రాష్ట్రీయం

అమరావతిపై నీలి నీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో వైకాపా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణంపై కమ్ముకున్న అనుమానాల నీలినీడలు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మరింత బలపడ్డాయి. రాష్ట్ర రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తారన్న ప్రచారానికి మంత్రి బొత్స తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఊతం ఇస్తున్నాయి. దీంతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కలగా మిగలనుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. వివిధ నిర్మాణాలకు అంచనా వ్యయం భారీగా పెంచారన్న ఆరోపణలపై ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, వరద ముంపు ఉందన్న కారణంతో రాజధానిని మరోచోట నిర్మించుకోవడం మేలని భావిస్తోందనే అనుమానాలతో ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నట్లైంది. భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర కోసం ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అమరావతిని నిర్మించేందుకు ప్రతిపాదించారు. 29 గ్రామాల పరిధిలో 33,527 ఎకరాల భూమిని సమీకరించారు. భూ సమీకరణ విధానం దేశంలోనే తొలిసారిగా అమలు చేయడం విశేషం. రాజధానిని 1.09 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. వౌలిక వసతుల కల్పనకు దాదాపు 62,623 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని భావించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం 1500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. బ్రిటన్‌కు చెందిన నార్మన్ అండ్ ఫోస్టర్ సంస్థతో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలుగా అభివృద్ధి చేసేందుకు డిజైన్ చేయించింది. అమరావతి నగరానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ రూపొందించగా, పరిపాలనా నగరాన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు 8000 ఎకరాలను విక్రయించేందుకు వీలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంక్, ఏఐఐబి 550 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందచేసేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు 39,875 కోట్ల రూపాయల మేర పనులు జరుగుతున్నాయి. 4214 కోట్ల రూపాయల పనులు టెండరు దశలో ఉండగా, మరో 7500 కోట్ల రూపాయల మేర పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. 65 శాతం మేర రహదారులు, 45 శాతం మేర భవనాలు, 25 శాతం మేర అధికారులు, మంత్రులు, ఇతర ఉద్యోగుల భవనాలు పూర్తి అయ్యాయి. వైకుంఠపురంలో
ఐకానిక్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ విద్యా సంస్థలకు, ఇతర సంస్థలకు స్థలాలను కేటాయించారు. ఈ దశలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిలో నిర్మాణాలు నిలిపివేసింది. అంచనా వ్యయాన్ని పెంచి టెండర్లు పిలిచారని, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయంటూ ప్రస్తుత ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉండగా, రాజధాని నిర్మాణానికి భారీ నిధులు కేటాయించడం సాధ్యం కాదని రాష్ట్ర ఫ్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ రుణాలు ఇచ్చే ప్రతిపాదనను విరమించుకున్నాయి. దాదాపు 39 వేల కోట్ల రూపాయల మేర రాజధాని పనులు జరుగుతుండగా, రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఈ ఏడాది కేవలం 500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం ప్రభుత్వ వైఖరిని చెప్పకనే చెప్పిందవచ్చు. తాజాగా కృష్ణనది వరద నీరు రాజధాని ప్రాంతంలో చేరడంతో ముంపునకు గురైయ్యే అవకాశం ఉందని మంత్రి బొత్స, మరికొందరు అధికార పార్టీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం సురక్షితం కాదని, నల్లమట్టి భూములు కావడంతో పునాది ఎక్కువ లోతులో వేయాల్సి ఉంటుందని, అనేక వంతెనలు వంటివి నిర్మించాల్సి ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. దీని వల్ల రాజధాని నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందని, దీనికన్నా తక్కువ వ్యయంతో మరోచోట రాజధాని నిర్మించుకోవచ్చని చెప్పడంతో అమరావతి ప్రాజెక్టు అటకెక్కించేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు భావించవచ్చు. దీంతో భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధర గణనీయంగా పడిపోగా, మరింతగా పడిపోనున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగార్జున వర్సిటీ సమీపంలోకి రాజధానిని మార్చే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.