రాష్ట్రీయం

‘మహా’ జిల్లాను తెలంగాణలో కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయని పక్షంలో గ్రామాలను తెలంగాణలో కలపాలని మహారాష్టలోని నాందేడు జిల్లాకు చెందిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో త్వరలో మహారాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. మంగళవారం వారు శాసనసభ ఆవరణలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అనుమతి ఇస్తే తాము టీఆర్‌ఎస్ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరారు. నాందేడ్ జిల్లాకు చెందిన నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, రైతులు తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్న బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ‘మా గ్రామాలన్నీ తెలంగాణ రాష్ట్ర గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితికి చాలా భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో రైతులకు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేమంతా బాధల్లో ఉన్నాం. తెలంగాణలో రైతులకు ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయాల సహాయం రైతుబంధు పథకం ద్వారా అందుతుంది.
మా రాష్ట్రంలో రైతులకు ఇలాంటి సాయమేదీ లభించడం లేదు. అలాగే తెలంగాణలో రైతుబీమా అమలు అవుతుంది. ఇది కూడా మహారాష్ట్రంలో లేదు. తెలంగాణలో పేదలకు నెలకు 2 వేల పెన్షన్ ఇస్తున్నారు. మా రాష్ట్రంలో ఇది 6 వందలు మాత్రమే. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మహారాష్ట్రంలో 8 గంటలు ఇస్తామని ఆరు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాహ సంబంధాలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, పండుగలకు దుస్తుల పంపిణీ వంటి ఎన్నో పథకాలు మహిళలకు అందుతున్నాయి. మహారాష్ట్రంలో ఇలాంటి పథకాలేలు లేవు. ఇక్కడ బ్రహ్మాండగా రోడ్లు ఉన్నాయి. మా వద్ద అధ్వాన్నంగా ఉన్నాయి’ వారు సీఎం వద్ద వాపోయారు. ‘సాగునీటి విషయంలో కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది, బాబ్లీ గ్రామంలోనే నీళ్లు లేవు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరామ్‌సాగర్ నింపితే బ్యాక్ వాటర్ ద్వారా తమ గ్రామాలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది’ అని వారన్నారు. తెలంగాణకు పక్కనే తమ గ్రామాలు ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఎంతో తేడా ఉందన్నారు.
ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుండటంతో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని గతంలో ధర్మాబాద్ తాలుకాకు చెందిన 40 గ్రామాల ప్రజలు తీర్మానం చేసినట్టు వారు సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ గ్రామల అభివృద్ధికి 40 కోట్లు కేటాయించినట్టు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో ఐదు నియోజకవర్గాలకు చెందిన గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలా అమలు చేయని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నామన్నారు. ఈ డిమాండ్‌తోనే ఉద్యమం చేస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, తమకు అవకాశం కల్పిస్తే టీఆర్‌ఎస్ టికెట్‌పైనే పోటీ చేస్తామన్నారు. నిజాం హయాంలో తామంతా హైదరాబాద్ స్టేట్‌లో ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పటికీ తాము బతుకమ్మ, బోనాల పండుగలను నిర్వహించుకుంటున్నట్టు వివరించారు. తమ ఐదు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ తదితర ముఖ్యమైన పార్టీలకు చెందిన నేతలతో కలిసి వచ్చి కలుస్తామని వారు వెల్లడించారు. నాందేడ్ జిల్లా ప్రజలతో పాటు బీవండి, షోలాపూర్, రజూర తదితర ప్రాంతాల నుంచి కూడా టీఆర్‌ఎస్ టికెట్ కావాలని కోరుతున్నారని ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నాందేడ్ ప్రజల సమంజసమైన డిమాండ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు.

*చిత్రం...ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నాందేడ్ సమస్యలు తెలియజేస్తున్న మహారాష్ట్ర నేతలు