశారు. కీలకమైన కాళ్లు కడిగి కన్యాదానం చేసే వరపూజ పూర్తి చేశారు. సీతామహాలక్ష్మికి చింతాకుపతకం, రాములవారికి పచ్చలహారం, లక్ష్మణుడికి రామమాడ వేశారు. మధుపర్క వస్త్రాల నివేదనతో వధూవరులు అలంకార శోభితులయ్యారు. అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో పెళ్లి ప్రధాన ఘట్టం పూర్తయ్యింది. ఆ తర్వాత రాములవారు జానకమ్మ మెడలో మాంగల్యధారణ చేశారు. సంప్రదాయంగా పూబంతి ఆటను చేపట్టిన తర్వాత తలంబ్రాలు పోయించారు. వివాహ ఘట్టం ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రుల ఉత్సవ కల్యాణమూర్తులు ఊరేగింపుగా గర్భాలయానికి రాగా ఆరాధన, మంగళాశాసనములు జరిపించారు. అర్చనలు, హోమం జరిపిన తర్వాత స్వామి సూర్యచంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
నేడు శ్రీరాముని పట్ట్భాషేకం
కల్యాణం మరుసటి రోజు శనివారం మహాపట్ట్భాషేకాన్ని నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతున్నారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటున్నారు.