రాష్ట్రీయం

యాదాద్రిలో వివాదాస్పద శిల్ప చిత్రాల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 8: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాకార మండపాల రాతి స్తంభాలపై చెక్కిన వివాదాస్పద శిల్పాలను ఆదివారం ఆలయ స్థపతి డాక్టర్ వేలు పర్యవేక్షణలో శిల్పులు తొలగించారు. వాటి స్థానంలో నూతన శిల్పాలను చెక్కే పనులు ప్రారంభించారు. వివాదాస్పదమైన సీఎం కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, కేసీఆర్ కిట్, హరితహారం, కమలం గుర్తు, చార్మినార్, మహాత్మాగాంధీ, ఇందిర, రాజీవ్‌గాంధీల శిల్పాలను, ఇతర మత చిహ్నాల శిల్పాలను తొలగించారు.
సదరు శిల్పాల తొలగింపుతో ప్రాకార స్తంభాల సొబగులు దెబ్బతినకుండా వాటి స్థానంలో నూతన శిల్పాకృతులను చెక్కిస్తున్నారు. దేవుళ్ల చిత్రాలు, హంస, ఉదయించే సూరీడు, మబ్బులు, పక్షులు, లతలు, పుష్పాలు, పూలు తదితర ప్రకృతి సంబంధిత దృశ్యాలు, జంతువుల బొమ్మలను చెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా స్థపతి డాక్టర్ వేలు మాట్లాడుతూ ఆలయ ప్రాకారాలపై వివాదాస్పదమైన శిల్పాలను తొలగించామని, సదరు శిల్పాలకు ఇంకా పూర్తి స్థాయి ఆకృతి ఇవ్వనందున తొలగింపు సులభతరమైందని, అలాగే వాటి స్థానంలో కొత్తవి చెక్కడానికి అవకాశం ఏర్పడిందన్నారు. తొలగించిన శిల్పాల స్థానంలో దేవుడి సంబంధిత శిల్పాలను, లతలు, పుష్పాలు చెక్కిస్తున్నామన్నారు. 1000 మంది శిల్పులు ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నందున ఒకరిద్దరు తమ అభిమానంతో శిల్పాలను చెక్కి పొరపాటు చేశారన్నారు. ఈ విషయాన్ని స్వల్పంగా సదరు శిల్పి కూడా అభిమానంతో చేసినట్టుగా వెల్లడించడం తెలిసిందేనన్నారు. ఇకమీదట ఈ తరహా పొరపాట్లు జరగకుండా మరింత జాగ్రత్తతో ఆలయ నిర్మాణ పనులు ముందుకు తీసుకెళతామన్నారు.
ఆలయంపై నాయకుల, పార్టీల బొమ్మలు
దుస్సంప్రదాయం: వీహెచ్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాకార రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మ, కారుగుర్తు, ప్రభుత్వ పథకాల బొమ్మలు, నాయకుల బొమ్మలు ఇతర మతాల చిహ్నాలు చెక్కించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం దుస్సంప్రదాయానికి ఒడిగట్టిందని ఏఐసీసీ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించి శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఆలయంలో వివాదాస్పద చిత్రాలను తొలగించడం ద్వారా తప్పు సరిదిద్ధుకున్నప్పటికీ ఈ తప్పుకు బాధ్యులైన ఆర్కిటెక్ట్‌ను, స్థపతిని, శిల్పులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల కోసం నాయకుల బొమ్మలు, పార్టీల గుర్తులు, పథకాల చిహ్నాలు చెక్కామంటూ, శిల్పి సీఎం కేసీఆర్‌ను దేవుడిగా భావించి శిల్పాన్ని చెక్కారంటూ అధికారులు చెప్పడం అసంబద్ధంగా ఉందన్నారు. శిల్పి అధికారులు చెప్పిందే చేస్తారని తాను భావిస్తున్నానని ఈ శిల్పాల వెనుక ప్రభుత్వ ప్రమేయం లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుని తమ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. రాజుల కాలం నుండి నేటి దాకా దేవాలయాల్లో ఇలాంటి చిత్రాలు చెక్కలేదన్నారు. దేవుడి ఆలయంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ, కేసీఆర్ ఇలా ఎవరి బొమ్మలు చెక్కినా తప్పుగా భావించాల్సిందేనని, ఆలయ సంస్కృతిని, భక్తుల విశ్వాసాలను కించపరిచినట్లవుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడికి దేశంలోనే గొప్ప ఆలయాన్ని కేసీఆర్ నిర్మింపచేస్తుండటాన్ని భక్తులతో పాటు తాను కూడా స్వాగతించానని, కాని ఆలయంలో ఆయన బొమ్మలు, పార్టీ గుర్తులు, పథకాల బొమ్మలు చెక్కించుకోవడంతో అందరి ఆగ్రహానికీ గురయ్యారన్నారు.