రాష్ట్రీయం

అక్రమాలకు ప్రభుత్వానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నాలుగు నెలల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులకు పాలకుల అనుభవ రాహిత్యం, చేతకానితనం, పక్షపాత వైఖరి, కక్షసాధింపు చర్యలే కారణమని విమర్శించారు. సక్రమమైన పరిపాలనకు అనుభవం ఎంత అక్కరకు వస్తుందో, కార్యదక్షత అంతకుమించి దోహదపడుతుందని ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ పేరిట విడుదల చేసిన ఓ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో ప్రవేశ పరీక్షలు జరిగాయని, లక్షలాది ఉద్యోగులు ఎంపికయ్యారని ఆయన గుర్తుచేశారు. అయితే మునుపెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు, అవకతవకలతో గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు నిర్వహించడం బాధాకరమని చంద్రబాబు నిరసన తెలిపారు. ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ జూలై 26న వస్తే సెప్టెంబర్ 1 నుండి 8 వరకు పరీక్షల ప్రక్రియ చేపట్టారని, 19,50,582 మంది అభ్యర్థులు 14 కేటగిరీల్లో పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం ఉద్యోగాలు 1,26,728కి గాను 1,98,164 మంది అర్హత సాధించారని, 56రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారేతప్ప ఎన్ని అవకతవకలు జరిగాయో గాదికొదిలేశారన్నారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్థుల ఆశలను పూర్తిగా వమ్ముచేసి ప్రభుత్వ ప్రవేశ పరీక్షల ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారని ఆయన ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రం లీకేజీ ఏదో ఫ్యామిలీ ప్యాకేజీలా మారిందని, అయినవాళ్లకు అందలాలు, కానివాళ్లకు మార్కుల కోతలు జరిగాయన్నారు. ప్రశ్నపత్రం టైప్ చేసిన వ్యక్తే పరీక్షలో టాపర్‌గా రావటం ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే ఏపీపీఎస్సీలో ఏఎస్‌ఓ సోదరుడికి ఒక కేటగిరీలో టాప్ ర్యాంక్, ఇంకో కేటగిరీలో 3వ ర్యాంక్ వచ్చాయన్నారు. వారి బంధువులు, స్నేహితులే మంచి మార్కులు సాధించారనే వార్తలే ప్రశ్నపత్రం లీకేజీ అయ్యిందనడానికి తిరుగులేని రుజువుగా చంద్రబాబు ఆరోపించారు. ‘కీ’లో అత్యధిక మార్కులు వచ్చినవాళ్లకు ఫలితాల్లో అరకొరగా మార్కులు రావడం, హెల్ప్‌లైన్‌కు వందలసార్లు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్థులే ఆరోపించడం పరీక్ష అధ్వాన నిర్వహణకు అద్దం పడుతోందన్నారు. ఈ అన్ని అంశాలకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ బాధ్యత ఎంతంటూ మీడియాలో వస్తున్న ప్రశ్నలతో పాటు ఉద్యోగాలు రాక నిలదీస్తున్న అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ‘గ్రామ వలంటీర్లలో 90శాతం ఉద్యోగాలు మన కార్యకర్తలచే వచ్చాయి. నా దగ్గర వాటికి సంబంధించిన లెక్కలన్నీ ఉన్నాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాలు కూడా మన కార్యకర్తలకే వచ్చాయి’ అని మీ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాహాటంగా ప్రకటించిన వీడియో క్లిప్పింగులే ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు, అక్రమాలకు ప్రబల సాక్ష్యంగా నిలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారో, లేక మీ మంత్రులు రాజీనామా చేయాలో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా జరిగిన ఈ పరీక్షలను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రికి సూచించారు.

*చిత్రం... ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు