రాష్ట్రీయం

ఉద్యోగులకు జియో ట్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య మరింత అంతరాన్ని పెంచనున్న మరో వివాదాస్పద నిర్ణయానికి బుధవారం శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల రోజువారీ అత్తాపత్తా తెలుసుకోవడానికి వారి మొబైల్ ఫోన్లలో జియో ట్యాగింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రయోగత్మక ప్రక్రియను బుధవారం చేపట్టింది. ఈ నెల 31లోగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు జియోట్యాగింగ్ యాప్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులను జియో ట్యాగింగ్ చేసే విధానాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతటి కీలక నిర్ణయాన్ని తమతో చర్చంచకుండా గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయడం పట్ల ఉద్యోగులు, వారి సంఘాలు విస్తుపోతున్నాయి. ప్రయోగత్మకంగా జియోట్యాగింగ్‌ను మొదట వైద్యఆరోగ్యశాఖలో అమలు చేసి, ఆ తర్వాత దశల వారీగా అన్ని శాఖలకు వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఏ శాఖ ఉద్యోగులకు అమలు చేయని జియోట్యాగింగ్ తమకే ఎందుకు అమలు చేస్తారని వైద్యశాఖ ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వాపోయారు. అయితే సదరుశాఖ మంత్రినైనా
తనకే తెలియకుండా అమలు చేస్తారా? అని ఆయన కూడా ఆశ్చర్యపోయినట్టు తెలంగాణ ఆయూష్ మెడికల్ ఆఫీసర్స్ అసొసియేషన్ వాపోయింది. మంత్రికి సమాచారం లేకుండానే బుధవారం నుంచి జియో ట్యాగింగ్‌ను చేపట్టింది. ఇలా ఉండగా ఉద్యోగుల రోజువారి హాజరును తెలుసుకోవడానికి జియో ట్యాగింగ్ విధానం అమలు చేయడంపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఆయూష్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఇప్పటికే సంబంధిత రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాల (హైదరాబాద్, వరంగల్) ఉద్యోగులకు పలు దఫాలుగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాల వారీగా ఉద్యోగుల జియో ట్యాగింగ్‌కు ఆయూష్ డైరెక్టర్ విడుదల చేసిన షెడ్యూల్డ్ ప్రకారం ఆగస్టు 21న కరీంనగర్, 22న మెదక్, 23న మహబూబ్‌నగర్, 26న వరంగల్, 27న ఖమ్మం, 28న నల్లగొండ, 29న నిజామాబాద్, 30న ఆదిలాబాద్, 31న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చేపడుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. జియో ట్యాగింగ్ చేయడానికి జిల్లాలకు సాంకేతిక నిపుణులు రానుండటంతో ఈ పది రోజుల వ్యవధిలో రెగ్యులర్/కాంట్రాక్టు ఆయూష్ వైద్యులు, కంపౌండర్లు, అటెండర్లు అందుబాటులో ఉండాలనీ, ఎవరైనా సెలవుపై వెళ్లి ఉంటే రద్దు చేసుకొని విధులకు హాజరుకావాలని ఆయూష్ డైరెక్టర్ మెమో నంబర్ 3489/ఇ1/2019 ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
జియో ట్యాగింగ్‌ను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగుల హాజరుకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు (యూనిట్ల) మాత్రమే జియో ట్యాగింగ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులు, కుంటలకు మాత్రమే జియో ట్యాగింగ్ చేసింది తప్ప మరే శాఖలో ఉద్యోగులకు జియో ట్యాగింగ్ చేయలేదు. జియో ట్యాగింగ్ చేయాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండాలి. ప్రయోగత్మకంగా జియో ట్యాగింగ్ చేపట్టిన ఆయూష్ శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది వద్ద సొంత ఫోనే్ల ఉన్నాయి తప్ప ప్రభుత్వం సరఫరా చేయలేదు. తమ సొంత ఫోన్లలో జియో ట్యాగింగ్ యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తారని, అది తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని వారు వాపోతున్నారు. ఆయూష్ డిస్పెన్సరీలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. తాము పని చేసే మారుమూల ప్రాంతంలో నివాసం ఉండటానికి ఎలాంటి వౌలిక సదుపాయాలు కల్పించకుండా, ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేయకుండా జియో ట్యాగింగ్ ఎలా చేస్తారని ఆయూష్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వౌలిక సదుపాయాలు లేని కారణంగా జిల్లా అధికారులే తాము విధులు నిర్వహించే చోట నివాసం ఉండటం లేదని, వారికే లేని నిబంధనలు తమకే ఎలా వర్తిస్తాయని మెడికల్ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ అంశాన్ని తెలంగాణ అధికారుల సంఘం, రాష్ట్ర ఎన్జీవోల సంఘం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ ఆందోళనకు కార్యాచరణను ప్రకటించడానికి మెడికల్ అధికారుల సంఘం సన్నద్ధం అవుతోంది. పీఆర్‌సీ ప్రకటించక పోవడం, ఎన్నికల సమయంలో బదిలీ చేసిన సిబ్బందిని తిరిగి వారి స్థానాలకు పంపకపోవడం, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందిని సొంత రాష్ట్రానికి తీసుకరాకపోవడం, రెవెన్యూశాఖలో ప్రక్షాళన తదితర అంశాలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అంతరం పెరిగింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని ఉద్యోగ సంఘాలు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జియో ట్యాగింగ్ హాజరు విధానాన్ని అమలు చేయడం వారి అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జియో ట్యాగింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లనుందో వేచి చూడాలి.